Home » గాయంపై.. గందరగోళం!

గాయంపై.. గందరగోళం!

– పెరుగుతున్న జగనన్న తల పట్టీ సైజు
– చిన్న పట్టీ నుంచి పెద్ద పట్టీ వేసుకున్న వైనం
– వెల్లంపల్లి కంటిపైనా ‘పేద్ద’ పట్టీ
– పోలింగ్ నాటికి ఇంకా పెరిగే అవకాశం?
– అదే మాట చెప్పిన రఘురామకృష్ణంరాజు
-పెరుగుతున్న పట్టీ సైజుపై అభిమానుల ఆందోళన

గాయం… ఘోరం.. అది హత్యాయత్నానికి దారితీసిన చిన్నగా కనిపించే ‘పేద్ద‘ గాయం.. లక్షలాదిమంది అక్కాచెల్లెమ్మలు.. అవ్వాతాతలు.. మేనల్లుళ్లు గుండెలో గుడికట్టుకుని కొలిచే ‘సంక్షేమ దేవుడు’ జగనన్నకు, తృటిలో తప్పిన ప్రమాదమది. ఇప్పుడు అందరి ఆందోళన ఒకటే. శివుని నుదుటన తలపై విబూది మాదిరిగా ఇంకెంత కాలం ఉంటుంది? జగనన్న తలకు కట్టిన పట్టీ సైజు రోజురోజుకూ ఎందుకు పెరుగుతోంది? ఎవరికైనా తగిలిన దెబ్బ రోజురోజుకూ తగ్గుతుంటుంది. కానీ జగనన్న తలకు తగిలిన గాయంపై వేసిన పట్టీ రోజురోజుకూ రివర్స్‌లో ఎందుకు పెరుగుతోంది? జమిలిగా తగిలిన ఆ రాయిదెబ్బతో వేసిన అరచేతిమందంసైజు పట్టీకట్టు, వెల్లంపల్లి తలపై ఇంకెంత కాలం ఉంటుంది? పోలింగ్‌తో పోతుందా?.. ఇదీ ఇప్పుడు జగనన్న అభిమానుల ఆందోళన.
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ సీఎం జగనన్నను హత్య చేసేందుకు బెజవాడలో వడ్డెర కుర్రాళ్లు విసిరిన రాయి నుంచి, ఏసుప్రభువు దయవల్ల ఆయన బయటపడ్డారు. ఇడుపులపాయలో జగన్ చేసిన ప్రార్ధనలే దానికి కారణమన్నది నిర్వివాదం. నిజానికి ఆ ఫ్లోర్ వేసే రాయితో జగనన్న హత్య చేయాలన్నది, బెజవాడ వడ్డెర మైనర్ కుర్రాళ్ల పథకమని పోలీసుల వాదన. అయితే రాయి విసిరిన ఆ ఏకలవ్యులు మైనర్లా? మేజర్లా అన్నది ఇంకా తేలిచావడం లేదు. ఆధార్ కార్డు ప్రాతిపదిక అని ఒకరు.. ఆసుపత్రిలో పుట్టిన తేదీ సర్టిఫికెట్ ఆధారంగా అని ఇంకొకరు వాదులాదుకుంటున్నారు. అది వేరే కథ.

సరే జగనన్నను చిన్న రాయితో.. అన్ని మీటర్ల నుంచి హత్య చేయాలనుకున్న వడ్డెర కుర్రాడిని పోలీసులు అరెస్టు చేసి, జైల్లో పెట్టారు. మరో కుర్రాడిని దయతలచి వదిలిపెట్టారనుకోండి. అసలు అన్నయ్యను హత్య చేసేందుకు కుట్ర చేసిన ఆ రాయి ఏమైంది? పోలీసు పంచనామాలో ఆ రాయిని సీజ్ చేసినట్లు పేర్కొన్నారా? అదొక సందేహం.
సహజంగా ఏదైనా దాడి జరిగినా, హత్య జరిగినా, లేక హత్యాయత్నం జరిగినా దానికి కారణమైన వస్తువును, పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. దాని ఆధారంగా కేసు విచారిస్తుంటారు. అది కోడికత్తి కావచ్చు. లేదా గొడ్డలి కావచ్చు. గతంలో జగనన్న విపక్ష నేతగా ఉన్నప్పుడు, విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన కోడికత్తి దాడి తెలిసిందే. కోడికత్తితో దాడి చేసి శ్రీనుతోపాటు, కోడికత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

వివేకాను హత్య చేసిన గొడ్డలిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే వివేకా.. ముందు గుండెపోటుతో.. తర్వాత రక్తపు విరేచనాలతో.. ఆ తర్వాత తనంతటతానే గొడ్డలితో నరుక్కుని, మళ్లీ పైకి లేచి రక్తంతో ఉన్న గదిని తానే తుడుచుకుని.. తన కుట్లు తానే వేసుకుని.. మళ్లీ ఏదో గుర్తుకొచ్చినట్లు లేఖ రాసి మళ్లీ చనిపోయారనుకోండి. ఆ తర్వాత కదా అది హత్య అని తేలింది?! ఆ కథ వేరు. ఆ వ్యవహారం వేరనుకోండి.

అయితే కోడికత్తితో జగనన్న భుజానికి గాయమయితే, ఆయన ఇప్పుడు బెజవాడలో సర్కారు ఆసుపత్రికి కాకుండా.. ఫ్లైటెక్కి హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. విచారణకు వెళ్లిన పోలీసులకు తాను సహకరించనని, ఏపీ పోలీసులను నమ్మేది లేదని జగనన్న నిర్మొహమాటంగా చెప్పారు. సరే.. ఆ కోడికత్తి గాయానికి చికిత్స చేసిన డాక్టరు రెడ్డిగారికి, తర్వాత సర్కారీ కొలువు ఇచ్చారనుకోండి. అది వేరే విషయం.

అయితే..ఇప్పుడు బెజవాడ సర్కారు ఆసుపత్రిలో కంటిపైన తగిలిన రాయికి, డజనుమంది డాక్టర్ల బృందంతో చికిత్స చేయించుకున్న జగనన్నకు.. అసలు ఏమైందో చెప్పే మెడికల్ రిపోర్టు, ఇప్పటివరకూ బయటపెట్టకపోవడమే వింత. నిజానికి అది రాయి విసిరితే తగిలిన దెబ్బనా? లేక గజమాలలోని ఇనుప తీగ గీసుకుని, తగిన దెబ్బనా అన్నది ఇప్పటిదాకా బయటపెట్టలేదు. అది తేలిస్తేగానీ జగన్ అభిమానులు శాంతించరు.

దాన్నలాపక్కనపెడితే.. రాయి దెబ్బ తగిలిన తర్వాత జగనన్న కంటిపై కనిపిస్తున్న పట్టి సైజు, రోజురోజుకూ పెరుగుతుండటం అన్నయ్య అభిమానులను ఆందోళన పరుస్తోంది. ఎమ్మెల్యే వెల్లంపల్లికి వేసిన అతి పెద్ద పట్టీ అయితే ఇంకా ఆందోళన కలిగిస్తోంది. దెబ్బతగిలిన వెంటనే ఆసుపత్రికి వెళ్లిన జగన్ కంటిపైన.. వై ఆకారంతో గీసుకున్న దృశ్యం ఫొటోలలో స్పష్టంగా కనిపించింది. చికిత్స తర్వాత కొంచెం చిన్న సైజు పట్టి వేసుకున్నట్లు కనిపించింది. మళ్లీ తర్వాత జనంలోకి వెళుతున్న జగన్ నుదుటిపై, ఆ పట్టి సైజు ఇంకా పెరగడం ఇంకా ఆందోళనగా మారింది.

ఈ పట్టి సైజు పోలింగ్ నాటికి.. అరచేయి సైజు పెరిగే అవకాశాలుంటాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎంపి రఘురామకృష్ణంరాజు కూడా ఇదే చెబుతున్నారు. ‘జగన్మోహన్‌రెడ్డి తలపై వేసిన పట్టీ పోలింగ్‌కు ముందురోజునాటికి అరచేయి సైజు దాటినా ఆశ్చర్యం లేదు. మరి మెడికల్ రిపోర్టులో డాక్టర్లు ఏం చెప్పారన్నది ఇంకా బయటకు రాలేదు. హత్య చేసేందుకు విసిరిన రాయి పోలీసుల స్వాధీనం ఉండి, దానిని కోర్టుకు సాక్ష్యంగా చూపారో లే దో తెలియదు. ఎందుకంటే ఆ రాయి విఠలాచార్య, కమలాకర కామేశ్వరరావు సినిమాల్లో కెమెరామెన్లు సృష్టించిన అద్భుతమైన రాయి. ముందు జగన్‌కు తగిలి, కిందపడి మళ్లీ పైకి తనంతట తానే పైకి లేచి, పక్కనే ఉన్న వెల్లంపల్లికి తగిలిన జంపింగ్ రాయి. అసలు ఆ రాయిని స్టేట్ మ్యూజియంలో భద్రపరచాల’’ని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం.

One thought on “గాయంపై.. గందరగోళం!

Leave a Reply