– బాబు ఐదేళ్ళ పాపాలకు ప్రజలు ఇచ్చిన తీర్పే 23 సీట్లు
– 600 హామీలు ఇచ్చి ప్రజలను వంచించిన మోసగాడు చంద్రబాబు.. 95 శాతం హామీలు అమలు చేసిన మొనగాడు జగన్
– విధ్వంసం.. వంచన.. మోసం.. వీటన్నింటికీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే
– 2014లో ఊపిరి పోసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ కు ఉరి వేసింది టీడీపీనే
– రూ. 1.75 లక్షల కోట్లు పేదల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసింది
– బాబు 4 లక్షల కోట్లు అప్పులు చేసి ఎవరికి మేలు చేశారు..?
– టీడీపీ చార్జిషీట్ పుస్తకంపైన ఉండాల్సింది చంద్రబాబు ఫోటోనే
– అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ళలోనే దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం
– అంధ్రా, తెలంగాణల్లో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ.. ఇక అండమాన్ కు పారిపోవాల్సిందే
– సీపీఐ నారాయణ పెద్ద జోకర్..
– వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఫైర్
కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
ఐదేళ్ళూ రాష్ట్రాన్ని నాకేసి.. ఇప్పుడు కాపాడతాం అంటారా..?
ఉమ్మడి రాష్ట్రంలోనూ అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్‌ను సర్వ నాశనం చేసి, విభజన తర్వాత ముఖ్యమంత్రి అయి కూడా, తన స్వార్థం కోసం, రాష్ట్రంలో ఉన్న సహజ వనరులన్నింటినీ దోచుకుని, రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి, కేవలం తన పార్టీ నేతలకు, తన తాబేదార్లకు ఆస్తుల్ని, సంపదను సృష్టించడం కోసం, అప్పుడే ఊపిరి పోసుకుంటున్న రాష్ట్ర భవిష్యత్తును చిదిమేసిన నాయకుడు చంద్రబాబు. అయితే, అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే 95శాతానికి పైగా ఎన్నికల హామీలు అమలు చేసిన ముఖ్యమంత్రిగా, ప్రజా నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి ప్రజల మన్ననలు, జేజేలు పొందుతుంటే.. చూసి ఓర్వలేని టీడీపీ, ఈ ప్రభుత్వం మీద ఛార్జ్‌షీట్ విడుదల చేయడం చాలా హాస్యాస్పదం. టీడీపీ అధికారంలో ఉండగా, పేద ప్రజలు, కార్మికుల ఆరోగ్యాలను, వారి ప్రాణాలను ఫణంగా పెడుతూ, ఈఎస్ఐ కుంభకోణానికి పాల్పడి, ఆఖరికి కార్మికుల మందుబిళ్లలు కూడా అమ్ముకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ ఛార్జ్‌షీట్ విడుదల చేయడం మరింత సిగ్గుచేటు. అధికారంలో ఉన్న అయిదేళ్లు రాష్ట్రాన్ని నాకేసి, షేవ్ చేసి, అధోగతి, అప్పులపాలు చేసిన టీడీపీ, ఈ రాష్ట్రాన్ని కాపాడతామని చెప్పడం అంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది.
600 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చని మోసగాడు బాబు
చంద్రబాబు చేసిన అయిదేళ్ల పాపాలకు జనాలు ఛీత్కరించి 23 సీట్లు ఇచ్చి, ఇంట్లో కూర్చోపెట్టినా కూడా సిగ్గులేకుండా ఇంకా ప్రజలను నమ్మించడానికి, మాయ మాటలతో మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే రాష్ట్ర ప్రజలను వంచించడం ప్రారంభించాడు. ఎవరు ప్రజలను మోసం చేశారు, వంచన చేశారు, వెన్నుపోటు పొడిచారు అనేదానిపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. 2014 ఎన్నికల్లో ప్రజల్లో లేని ఆశలు రేకెత్తించి, ఊహల్లో విహరింపచేసి… రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు.. అన్నీ మాఫీ చేస్తామని, నిరుద్యోగులకు భృతి, వంద గజాల ఇళ్ల స్థలాలు ఇస్తామని 600కు పైగా హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఇది సాధ్యం కాదంటూ తప్పించుకుపోయిన చంద్రబాబు మోసగాడు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూ.చ తప్పకుండా అమలు చేసిన మొనగాడు జగన్.
– అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీలు 95శాతంకు పైగా అమలు చేసిన జగన్ ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్ విడుదల చేయడానికి తెలుగుదేశం పార్టీకి సిగ్గులేదా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. చార్జిషీట్ వేయాల్సింది- ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ఎగ్గొట్టి, ప్రజలను దారుణంగా వంచించిన చంద్రబాబు మీద వేయాలి తప్పితే మా మీద కాదు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అన్యాయాలు, అక్రమాలు, వంచనలు, నేరాలు -ఘోరాలు, హత్యా రాజకీయాలు చేసింది చంద్రబాబే.
– ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి ప్రజలకు కొన్ని హామీలు ఇస్తుంది. ఆ హామీల అమలే ఆ ప్రభుత్వ విజయానికి కారణం. మీరు ఇచ్చిన హామీలు తుంగలోకి తొక్కబట్టే ప్రజలు మిమ్మిల్ని ఇంటికే పరిమితం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేసి, కొత్త వ్యవస్థలను సృష్టించి, ప్రజలకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రిపై అభాండాలు వేస్తారా?
– అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు కల్పించింది మా ప్రభుత్వం. గ్రామ సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ, ఆర్బీకేలను తీసుకువచ్చి ప్రజల సమస్యలను వాళ్ల ఇళ్ల మధ్యే పరిష్కరించాలని, పరిపాలన వాళ్ల ముంగిటకు చేరాలని ముఖ్యమంత్రి పరిపాలన చేస్తుంటే విధ్వంసం అని మాట్లాడతారా?
– రుణమాఫీ చేస్తామంటూ రైతు సోదరులను, డ్వాక్రా రుణాలు మాఫీ అక్కచెల్లెమ్మలను, ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ పేదలను మీరు మోసం చేశారు. చంద్రబాబు నాయుడిది వంచనా.. లేక.. ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్న జగన్ ది వంచనా?
– టీడీపీ విడుదల చేసి ఛార్జ్‌షీట్ పైన ఉండాల్సింది జగన్ ఫోటో కాదు… చంద్రబాబు నాయుడి ఫోటోనే ఉండాలి. ఎందుకంటే మోసం చేసిందీ, వంచన చేసిందీ, వెన్నుపోటు పొడిచిందీ చంద్రబాబే గనుక. దీనిపై మేము ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం.
సంక్షేమ పథకాల కోసం టీడీపీ హయాంలో దేబిరించేవాళ్ళు.. జగనన్న పేదలకు హక్కుగా ఇస్తున్నారు
ఊరూరా జన్మభూమి కమిటీలు పెట్టి స్థానిక ప్రజా ప్రతినిధులు, సర్పంచ్ల హక్కులు కాలరాసి, పేదవాళ్లను తమ చెప్పుల కింద బానిసలుగా చూసి పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇళ్ల స్థలం కావాలన్నా, ఏ సంక్షేమ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీ వద్దకు వెళ్లి దేబిరించుకునే పరిస్థితిని చంద్రబాబు కల్పిస్తే… ఈరోజు సంక్షేమ పథకాలు పొందడం పేదప్రజల హక్కు అంటూ, దళారుల వ్యవస్థ లేకుండా కేవలం అర్హతే ఆధారంగా… నేరుగా సంక్షేమ పథకాలను వారి ఖాతాలకే వేస్తున్న జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడానికి మీకు సిగ్గులేదా అని ప్రశ్నిస్తున్నాం.
– అధికారంలో ఉన్నప్పుడు బీసీల తోకలు కత్తిరిస్తాను, తోలు తీస్తాను, ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా?, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా? అంటూ ఎస్సీ, బీసీలు, మహిళలను చంద్రబాబు కించపరిస్తే… ఇవాళ జగన్ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు 50 శాతం పదవులు ఇచ్చి, రాజకీయంగా గుర్తింపు ఇవ్వడమే కాకుండా, నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏకంగా చట్టాన్ని చేశారు.
– మీ ముడుపుల కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాలకోసం పరిశ్రమలు, పెట్టుబడిదారులు, బాబాల పేరుతో కొన్నివేల ఎకరాలను, పెట్టుబడులు, ఉద్యోగాలు రాకుండానే, అప్పనంగా తనవారికి చంద్రబాబు కట్టబెట్టాడు. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే కనీసం ఆలోచన కూడా చేయని వ్యక్తి చంద్రబాబు. కనీసం వంద ఎకరాలు అయినా కొని, పేదలకు పంపిణీ చేశావా.?. ఏ ఒక్కరికైనా ఇంటి స్థలం ఇచ్చావా..? అదే జగన్ 31లక్షల మందికి ఇళ్లస్థలాలు, ఇళ్లు నిర్మించి ఇస్తూ, వారికి ఒక ఆస్తి ఏర్పాటు చేసి, జీవితం మీద భరోసా కల్పించిన ఈ ప్రభుత్వంపై ఏ మొహం పెట్టుకుని నిందలు వేస్తారు?
ఎక్కడో, ఏదో ఘటన జరిగితే.. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారమా..?
ఎక్కడో ఒకచోట, ఏదైనా సంఘటన జరిగితే దాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఘోరాలు, నేరాలు చేస్తుందంటూ తప్పుడు ప్రచారం చేయడం సబబా? సంఘటనలను సంఘటనలుగానే చూడాలి తప్పితే…అదేదో ముఖ్యమంత్రికి ఆపాదించి, ఆయనే చేశారనడం ఎంతవరకూ సమంజసం అని అడుగుతున్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్లు, వ్యాపారస్తుల బిల్లుల చెల్లింపునకే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప సంవత్సరాల తరబడి పేరుకుపోయిన రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీల బకాయిలు ఇచ్చేందుకు మాత్రం మీకు చేతులు రాలేదు. మీకు సంబంధం లేదని, గత ప్రభుత్వం ఇచ్చిందంటూ చేతులు దులుపుకోలేదా? . ఇవాళ జగన్ పరిపాలనలో ఏదైనా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే.. రైతులకు అదే సీజన్ లో ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్న ప్రభుత్వం ఇది.
– అయిదుకోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో రోజూ అనేక సంఘటనలు జరుగుతాయి. వాటిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. వాటన్నింటినీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ కి ఆపాదించి ఘోరాలు చేస్తున్నారంటూ ప్రచారం చేయడం ఎంతవరకూ కరెక్ట్.?
రాష్ట్రాన్ని ఆర్థికంగా చిదిమేసింది మీరు కాదా..
ఏదైనా ఛార్జ్‌షీట్ వేయాలంటే అది తెలుగుదేశం పార్టీ మీదే వేయాలి. మీ అయిదేళ్లు పరిపాలనలో మోసం, వంచన ఆధారంగానే మీ పరిపాలన జరిగింది కానీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, భరోసాను తుంగలోకి తొక్కి కేవలం స్వార్థంతో పాలన చేసిన విషయాన్ని ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పులు అంటూ ప్రచారం చేస్తున్నారు. 4లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి, దాదాపు రూ.60-70 వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లించకుండా, అప్పులుగా పెట్టి రాష్ట్రాన్ని ఆర్థికంగా చిదిమేసింది మీరు కాదా? . ఎన్ని కష్టాలు ఎదురైనా, జగన్ మొక్కవోని ధైర్యంతో, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించేందుకు ఎఫ్ఆర్బీఎంకు నిబంధనలకు లోబడి అప్పులు చేస్తే… దానినీ తప్పుబడతారా.. ? మీరు మాత్రం నిసిగ్గుగా రాష్ట్రంలోని పేద ప్రజలు ఏమైపోయినా మాకు బాధలేదు, వాళ్లు నాశనం అయినా ఫర్వాలేదని.. జగన్ సంక్షేమ పాలన కొనసాగకూడదనే ఉద్దేశంతో బ్యాంకుల దగ్గరకు వెళ్లి, కేంద్రం దగ్గరకు వెళ్లి అప్పులు ఇవ్వవద్దంటూ పిటిషన్లు పెట్టి, ప్రయత్నాలు చేయడానికి మీకు సిగ్గుందా? జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక, ఈ మూడేళ్లలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం అయినా ఆగిందా.. ?
– మేం చేసిన అప్పులకు సంబంధించి ప్రతిపైసాకు లెక్క చెప్పాం. పేదల బాగు కోసం, శాశ్వత ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టాం. మరి చంద్రబాబు ఎవరి ప్రయోజనాల కోసం ఖర్చు చేశారో చెప్పాలి. ఈ రెండున్నరేళ్ళలో మొత్తం లక్షా 75వేల కోట్లు సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేద ప్రజలకు అందించాం. అందులో లక్షా 32వేల కోట్ల రూపాయలను నేరుగా డీబీటీ ద్వారా పేదవారికి అందించాం. అదే మీరు తెచ్చిన 4లక్షల కోట్ల అప్పులతో ఎవరికి మేలు చేశారు.. ఏం మేలు చేశారు..?
విధ్వంసం, వంచన, మోసం అంటే మీ హయాంలో జరిగినవే
విధ్వంసం, వంచన, మోసం, దగాల కు పర్యాయ పదం టీడీపీనే. మీరు అధికారంలో ఉండగా, ఎన్ని విషయాల్లో రాష్ట్ర ప్రజలను మోసం చేశారో ఒకసారి గుర్తుకుతెచ్చుకుంటే మంచిది. మీ దోపిడీ కోసం ఆఖరికి మహిళా అధికారిణిలను సైతం నిస్సిగ్గుగా జుట్టు పట్టుకుని ఈడ్చి వారిపై దాడులు చేశారు. అధికార మదంతో సీనియర్ ఐఏఎస్,ఐపీఎస్ అధికారులపై మీ ప్రజాప్రతినిధులు దౌర్జన్యం చేశారు. మీ హయాంలో, అధికార మదంతో మీ ప్రజాప్రతినిధులే ఏకంగా కాల్‌మనీ సెక్స్ రాకెట్‌ను ప్రోత్సహించి, ఏవిధంగా మహిళలను కించపరిచారో, వారి పుస్తెలను తెంచారో, రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. విధ్వంసం, దోపిడీలు అంటే అవి. అవన్నీ మీకు కనిపించడం లేదా?
– ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేసిన కార్యక్రమాలను సహించేది లేదని… ప్రజావేదిక అంటూ మీరు పెట్టుకున్న అక్రమ కట్టడాన్ని, దోపిడీ దారుల వేదికను కూల్చివేస్తే దానిపైనా విమర్శలా..? అది అక్రమ కట్టడం కాబట్టే దాన్ని ప్రభుత్వం కూల్చివేసింది. దాన్ని పట్టుకుని విధ్వంసం అంటూ చెప్పడం ఎంతవరకూ సబబు?
– చంద్రబాబు అక్రమాలు తెలియనిది ఎవరికి? అన్యాయల పునాదులు, మోసాల పునాదుల మీద తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆయనా మా ప్రభుత్వంపై విమర్శలు చేసేది? ఎన్నికలు పెడితే సిద్ధంగా ఉన్నామని బీరాలు పలుకుతున్నారు. మరి తిరుపతి ఉప ఎన్నికలు, జిల్లా పరిషత్, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి కదా? ఇప్పటివరకూ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కనీసం డిపాజిట్లు అయినా తెచ్చుకుందా? వైయస్సార్ సీపీకి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ, 2019 సాధారణ ఎన్నికల కంటే ఓటు శాతం పెరిగింది. ఇందుకు జగన్ మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలనే తార్కాణం. అచ్చెన్నాయుడు గారూ.. ఎన్నికల కోసం అంత తొందర పడకండి, ఎలాగూ ముందస్తు ఎన్నికలు జరగవు కదా అని ఉత్తుత్తి చాలెంజ్ లు చేస్తున్నారు. తొంరదెందుకు? రాబోయే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో చూసుకుందాం.
– వంచన అంటే అధికారంలో ఉన్నప్పుడు 600కు పైగా హామీలను ఎన్నికల మేనిఫెస్టో పెట్టి, అధికారంలోకి వచ్చాక, ఆఖరికి ఆ మేనిఫెస్టోను కూడా టీడీపీ అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించి సిగ్గులేకుండా పాలన చేసిన మీదా వంచనా? మాదా.. ?
– మేము కేవలం రెండే రెండు పేజీలతో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చి, హామీలిచ్చాం, నవరత్నాలు అమలుకు హామీ ఇచ్చాం. వీటన్నింటిని తూ.చ తప్పకుండా అమలు చేస్తున్న జగన్ దా వంచనా..?. అనేది విజ్ఞులైన ప్రజలు గమనిస్తున్నారు.
– రాష్ట్రంలో పేదవారి కోసం టీడీపీ ఎప్పుడైనా ఆలోచన చేసిందా? మీరు ఎంతసేపు కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల లబ్ధికోసం, మీకు కావాల్సిన వారి మేలు కోసం, అమరావతిలోనే అన్నీ పెట్టాలనుకుని, గ్రాఫిక్స్ చూపించి, రియల్ ఎస్టేట్ హైప్ తీసుకువచ్చారు తప్ప, పేదవాళ్లకోసం ఏమైనా చేశారా చంద్రబాబూ? మీ మేనిఫెస్టోను బయటకు తీసి చదివితే.. మీరు చేసిన మోసాలు అన్నీ మీ కళ్ళకే కనపడతాయి.
స్కోచ్ అవార్డుల్లో ఏపీకి మొదటి స్థానం
– స్కోచ్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మొట్టమొదటి స్థానం వచ్చింది. దాన్ని చూసి ఓర్వలేకే టీడీపీ ఛార్జ్‌షీట్ అంటూ ప్రజలను పక్కదారి పట్టించే కుట్రలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉన్నాయంటూ ఇతర రాష్ట్రాలే కాకుండా, స్వయంగా ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పే ఈ మోసగాళ్లు, తెలుగుదేశం వంచకులకు మాత్రం ఇది కనిపించదు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో, దాదాపు ఏడాదిన్నర కరోనానే. అయినా కూడా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జగన్ పరిపాలన చేశారు.
– పేద ప్రజలు, రైతులు, మహిళల సంక్షేమాన్ని పణంగా పెట్టి, ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ సమస్యలను పణంగా పెట్టి కేవలం పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు, మాఫియాకు మేలు చేసే విధానం చంద్రబాబుది. పేదల సంక్షేమమే జగన్ మోహన్ రెడ్డి ఎజెండా.
అండమాన్ కు పారిపోతారేమో..
– అండమాన్‌లో రెండు వార్డు సీట్లు గెలిచామని టీడీపీ సంబరాలు చేసుకుంటోంది. ఏపీ, తెలంగాణలో ఎటూ టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది కాబట్టి.. ఇప్పడు చంద్రబాబు అండమాన్ కు పారిపోతారేమో. పార్టీయా బొక్కా అన్న అచ్చెన్నాయుడు ఇవాళ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది.
– రాష్ట్రంలో పేదవారి సంక్షేమమే లక్ష్యంగా, దానితో పాటు అభివృద్ధి చేసేదిశలో ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రతిపేదవాడి గుండెల్లో జగన్‌కి ప్రత్యేకమైన స్థానం ఉంది. వారి దీవెనలు, ఆశీస్సులు ముఖ్యమంత్రికి ఉన్నాయి.
– 2014 ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రజలను వంచించి, మోసం చేసినందుకు టీడీపీ నేతలే ఊరూరా తిరిగి క్షమాపణలు చెప్పుకోవాలి. ప్రజలు క్షమించాలంటూ పాంప్లేట్లు వేసుకుంటూ ఇంటింటికి తిరిగాలి.
సీపీఐ నారాయణ పెద్ద జోకర్..
మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
– గవర్నర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ పెద్ద జోకర్. సినిమాల్లో కామెడీ యాక్టర్ లా, ఆయన అప్పుడప్పుడూ వచ్చి జోకర్ లా జోకులు వేసే వ్యక్తి. ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
– విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిది. చట్టంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని మేం పదే పదే కోరుతున్నాం. కేంద్రం ఇంకా చోద్యం చూస్తూనే ఉంది.