అప్పట్లో ఊర్లలో పార్టీ.ఆఫీస్ అంటే తాటాకు పందిర్లే. అరేడేళ్ల చిన్న వయసులో పసుపు తోరణాలు , పసుపు జెండాలతో కళకళలాడుతూ వుండే పార్టీ పందిళ్లలో చెక్క బల్లల మీద కూర్చుని మైకులో వచ్చే ” చేయెత్తి జై కొట్టు తెలుగోడా ” పాట , దానవీరశూరకర్ణ లో ” ఏమంటివి , ఏమంటివి” డైలాగ్ వింటుంటే ఆ ఊపు , ఆ ఉత్తేజం వేరే లెవల్
ఊరంతా కరపత్రాలు పంచి రమ్మని పెద్దలు చెప్తే అన్న గారి బొమ్మ ఉన్న బ్యాడ్జీ జేబుకి పెట్టుకుని , చేతిలో పసుపు జెండా పట్టుకుని పిల్లలం అంతా ఊరంతా తిరుగుతూ పార్టీకి ప్రచారం చేస్తున్నపుడు వుండే ఆ ఉత్సాహం వేరే లెవల్.
శ్రీ కృష్ణ భగవానుడి రూపంలో ఉన్న అన్న ఎన్టీఆర్ గారి కటౌట్ ట్రాక్టర్ ముందు తగిలించుకుని దగ్గర్లో ఎక్కడ ఆయన మీటింగ్ ఉంటే అక్కడికి పెద్దవాళ్ళతో వెళ్ళి ఆ జన సమూహంలో ” జై తెలుగుదేశం ” , ” జై ఎన్టీఆర్ ” , ” జిందాబాద్ తెలుగుదేశం ” అని స్లొగన్స్ ఇస్తున్నప్పుడు వుండే ఆ ఉద్వేగం వేరే లెవల్.
పక్క ఊర్లో అన్న గారి మీటింగ్ ఉంటే చైతన్య రథం మీద వచ్చే ఆ మహానాయకుని రాక కోసం రెండు మూడు కిలోమీటర్ల మేర గంటల తరబడి ఎదురు చూసే ప్రజల మధ్య ఉండి ఆయన సినిమాల గురించి గాని , ఆయన అప్పటికే చేసిన సామాజిక సేవ గురించి వారు చెప్పే గొప్ప గొప్ప విషయాలు వింటుంటే ఆయన పట్ల పెరిగిన ఆరాధనాభావం వేరే లెవల్.
ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు తన ప్రచారంలో ఇంటికి వచ్చి ఓట్లు అడిగితే ఆ మహానుభావుడు పార్టీ పెడితే మీకెలా ఓట్లెస్తాం , ఎన్జీవోడికే మా మద్దతు అని ఆ నాయకుడి మొహం మీదే మా నాయనమ్మ చెప్పిన తీరు వేరే లెవల్
తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం
తెలుగు జాతి అభ్యున్నతి కోసం
తెలుగు జాతి అభివృద్ధి కోసం
పుట్టిన పార్టీ చిరస్థాయిగా ఉండాలని , పునర్వైభవం పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ , ఆకాంక్షిస్తూ …
– g.ramarao