Suryaa.co.in

Features

నా నీలాచల పర్వత యాత్ర

నీలాచల పర్వతంపై నెలకొని యుగయుగాలుగా భక్తులను ఆశీర్వదిస్తున్న కామాఖ్య దేవి దర్శనం మరోసారి కలగడం నా పూర్వజన్మ పుణ్య ఫలం. అందునా ఫాల్గుణ మాస పౌర్ణమి రోజున అమ్మవారి ఆశీర్వాదం లభించడం నా మహద్భాగ్యం.

అస్సాం రాష్ట్రంలోని కామరూప నగరంగా పిలవబడే గౌహతి పట్టణంలో నీలాచల పర్వతంపై అమ్మవారు యోని ముద్ర లో నెలకొని త్రిపుర సుందరి రూపంలో ఆవిష్కృతమైనది. ఆ పక్కనే కమల, మాతంగి అమ్మ వారులు ప్రతిష్ఠితమై ఉన్నారు . త్రిపుర సుందరి రూపంలో మహాకాళి, కమలాత్మిక రూపంలో మహాలక్ష్మి, మాతంగి రూపంలో మహా సరస్వతి కలసి త్రిశక్తి సంహితులై భక్తుల మనోభీష్టాలను తీరుస్తున్నారు. మహా శక్తివంతమైన ఈ క్షేత్రంలో అమ్మవార్లను తాంత్రిక సాంప్రదాయంలో కూడా కొలుస్తారు.

మాఘ అమావాస్య రోజున మహా స్మశానం కాశీ నగరంలో విశ్వనాథుడి దర్శనం తదనంతరం జరిగిన ఆకస్మిక సంఘటనలో తిరువన్నామలై అరుణాచలేశ్వరుడు ఆపీత కుచాంభిక దర్శనం , అరుణాచల గిరి ప్రదక్షణం, రమణ మహర్షి ఆశ్రమ సందర్శనం ముగించుకొని ఇంద్రప్రస్థం (ఢిల్లీ )చేరుకున్నాను.

ఈ పరిణామ క్రమంలో అస్సాం రాష్ట్రం లో దుబ్రి (బంగ్లాదేశ్ సరిహద్దు పట్టణం) లో వసంత ఉత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆహ్వానం అందినది. అప్పటికే శారీరకంగా అలసిపోయిన నాకు ఈ కార్యక్రమానికి హాజరయ్యే మానసిక సంసిద్ధత లేదు.

ఈ సమయంలో మిత్రుడు, శ్రేయోభిలాషులు, భగవత్ సేవలో నిరంతరం ప్రయాణం చేసే కొరిడె అమర్ నాథ్ శర్మ లాంటి వారి ప్రోద్బలంతో గంటల వ్యవధిలో కామరూప నగరానికి ప్రయాణం అయ్యాను.
ఇది జీవితంలో మహత్తరమైన ప్రయాణం. ఇది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. కాళీ, తార, త్రిపుర భైరవి, భువనేశ్వరి మాత, ,ఛిన్నమస్త, భగళాముఖి ధూమవతి లు పరివేష్టితమై ఉండగా ఒకే పీఠంపై నెలకొన్న త్రిపుర సుందరి కమలాత్మిక మాతంగిలు అపారమైన అనంతమైన ఆశీర్వచనాలు పొందడం నా అదృష్టం.

16/3/2022 ,గురువారం రోజున రాత్రి కామాఖ్య మందిరం ప్రాంగణానికి చేరుకున్నాను. 17/ 3 /2022 శుక్రవారం స్థానికుల సహకారంతో కాలినడకన నీలాచల పర్వత సానువుల్లో కొలువై ఉన్న దేవీ దేవతల
neela-balu దివ్య దర్శనానికి బయలుదేరాను. కామాఖ్య మందిరం నుంచి 700 మెట్లకు దిగువన బ్రహ్మపుత్ర నది వైపు ఉన్న కోటిలింగాల దర్శనంతో యాత్ర ప్రారంభమైంది. సాధకులకు అనువైన ప్రదేశమిది. ఈశ్వరుడు , గణపతిల దర్శనం తరువాత మరొక 600-700 మెట్ల కింద ఉన్న సిద్ధ గణపతి దేవాలయాన్ని దర్శించుకున్నాను. పంచముండి ఆసనం ఇక్కడి ప్రత్యేకత. సంవత్సరాల తరబడి సాధకులు ఇక్కడ ఉండి అమ్మవారి నిజరూప దర్శనం కోసమై అహోరాత్రులు సంకల్ప బద్దలై నామ జపం, హోమ ప్రక్రియల ద్వారా ప్రయత్నిస్తున్నారు.

నేను వెళ్ళిన ముందు రోజునే ఇక్కడ జరిగిన ఒక హోమ ప్రక్రియలో దున్నపోతును బలి ఇచ్చారు.ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఒక పులి వచ్చి ఈ దున్న తలకాయను తీసుకెళ్ళింది. అక్కడినుంచి మరొక నాలుగు ఐదు వందలు మెట్లు దిగితే బ్రహ్మపుత్ర నదిని చేరుకోవచ్చు. అయితే మెట్లు శిథిలం కావడం వల్ల బ్రహ్మపుత్ర చేరుకోవడం కష్టమైంది.

ప్రకృతి రమణీయతకు ఇదొక అద్భుత ప్రదేశం. మంద్రంగా గాలి వీచే చప్పుడు, ఆకుల కదలికల ధ్వని , పక్షుల కిలకిలా రావాలు, దూరంగా బ్రహ్మపుత్ర నదిలో తిరుగుతున్న మర పడవలు చప్పుడు తప్ప మరి ఇంకా ఏమి వినపడని అద్భుత ప్రదేశం. అంతర్ముఖంగా జరిగే నామ జపం మన గుండె చప్పుడు రూపంలో మనకే విన పడుతున్న అద్భుత సమయం.

దట్టమైన అరణ్యంలో సిద్ధ గణపతి దర్శనం చేసుకొని తిరిగి కామాఖ్య మందిరం ప్రాంగణానికి చేరుకున్నాను. కాళీమాత దర్శనముతో రెండవ దశ యాత్ర ప్రారంభం. భగళాముఖి అమ్మవారిని సేవించుకొని పక్కనే ఉన్న మరొక కొండ శిఖరం పై నెలకొన్న భువనేశ్వరి మాత ఆశీస్సులు అందుకున్నాము. ఆపై ప్రధాన మందిరానికి దగ్గరనే ఉన్న ఛిన్నమస్తా అమ్మవారికి నమస్కారములు అర్పించుకొన్నాము. .

ఛిన్నమస్తా దేవి పాతాళ గృహంలో నెలకొని భక్తులను ఆశీర్వదిస్తున్నది. పాదం కూడా పట్టని మోకాలు లోతు మెట్లు , అమ్మవారి ముందు ఉన్న దీపపు కాంతి తప్ప మరి ఇంకా ఏమి కానరానీ చిమ్మ చీకటి — ఎత్తయిన ఆసనం పై కూర్చొని నడుము లోతు కింద ఉన్న అమ్మవారిని స్పృశించే అదృష్టం కలిగింది. అక్కడ ఉన్న జలోదకాన్ని తీర్థంగా సేవించాము. పద్మసంభవుడి కఠోర సాధన కారణంగా టిబెట్ వాసులకు అత్యంత ప్రియమైన తారా దేవి దర్శనం చేసుకున్నాము. అటుపై మందిర ప్రాంగణానికి ఆనుకొని ఉన్న ధూమవతి దాని కిందనే ఉన్న భైరవి మాతల దర్శనం చేసుకున్నాము.

ఇక్కడ ఒక విశేషం ప్రస్తావన చేయాలి. భైరవి మందిరం పక్కనే సమకాలీనంలో అత్యంత కఠోర సాధన చేసి దశమహావిద్యల అనుగ్రహం పొందిన రమణి కాంతశర్మ గారు నెలకొల్పిన దశ ముండీ ఆసనం ఉన్నది. మందిర పూజారులు , నిబద్ధతతో సాధన చేసే సాధకులతో శ్రీ రమణీ కాంతశర్మ గారు విగ్రహరూపంలో ఇప్పటికీ సంభాషిస్తూ తగిన మార్గదర్శనం చేస్తారనడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి.

వివిధ రూపాలలో ఏడుగురు అమ్మవారల దర్శనం చేసుకున్న తర్వాత యోని పీఠంపై నెలకొన్న మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతుల దర్శనం చేసుకున్నాము. నా ఈ యాత్రకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ అమ్మవారి ఆశీర్వచనాలు అందరిపై అపారంగా ఉండాలని కోరుకుంటూ ….
భవదీయ…..

-కామర్సు బాలసుబ్రహ్మణ్యం, ఢిల్లీ.

LEAVE A RESPONSE