Suryaa.co.in

Telangana

ప్రవాసులారా……కేసీఆర్ నియంత పాలనలో తెలంగాణ తల్లడిల్లుతోంది

– ఇందుకోసమేనా తెలంగాణ సాధించుకుంది?
– కేంద్రాన్ని బదనాం చేసి తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ రగిలించేందుకు సీఎం మరో కుట్ర
– కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలనే లక్ష్యంగా యుద్దం చేస్తున్నాం
– టీఆర్ఎస్ నేతల అవినీతి బండారంపై న్యాయ, క్షేత్రస్థాయి పోరాటాలు చేస్తున్నాం
– ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే బీజేపీ అంతిమ లక్ష్యం
– గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేసి తీరుతాం
– బీజేపీ చేస్తున్న మహోద్యమంలో భాగస్వాములు కండి
– గడీల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని కాపాడి మాత్రుభూమి రుణం తీర్చుకోండి
– అమెరికాలోని ప్రవాస భారతీయులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ పిలుపు
– బీజేపీ పోరాటానికి సంపూర్ణ మద్దతును ప్రకటించిన ప్రవాసులు

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తల్లడిల్లిపోతున్నారని, యువకుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణను అథో:గతి పాలవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది మంది బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఇందుకోసమేనా అన్ని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతి-నియంత-కుటుంబ పాలనను అంతమొందించి బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా యుద్దం చేస్తున్నామని చెప్పారు. గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించి తీరుతామని పునరుద్ఘాటించారు. బీజేపీ చేపడుతున్న ఈ మహోద్యమంలో ప్రవాస భారతీయులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అమెరికాలోని ప్రవాస భారతీయులు ‘ఏక్ దక్కా – తెలంగాణ పక్కా’ అనే అంశంపై జూమ్ మీటింగ్ నిర్వహించారు. అడపా ప్రసాద్, క్రిష్ణారెడ్డి అనుగుల, విలాస్ జంబుల ఆధ్వర్యంలో జరిగిన ఈ జూమ్ మీటింగ్ లో బండి సంజయ్ తోపాటు బీజేపీ ఫారిన్ డిపార్ట్ మెంట్ ఇంఛార్జీ విజయ్ చౌతేవాలె హాజరయ్యారు. అరవింద్ మొదలి, మధు చౌదరి బెల్లం, లక్ష్మీనారాయణ పేరి, శ్యామ్ ఇనగంటి, అశోక్ లౌసవిల్లి, భార్గవి కళ్యాణి, ప్రదీప్ బిరుకురి, నిర్మలారెడ్డి, సురేందర్ పోరెడ్డి, రామక్రిష్ణ, రఘు సహా వందలాది మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడిన బండి సంజయ్ ఎన్ఆర్ఐలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పాలనపై బీజేపీ చేస్తున్న పోరాటానికి జూమ్ మీటింగ్ లో

పాల్గొన్న ప్రవాసులంతా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మహోద్యమంలో జైళ్ల పాలై ఇబ్బంది పడుతున్న బీజేపీ కార్యకర్తలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన ఈ మీటింగ్ లో బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….

మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఎంత మంది యువకులు బలిదానం చేసుకున్నారో…. మరెంత మంది తమ జీవితాలను ఫణంగా పెట్టి పోరాడారో… శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య, సుమన్ వంటి యువకులెందరో తెలంగాణ రావాలి… కష్టాలు తొలిగిపోవాలి…ఉద్యోగాలు రావాలనే ఆశయంతో ఆత్మహత్య చేసుకున్నరు.

‘నీళ్లు-నిధులు-నియామకాలు’ నినాదంతో దశాబ్దాలుగా సాగించిన పోరాటంతో తెలంగాణ చిన్నమ్మ సుష్మాస్వరాజ్ పార్లమెంట్ వేదికగా గర్జిస్తే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అందుకు పూర్తి భిన్నంగా పాలన కొనసాగుతుండటం బాధాకరం. కేసీఆర్ కుటుంబ, అవినీతి, నియంత్రుత్వ, అరాచక, నయా నిజాం పాలనతో రాష్ట్రాన్ని అథో:గతి పాలవుతోంది.

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిండు. ఏళ్ల తరబడి ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగులను నడిరోడ్డుపైకి తీసుకొచ్చిండు. వడ్లు కొనకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నడు. 317 జీవో పేరుతో ఉద్యోగుల కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసిండు. సర్కార్ కు ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా మద్యాన్ని ఏరులై పారిస్తూ తెలంగాణ ప్రజలను మద్యం బానిసలుగా మారుస్తుండు.

వేల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పీకిపారేసి బజారుపాల్జేసిండు. ఉద్యోగాలివ్వడం చేతగాని కేసీఆర్… తన కొడుకు, కూతురు, అల్లుడు, సడ్డకుడి కొడుకు, బంధువులకు మాత్రం పదవులిచ్చుకుంటూ జల్సా చేస్తుండు. ఏనాడూ సెక్రటేరియట్ రాకుండా ఫాంహౌజ్, ప్రగతి భవన్ కే పరిమితమై అడ్డగోలుగా పాలన చేస్తున్న ఏకైక సీఎం ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమే.

కష్టపడి దశాబ్దాల పోరాటంతో….1400 మంది యువకుల బలిదానంతో సాధించుకున్న తెలంగాణ ఇందుకోసమేనా? అందుకే కేసీఆర్ అవినీతి-కుటుంబ-నియంత పాలనను అంతమొందించడమే లక్ష్యంగా బీజేపీ గత కొంత కాలంగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. నిరుద్యోగుల కోసం నిరుద్యోగ దీక్ష, రైతుల తరపున రైతు దీక్ష, ఉద్యోగుల పక్షాన నిరసన దీక్షతోపాటు దళితులు, గిరిజనులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం. సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిపై న్యాయ పోరాటం చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఉద్యమిస్తున్నం.

గొల్లకొండ కోటపై కాషాయ జెండాను ఎగరేయడమే లక్ష్యంగా పోరాడుతున్నం. ఈ పోరాటంలో ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు అసువులు బాశారు. ఎందరో కార్యకర్తలెందరో జైళ్ల పాలయ్యరు. కేసులను ఎదుర్కొంటున్నరు. లాఠీదెబ్బలు తిన్నరు. ఇంకా 68 మంది బీజేపీ కార్యకర్తలు ఇంకా జైళ్లోనే మగ్గుతున్నరు. చాలా మంది కార్యకర్తలకు తినడానికి తిండి లేకపోయినా… బతకడానికి నిలువ నీడలేకపోయినా పార్టీ కోసం పనిచేస్తున్నరు. ఇంత గొప్ప త్యాగాల పార్టీలో ఉన్నందుకు నాకు గర్వంగా ఉంది. సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా చేసింది. ప్రధాని సహా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం సామాన్యులకు కూడా దక్కేది బీజేపీలో మాత్రమే.

తెలంగాణలో బీజేపీ చేస్తున్న పోరాటాల ఫలితంగా దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 కార్పొరేటర్ స్థానాలున్న బీజేపీ 48 స్థానాలను గెలుచుకుంది. 2018 ఎన్నికలతో పోలిస్తే… ఓటింగ్ శాతం పెరిగింది. ఈరోజు కార్యకర్తల్లో, ప్రజల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం వచ్చింది.

బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న నమ్మకాన్ని చూసి ఓర్వలేని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నిస్తే కేసులు పెడుతోంది. అనేక ఇబ్బందుల పాల్జేసింది. అయినా తెగించి పోరాడుతున్నం. మేం ఏనాడూ ముస్లింలు, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. 80 శాతం మంది హిందువులు పడుతున్న బాధలను ప్రస్తావిస్తున్నా. వారి తరపున పోరాడుతున్న. వారికి భరోసా కల్పించేందుకు హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నామే తప్ప ఏనాడూ ఇస్లాం, క్రైస్తవాన్ని విమర్శించలేదు. 15 నిమిషాలు టైమిస్తే హిందువులందరినీ నరికి చంపుతానన్న ఎంఐఎంతో చేతులు కలుపుతోంది టీఆర్ఎస్. వాళ్లు లౌకిక వాదులట… మమ్ముల్ని మతతత్వవాదులంటున్నరు. ఇందులో తప్పేముంది? హిందూ సమాజాన్ని ఏకం చేయడం కోసం పనిచేస్తున్నా.

బీహార్ లో ఎంఐఎం గెలవడానికి కారణమేంటి? ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా 12 శాతం జనాభా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకుతో గెలిచింది. మరి 80 శాతం మంది జనాభా ఉన్న హిందువుల ఓట్లు సంఘటితమైతే బీజేపీ ఎందుకు రాదో చెప్పండి. పాతబస్తీలో సభ పెట్టడానికి కేసీఆర్ సహా అన్ని పార్టీలు భయపడుతున్న తరుణంలో భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో పాతబస్తీలో సభ పెట్టి బీజేపీ సత్తా చూపినం. గతంలో ఎంఐఎం అరాచకాలకు భయపడి పాతబస్తీని వదిలివెళ్లిన హిందువుల్లో భరోసా కల్పించాం. నేను భయపడే వ్యక్తిని కాదు… తెగించే వ్యక్తిని. జైళ్లు నాకు కొత్త కాదు. ఇప్పటికే 8 సార్లు జైలుకు వెళ్లిన. నేను చావుకు భయపడను. చావే నన్ను చూసి భయపడుతోంది. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజల కోసం… పార్టీ కార్యకర్తల కోసం పోరాడుతున్నం.

తెలంగాణలో ఉద్యోగాల్లేవు. నిరుద్యోగ భ్రుతి లేదు. వారి తరపున పోరాడుతున్నా. బీజేపీ పోరాటాలకు భయపడి నోటిఫికేషన్లు ఇస్తానన్నడు. ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు. రుణమాఫీ, దళిత బంధు, నిరుద్యోగభ్రతి అమలు చేయలేదు. 317 జీవో పేరుతో ఉద్యోగుల కుటుంబాలను చిన్నాభిన్నం చేసి చెట్టుకొకరు పుట్టకొకరిగా మార్చారు. ఇదేం పద్దతని ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యబద్దంగా నా కార్యాలయంలో జాగరణ చేస్తే అడ్డుకుని నన్ను జైలుకు పంపిండు. అయినా భయపడలేదు. టీఆర్ఎస్ అవినీతి-నియంత-కుటుంబ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా పోరాడుతున్నం.

ఫాంహౌజ్ కే పరిమితన కేసీఆర్ ను ప్రగతి భవన్ కు, అక్కడి నుండి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కు గుంజుకొచ్చిన పార్టీ బీజేపీ. ఇప్పుడు దేశమంతా తిరిగేలా చేసిన పార్టీ బీజేపీ. కేంద్రం తెలంగాణకు సహకరిస్తలేదని దుష్ప్రచారం చేస్తూ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నరు. బెంగాల్ తరహా పాలన చేస్తుండు. ఇన్నాళ్లూ యాస, భాషతో తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మోసాలను ప్రజలు గ్రహించారు. ఇక కేసీఆర్ మాటలను నమ్మడం లేదు.

తెలంగాణలో ప్రజలు పడుతున్న కష్టాలను స్వయంగా తెలుసుకోవాలంటే ఏసీ రూముల్లో కూర్చోని రోడ్ మ్యాప్ రూపొందించడం సరికాదని భావించి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ద్వారా నేరుగా ప్రజల్లోకి వెళ్లాను. తొలిదశలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 438 కిలోమీటర్లు నడిచాను. జనం పడుతున్న బాధలను కళ్లారా చూశాను. కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలనను అంతమొందించి పేదల పక్షాన నిలిచే ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పోరాడుతున్నా. అందులో భాగంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్నా…. జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేయబోతున్నా. ఈ యాత్రకు మీ అందరి సహకారం కావాలి. మీ కుటుంబ సభ్యులందరినీ యాత్రలో భాగస్వాములు కావాలని కోరుతున్నా..

చివరగా నేను చెప్పేదొక్కటే… మిమ్ముల్ని కన్న తెలంగాణ తల్లి రోదిస్తోంది. గడీల పాలనలో బందీ అయ్యింది. కేసీఆర్ పాలనలో అష్టకష్టాల పడుతోంది. కేసీఆర్ చెర నుండి నన్ను విడిపించండంటూ ఏడుస్తోంది. తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయడానికి…గడీల పాలనను బద్దలు కొట్టడానికి బీజేపీ కార్యకర్తలు జై శ్రీరాం, భారతమాతాకీ జై అంటూ కదం తొక్కుతున్నరు. ఇప్పుడు మీ ముందు గొప్ప ఆశయం ఉంది. తెలంగాణ తల్లి రుణాన్ని తీర్చుకునే సమయం మీకు వచ్చింది తెలంగాణ బిడ్డలుగా మేం చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతిచ్చి ప్రజాస్వామిక తెలంగాణ పోరాటంలో భాగస్వాములై మాత్రుభూమి రుణాన్ని తీర్చుకోవాలని కోరుతూ…. ముగిస్తున్నా…..

LEAVE A RESPONSE