మృదు గంభీర కృష్ణమ్మ పలకరింపుతో
దుర్గమ్మ కరుణా వీక్షణ పులకరింపుతో
ఉగ్రనారసింహుని రక్షణా కటాక్షంతో
బౌద్ధం విలసిల్లిన నాగార్జునుడు నడయాడిన
అమరేశ్వరుడు కొలువైన పుణ్యభూమి
మన అజరామర అమరావతి
సర్వ కులాల సమ్మతితో
సర్వమతాల కమ్మికతో
వేల తల్లుల కడుపు పంటగా
నేలతల్లి పేగు తెంచుకుని
పురుడోసుకున్న అగ్నిపునీత
తెలుగింటి సుగుణ శీలవతి
బలుసాకు కోసం వలస పోయిన
దేశదిమ్మరి తెలుగువారిని
రొమ్మువిరిచి చేరబిలిచిన
ఆంధ్రఖ్యాతి అమరావతి
ఆంధ్రరాష్ట్రపు నడిబొడ్డై
ఆంధ్రవృద్ధికి నడికట్టై
తరతరాలకు కల్పతరువై
తేట తెలుగు కామధేనువై
కర్కశ బాలారిష్టాలు అధిగమించి
నవయవ్వనోత్సాహంతో పురోగమిస్తూ
విశ్వ జనుల సంభ్రమాలు వీక్షిస్తూ
త్రిలింగ దేశపు ఉన్నతిని కాంక్షిస్తూ
విశ్వఖ్యాతి నొందనున్న
సమరావతి మన అమరావతి
ఆంధ్రుల గర్వమేది యన్న
అమరావతి కన్న ఏది మిన్న
అన్న చందాన సాగనున్న
అమ్మరావతి ప్రస్థానం కనుమన్న
సార్ధక నామధేయ శుభకృత్ ఉగాది
కానుంది సకల జనుల శుభ యుగాది
భావితరాల భరోసా కు పునాది
– గద్దె బుచ్చి తిరుపతి రావు
(సాహిత్య అకాడమీ గుర్తింపు పొందిన సాంస్కృతీ సమాఖ్య విజయవాడ వారు ” ఆంధ్రుల రాజధాని అమరావతి” అన్న అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఆహ్వానించిన కవితల పోటీలో నా కవితకు మొదటి బహుమతి లభించింది.
జై అమరావతి జయహో అమరావతి)