– భారీ నుంచి అతి భారీ వర్షాలు
విశాఖపట్నం : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, కాకినాడకి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని, ఆ తర్వాత క్రమంగా దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ తుపాను కారణంగా ఈ రోజు రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, ఒడిశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని
తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాన్ హెచ్చరికల అధికారి జగన్నాథ కుమార్ సూచించారు.
విమాన కార్యకలాపాలు రద్దు : ఈ తుపాను కారణంగా మే 10న చెన్నై, విశాఖపట్నంలో పలు విమానయాన సంస్థలతో వివిధ విమాన కార్యకలాపాలను రద్దు చేసినట్లు ఏమియేషన్ అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా 23 ఇండిగో విమానాలు రాకపోకలను రద్దు చేసినట్లు విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అంతేకాదు నాలుగు ఎయిర్‌ఏషియా విమానాలు కూడా రద్దు చేసినట్లు కూడా వెల్లడించారు.