– కృష్ణపట్నం, ఎన్టిటిపిఎస్ ల్లో 800 మెగావాట్ల విద్యుత్ యూనిట్లు
– హైడెల్ ప్లాంట్ల ద్వారా మరో 6000 మెగావాట్ల ఉత్పత్తికి ప్రణాళిక
– మే ఒకటి నుంచి సాధారణ స్థాయికి విద్యుత్ ఉత్పత్తి
– నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి
– చంద్రబాబు హయాంలో విద్యుత్ ఉద్యమంలో ముగ్గురిని పొట్టన పెట్టుకున్నారు
– అటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఉండవు
– వ్యవసాయం, పరిశ్రమలకు అండగా ఉంటాం
– దేశం మొత్తం విద్యుత్ ఇబ్బందులను ఎదుర్కొంటోంది
– రాష్ట్రంలో వాటిని అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం
– మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమరావతి: రాష్ట్రంలో మరో రెండు థర్మల్ కేంద్రాల నుంచి అదనంగా 1600 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభించేందుకు సర్వం సిద్దమైనట్లు ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ కొరత తాత్కాలికమేనని, మే ఒకటి నుండి విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా పై ఏపీ జెన్ కో, ఎపి ట్రాన్స్ కో నెడ్ క్యాప్, ఏపీఎస్ఈసిఎంల అధికారులతో రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణపట్నంలో మరో నెలలో 800 మెగావాట్లు, నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్) లో మరో మూడు, నాలుగు నెలల్లో 800 మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. కృష్ణపట్నం యూనిట్ ను వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇది కాక కొత్తగా మరో 6000 మెగావాట్ల హైడెల్ ( పంప్డ్ హైడ్రో స్టోరేజీ ) సామర్థ్యం గల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం రోజువారీ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లు ఉండగా కేవలం 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉందన్నారు. దీనివల్ల రోజుకు 55 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం దీనిలో 30 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ ను విద్యుత్ ఎక్స్ఛేంజీల నుంచి సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. విద్యుత్ ఎక్స్ఛేంజీలలోను డిమాండ్, సప్లై ల మధ్య భారీగా అంతరం ఉండటం వల్ల ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ విద్యుత్ లభ్యత లేక సాధ్యపడటం లేదని అన్నారు.
దేశంలో తీవ్రమైన బొగ్గు కొరత వల్ల కొన్ని థర్మల్ ప్లాంట్లు మూతబడ్డాయన్నారు . అదే సమయంలో కోవిడ్ అనంతరం ఆర్థిక కలాపాలు పుంజుకోవటం వల్ల విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు. తగినంత విద్యుత్ అందుబాటులో లేకపోవటం వల్ల నిరంతరంగా నడిచే పరిశ్రమలకు 50 శాతం లోడ్ రిలీఫ్ ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మరి కొన్ని పరిశ్రమలకు వారానికి ఒక రోజు పవర్ హాలిడే ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న పంటలను కాపాడుకోవటం కోసం వ్యవసాయానికి పగటి పూటే 7 గంటలు పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను ఖచ్చితంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. గృహ విద్యుత్ సరఫరాకు ఆటంకాలు లేకుండా చూస్తున్నట్లు తెలిపారు.
భవిష్యత్ లోనూ 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్ ను కొనసాగించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, ప్రస్తుత సమస్య కేవలం బొగ్గు కొరత వలనే ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించి సరఫరాను యధా స్థితికి తీసుకురావటానికి విద్యుత్ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నాయని అన్నారు. వినియోగదారులంతా ఈ సమయంలో విద్యుత్ సంస్థలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరిగి పవర్ ఎక్స్ఛేంజీలలో కొనేందుకు కూడా విద్యుత్ దొరకని ఈ సమయంలో కూడా వ్యవసాయానికి పగటి పూట 7 గంటలు, గృహ విద్యుత్ సరఫరా కు ఢోకా లేకుండా విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకున్నాయని పేర్కొన్నారు.
నిజానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి విద్యుత్ రంగం తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కుంటోందని, విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం వైయస్ జగన్ ముందుచూపుతో కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారని తెలిపారు. దానికి అనుగుణంగానే మంచి ఫలితాలను సాధించడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం బొగ్గుసరఫరా విషయంలో ఎదురవుతున్న సమస్యల కారణంగా థర్మల్ ప్లాంట్ లలో విద్యుత్ వినియోగానికి పరిమితులు ఏర్పడుతున్నాయని అన్నారు. వీటన్నింటినీ అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. విద్యుత్ విషయంలో జాతీయ స్థాయిలోనే ఇబ్బందులు ఏర్పడ్డాయని, పలు రాష్ట్రాలు విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్నాయని అన్నారు.
మన రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై మాట్లాడుతున్న వారు గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో విద్యుత్ రంగాన్ని ఏ విధంగా కొనసాగించారో, రైతులు ఉద్యమాలు చేసిన సమయంలో కాల్పులు జరిపి ముగ్గురిని పొట్టన పెట్టుకున్న ఉదంతాలను వారు మరిచిపోయారా అని ప్రశ్నించారు. సీఎం వైయస్ జగన్ పాలనలో అటువంటి పరిస్థితులు ఎన్నడూ ఉత్పన్నం కావని, సమర్థవంతంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు దృష్టి సారించి, నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు.
ఈ సమావేశంలో ఇంధన కార్యదర్శి బి.శ్రీధర్, ఎపి ట్రాన్స్ కో జెఎండి ఐ.పృథ్వితేజ్, నెడ్ క్యాప్ ఎండి ఎస్ రమణా రెడ్డి తదితరులు మాట్లాడుతూ విద్యుత్ రంగంలో అమలు చేస్తున్న కార్యకలాపాలను మంత్రికి వివరించారు.