Suryaa.co.in

Andhra Pradesh

ఇది పేదలకు అనుకూలమైన బడ్జెట్

– బ్రాహ్మణ సంక్షేమానికి కేటాయింపులు పెంచడం పట్ల హర్షం
– సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ (రూ.2,56,256.56 కోట్లు) పూర్తిగా పేదలు, రైతన్నలకు అనుకూలమైన బడ్జెట్ అని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

స‌మాజంలో అన్నివ‌ర్గాల ప్రయోజ‌నాల‌ను ప‌రిర‌క్షించే విధంగా బ‌డ్జెట్ ఉందని అభిప్రాయపడ్డారు. ఇది సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో నడిపించిన బడ్జెట్ అని అభివర్ణించారు. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న జగనన్న ఆశయం, లక్ష్యాలను ఈ బడ్జెట్ పటిష్టపరిచేదిలా ఉందని తెలిపారు. ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషం ఉండేలా రాష్ట్ర బడ్జెట్ రూపొందించారని మల్లాది విష్ణు అన్నారు.

గత చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని గుర్తుచేశారు. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించాలని.. సృష్టించిన సంపదను పేదలకు పంచాలనే ఆర్థిక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్నారన్నారు.

గతేడాది కంటే ఈసారి వ్యవసాయ శాఖకు బడ్జెట్ లో అధికంగా నిధులు కేటాయించడం పట్ల రైతన్నలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. రైతులు, వ్యవసాయం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న మమకారం, చిత్తశుద్ధిని ఈ బడ్జెట్ తెలియజేస్తుందన్నారు. రైతుభరోసా, ఉచిత పంట బీమా, సున్నా వడ్డీ పథకాలు ఇప్పుడు దేశాన్ని ఆకర్షిస్తున్నాయని చెప్పారు.

ఈ బడ్జెట్ రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో పాటు నీటిపారుదల రంగానికి రూ. 11,482.37 కోట్లు కేటాయింపులు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా బ్రాహ్మణ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ లో రూ. 455.23 కోట్లు కేటాయించడం పట్ల ఎమ్మెల్యే మల్లాది విష్ణు హర్షం వ్యక్తం చేశారు. అర్చకుల సంక్షేమానికి ఈ ఏడాది రూ. 120 కోట్లు అదనంగా కేటాయించడం పట్ల ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంకితభావంతో ముందుకు సాగుతున్నారని చెప్పడానికి ఈ బడ్జెట్ నిదర్శనమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ ఎస్సీ సబ్ ప్లాన్ కు రూ. 18,518 కోట్లు., ఎస్టీ సబ్ ప్లాన్ కు రూ. 6,145 కోట్లు., బీసీ సబ్ ప్లాన్ కు రూ. 29,143 కోట్లు., మైనార్టీస్ యాక్షన్ ప్లాన్ కు రూ.3,662 కోట్లు., కాపు సంక్షేమానికి రూ. 3,532 కోట్లు., ఈబీసీ సంక్షేమానికి రూ. 6,669 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

ఇది గతంలో కంటే చాలా అధికమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజల తరపున సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గనిర్దేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టారని మరోసారి పునరుద్ఘాటించారు.

LEAVE A RESPONSE