– తెలంగాణ ఎన్నికల్లో ఇదో విచిత్రం
– ఎన్నికలకు దూరంగా టీడీపీ
– దానితో అయోమయంలో తమ్ముళ్లు
– బాబు అరెస్టు తర్వాత మారిన తమ్ముళ్ల ధోరణి
– గతంలో బీఆర్‌ఎస్‌కు బాసటగా నిలిచిన కార్యకర్తలు
– తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గంపగుత్త మద్దతు
– దానితో బాబు అరెస్టును ఖండించిన కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
– స్థానికంగా తమ్ముళ్ల ఆగ్రహం తగ్గించే వ్యూహం
– ఖమ్మంలో తుమ్మల ర్యాలీలో టీడీపీ జెండాల రెపరెప
– ఖైరతాబాద్, శేరిలింగంపల్లిలోనూ అదే సీన్లు
– కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ర్యాలీలో టీడీపీ జెండాలు
– ఎన్టీఆర్ విగ్రహాల వద్ద కాంగ్రెస్-బీఆర్‌ఎస్-బీజేపీ నేతల క్యూ
– తామెవరికీ మద్దతున్విడం లేదన్న టీడీపీ
– అయినా కాంగ్రెస్ వైపే తమ్ముళ్ల చూపు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు తెలుగుదేశం మీదే. తెలుగుదేశం పిలుస్తోంది. రండి. కదలిరండి అన్న నినాదంతో వేడిపుట్టించింది. ఎన్టీఆర్ నిలువెత్తు ఫొటో కింద తెలుగుదేశం పిలుస్తోంది.. రా.. కదలిరా అన్న ట్యాగ్‌లైన్ కనిపించేది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో విచిత్రంగా అన్ని ప్రధాన పార్టీలూ.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, రండి.. కదలిరండి అని పిలుస్తున్న వైచిత్రి. ఇదో ‘రాజకీయ ప్రేమాభిషేకం’!
వివిధ కారణాలతో తెలంగాణ ఎన్నికల్లో, టీడీపీ పోటీ చేయకుండా దూరంగా ఉంది. పోటీకి చాలామంది ఉత్సాహం చూపినప్పటికీ, సన్నద్ధతకు తగిన సమయం లేనందున అసెంబ్లీకి దూరంగా ఉండి, పార్లమెంటుకు పోటీ చేయాలని నిర్ణయించింది. పార్టీ నిర్ణయానికి నిరసనగా, పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. అయితే టీడీపీ ఏ పార్టీకీ మద్దతు ప్రకటించకపోవడంతో, క్యాడర్ అయోమయంలో పడింది.
చంద్రబాబు అరెస్టు వెనుక జగన్-కేసీఆర్ ఉన్నారని, వారికి కేంద్రంలోని బీజేపీ దన్నుగా ఉన్నందుకే బాబు అరెస్టు జరిగిందన్న భావన, టీడీపీ శ్రేణుల్లో బలంగా నాటుకుపోయింది. ఫలితంగా మెజారిటీ స్థానాల్లో, టీడీపీ శ్రేణుల అసంతృప్తిని గ్రహించిన కాంగ్రెస్.. వారిని తన వైపు తిప్పుకోవడంలో విజయం సాధించింది.
అటు బాబును అరెస్టు చేశారన్న కసి-ఇటు తమ సేవలను వాడుకునేందుకు మరొక పార్టీ పిలిచిందన్న ఆనందం.. కలసి వెరసి తమ్ముళ్లను కాంగ్రెస్ వైపు అడుగులు వేసేలా చేశాయి.
ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావుకు మద్దతుగా.. ప్రియాంక నిర్వహించిన ర్యాలీలో టీడీపీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. నిజానికి ఆ ర్యాలీకి కాంగ్రెస్ కార్యకర్తలకంటే, టీడీపీ కార్యకర్తల సంఖ్యనే ఎక్కువ కావడం విశేషం. పైగా తుమ్మల టీడీపీలో సుదీర్ఘకాలం కొనసాగినందున, ఆయనపై ఉన్న అభిమానం కూడా అక్కడి తమ్ముళ్లను తుమ్మల వైపు మళ్లేలా చేసింది. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ శ్రేణులంతా, కాంగ్రెస్ అభ్యర్ధుల కోసమే పనిచేస్తున్న వైచిత్రి. అన్నింటికంటే ముఖ్యంగా.. ఖమ్మంలో తుమ్మలకు వివిధ జిల్లాలు, ఇతర రాష్ర్టాల వారు కూడా వచ్చి పనిచేస్తుండటం విశేషం.
ఇక ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధి-పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి విజయం కోసం, టీడీపీ శ్రేణులు బాహాటంగానే పనిచేస్తున్నారు. ఖైరతాబాద్ తమ్ముళ్లతో కలసి ఆమె ఎన్టీఆర్ ఘాటు వద్దకు వెళ్లడం విశేషం. తాజాగా సెటిలర్ల ఓట్లు దండిగా ఉన్న శేరిలింగంపల్లిలోని ఏడు డివిజన్ల టీడీపీ అధ్యక్షులు తాము బీఆర్‌ఎస్ అభ్యర్ధి, సిట్టింగ్ అభ్యర్ధి అరికపూడి గాంధీకే మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం సంజీవరెడ్డినగర్‌లో కమ్మసంఘం నేతలు బీఆర్‌ఎస్ అభ్యర్ధి -మంత్రి తలసాని
శ్రీనివాసయాదవ్‌కు మద్దతునిస్తున్నటుల ప్రకటించారు. కమ్మ సంఘం కోరికమేరకు ఎన్టీఆర్ విగ్రహం తానే నిర్మిస్తానని తలసాని హామీ ఇచ్చారు.
గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో అయితే.. మొన్నటి వరకూ ఎవరికీ పట్టని ఎన్టీఆర్ విగ్రహాలు, ఇప్పుడు పూలతో నిండిపోయి కనిపిస్తుండటం ఆశ్చర్యం. అంటే కాంగ్రెస్-బీజేపీ-బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధులకు అన్నగారిపై ప్రేమ ముంచుకొచ్చిందన్నమాట.
ఎల్బీనగర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్ధి సుధీర్‌రెడ్డి గత నెలలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. తాజాగా కాంగ్రెస్ అభ్యర్ధి మధుయాష్కీ కూడా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, అన్నకు నివాళులర్పించారు. సహజంగా ఎన్టీఆర్ అంటే చిరాకు పడే కాంగ్రెస్ పార్టీ నాయకులకు.. ఇప్పుడు అదే ఎన్టీఆర్ విగ్రహాలు ఓట్లు రాల్చే కేంద్రాలుగా మారడమే వింత.
ఇక చంద్రబాబు పేరు చెబితేనే చిటపటలాడే కాంగ్రెస్-బీఆర్‌ఎస్ నేతలు.. ఇప్పుడు ఆయన అరెస్టుపై బోలెడంత సానుభూతి కుమ్మరిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుకు బీజేపీ కారణమని, కాంగ్రెస్ అభ్యర్ధులు ఆరోపిస్తుంటే.. బీజేపీ మద్దతుతోనే చంద్రబాబును అరెస్టు చేశారు. అందులో మాకేం సంబంధం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.
చివరకు చంద్రబాబు అరెస్టు వార్త తననూ బాధించిందని, బీఆర్‌ఎస్ ఉత్తరాధికారి కేటీఆర్ కూడా సెలవిచ్చారు. చంద్రబాబుగారి ఆరోగ్యం దెబ్బతిందని తెలిసి తానూ బాధపడ్డానని, ఆ బాధేమిటో ఒక కొడుకుగా త నకూ తెలుసని బోలెడంత సానుభూతి కురిపించారు.
ఇంతకూ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయని తెలుగుదేశం పార్టీపై, ఇతర పార్టీల ‘ప్రేమాభిషేకం’ ఎందుకంటే.. వారికి రాష్ట్రంలో ఉన్న ఓట్లు, సానుభూతిపరులకోసమన్నమాట! చంద్రబాబు అరెస్టును ఎంత బలంగా ఖండిస్తే, ఈవీఎంలలో తమ పార్టీకి అన్ని పాజిటివ్ లైట్లు వెలుగుతాయన్న ముందుచూపు. అయితే ఈ ‘రాజకీయ ప్రేమాభిషేకం’లో, ఎక్కువమంది తమ్ముళ్ల ప్రేమ పొందింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే!
నిజానికి టీడీపీ పోటీలో ఉంటే.. ఇంత ప్రేమాభిషేకం కురిసే అవకాశాలు ఏమాత్రం ఉండవు. తిట్ల వర్షం తప్ప ఓట్ల ప్రేమ కనిపించదు. ‘పైగా ఆంధ్రా పార్టీకి ఇక్కడేం పని అని’ కేసీఆర్ సారు మళ్లీ తిట్ల పురాణం అందుకునేవారు. అంటే ‘చచ్చి బతికిందన్న’ సామెత మాదిరిగా… టీడీపీ పోటీచేయకుండానే బోలెడుమంది ఆ పార్టీని తమ సొంతం చేసుకుంటున్న వైచిత్రి. రేపు ఫలితాల తర్వాత.. కూడికలు-తీసివేత లెక్కల్లో, ‘‘అదే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి ఉంటేనా’’… అన్న చర్చకు తెరలేవడం ఖాయం. అంటే ఓడిన వారికి టీడీపీ సాకు ఒకటి ఎవరెడీగా దొరుకుతుందన్న మాట.
ఆవిధంగా టీడీపీ పోటీచేస్తే ఎన్ని సీట్లు.. ఎన్ని ఓట్లు వస్తాయో తెలియదు గానీ.. పోటీ చేయకుండానే, ఇంత డిమాండ్ సంపాదించుకోవడం మాత్రం గొప్పేకదా?!