– దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఎపిలోనే ఎందుకు ఉన్నాయి?
– రాష్ట్రం లో కల్తీ సారా అరికట్టాలి….జె బ్రాండ్స్ మద్యం నిషేధించాలి
– రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్త నిరసనలతో మద్యం పై ప్రభుత్వాన్ని నిలదీయాలని క్యాడర్ కు పిలుపు
– – పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ లో టిడిపి అధినేత చంద్రబాబు
అమరావతి: అధికారంలోకి వస్తే మద్య నిషేదం చేస్తానని చెప్పిన వైఎస్ జగన్….ఇప్పుడు కల్తీ సారాతో, నాణ్యత లేని సొంత బ్రాండ్లతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నాడని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో నాటుసారా, కల్తీ సారా ఏరులై పారుతున్నా…. ప్రభుత్వం అరికట్టడం లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. కల్తీ సారా నిర్మూలన, మద్యం దుకాణాల్లో జె బ్రాండ్స్ నిషేధం అనే డిమాండ్లతో రేపు ఎల్లుండి టిడిపి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దీనిపై టెలికాన్ఫరెన్స్ ద్వారా నేతలు, కార్యకర్తలతో మాట్లాడిన పార్టీ అధినేత చంద్రబాబు… ప్రభుత్వం వైఖరిని ప్రజలతో కలిసి నిలదీయాలని క్యాడర్ కు చెప్పారు.
జె బ్రాండ్లు స్లో పాయిజన్:
తన కమిషన్ల కోసం సిఎం జగన్ సొంత బ్రాండ్స్ తెచ్చి, నాణ్యత లేని మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలు తీస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు. కల్తీ మద్యం వల్ల వెంటనే ప్రాణాలు పోతుంటే….జగన్ తెచ్చిన సొంత బ్రాండ్లు స్లో పాయిజన్ గా మారి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని చంద్రబాబు అన్నారు. అసలు దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఎపిలోనే ఎందుకు ఉన్నాయి…వాటిని ఎవరు తయారు చేస్తున్నారు…ఎంతకు అమ్ముతున్నారు అనే విషయాలపై జగన్ సమాధానం చెప్పాలన్నారు.
60 రూపాయాలు ఉండే మద్యం బాటిల్ రేటును 120-150 రూపాయాలు చేసి….ప్రజలను దోచుకుంటున్నారని మండి పడ్డారు. తన సొంత బ్రాండ్ల ద్వారా జగన్ ఏడాదికి ప్రజల జేబుల నుంచి 5 వేల కోట్లు కాజేస్తున్నాడని అన్నారు. 5 ఏళ్లలో ఒక్క మద్యం ద్వారానే కమిషన్ల రూపంలో జగన్ 25-30 వేల కోట్లు ఆర్జిస్తున్నాడని చంద్రబాబు అన్నారు.
జంగారెడ్డి గూడెంలో 27 మంది కల్తీ సారా వల్ల చనిపోతే…వాటిని సహజ మరణాలు అనిచెప్పిన సిఎం జగన్ వైఖరిని చంద్రబాబు తప్పు పట్టారు. మద్యం అధిక రేట్ల కారణంగా ప్రజలు మళ్లీ నాటుసారా వైపు వెళుతున్నారని….దీంతో ప్రాణాలు పోతున్నాయని బాధితులు చెప్పిన విషయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు.
జగన్ ది అసత్యాల ప్రయాణం:
వైఎస్ జగన్ తప్పుడు ప్రచారాలు ఏ స్థాయిలో ఉంటాయో ఇప్పుడు ఆధారాలతో సహా బయటపడుతున్నాయని చంద్రబాబు పార్టీ కార్యకర్తలతో అన్నారు. పోలీసు శాఖలో ఒకే సామాజికవర్గానికి చెందిన 37 మందికి డిఎస్పిలు గా ప్రమోషన్లు అనేది తప్పుడు ప్రచారం అని తేలిందన్నారు. టిడిపి హయాంలో నిఘా కోసం పెగాసస్ కొనలేదు అనే విషయాలు కూడా ఇప్పుడు ఆధారాలతో బయట పడ్డాయని అన్నారు. ప్రతి అంశంలో అసత్య ప్రచారాలు చేసిన జగన్ ను, వైసిపి ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయాలని చంద్రబాబు క్యాడర్ కు పిలుపునిచ్చారు.