బీజేపీకి మరో సీటు కావాలట

– అనపర్తి బదులు రాజమండ్రిపై క న్ను
– సోము వీర్రాజు కోసమట
– రాజమండ్రి కోరికపై కమలంలో ఆశ్చర్యం
– సిట్టింగ్ సీట్లు ఎలా ఇస్తారంటున్న టీడీపీ
– వీర్రాజుకు ఓటు బదిలీ ఎలా అవుతుందంటున్న సొంత పార్టీ నేతలు
– ఆ సీటు తీసుకుని వైసీపీని గెలిపించడానికేనన్న ప్రశ్నలు
– అదనంగా మరో అసెంబ్లీ అడుగుతున్న బీజేపీ
– రాజంపేట లేదా తంబళ్లపల్లెపై పట్టు?
– టీడీపీ నుంచి మరో సీటు కష్టమే?
– జనసేన కోటా నుంచి తీసుకోవాల్సిందే
– ధర్మవరం నుంచి సత్యకుమార్‌కు ఖరారు?
– గెలవని సీట్లపై పట్టెందుకంటున్న బీజేపీ సీనియర్లు
– ఇచ్చిన సీట్లలో అభ్యర్ధులకే దిక్కులేదన్న అసంతృప్తి
– కమలంలో సీట్ల ఆశ
(మార్తి సుబ్రహ్మణ్యం)

తమ పార్టీ నాయకత్వ తీరు ఆశ లావు పీక సన్నం అన్న చందాన ఉందని బీజేపీ సీనియర్లు ఎద్దేవా చేస్తున్నారు. టీడీపీ-జనసేన పొత్తులో దక్కిన పది అసెంబ్లీ స్థానాలకే, బలమైన అభ్యర్ధులు లేని క్రమంలో… మరొకటి అదనంగా కావాలని కోరడంపై పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర పార్టీ నేతల డిమాండ్లు చూస్తుంటే బలంలేని చోట సీట్లు తీసుకుని, అక్కడ వైసీపీని గెలిపించాలన్న వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోందన్న వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

తాజాగా విజయవాడలో జరిగిన బీజేపీ కీలక భేటీలో పొత్తులో భాగంగా, మరొక అసెంబ్లీ సీటు కావాలని టీడీపీని కోరాలని నిర్ణయించినట్లు సమాచారం. రాయలసీమ నుంచి ఎక్కువ సీట్లు కోరడంపై సొంత పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తంబళ్లపల్లె లేదా రాజంపేట అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు టీడీపీ నాయకత్వంతో చర్చిస్తామని, పార్టీ ఇన్చార్జి సిద్దార్ద్‌నాధ్‌సింగ్ పార్టీ నేతలకు చెప్పినట్లు తెలిసింది.

పార్టీ సీనియర్ నేత చల్లపల్లి నరసింహారెడ్డి కోసమే తంబళ్లపల్లె కోరుతున్నట్లు తెలిసింది. ఇప్పటికి రెండు, మూడు సార్లు ఓడిన ఆయనకు చివరి అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తోందట. అయితే ఏమాత్రం బలం లేని ఉమ్మడి కడప జిల్లాలో, మూడు సీట్లు కోరడం ఎవరిని గెలిపించానికి అన్న ప్రశ్నలు, సొంత పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఇక తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బదులు, రాజమండ్రి రూరల్ లేదా రాజమండ్రి కావాలని కోరుతున్నారన్న వార్తలు పార్టీవర్గాలను విస్మయపరుస్తున్నాయి. ఆ రెండు నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీ అభ్యర్ధులను ప్రకటించేసింది. అక్కడ నుంచి మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కోసం, పార్టీలోని ఒక వర్గం ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖుడితోపాటు, గతంలో సంఘటనా మంత్రిగా పనిచేసిన మరొక ప్రముఖుడు మద్దతునిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపి రఘురామకృష్ణంరాజుకు నర్సాపురం సీటు దక్కకుండా, ఈ ప్రముఖులే అడ్డు చక్రం వేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే బీజేపీ కోరుతున్న రెండు నియోజకవర్గాల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానబలం లేని సోము వీర్రాజు కోసం, తాము సీట్ల త్యాగం చేయలేమని టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. స్థానికంగా ఏ మాత్రంబలం లేని వీర్రాజుకు రాజమండ్రి ఎలా ఇస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అయినా సోము వీర్రాజుకు ఆ సీటు ఎలా ఇస్తారు? సోము వీర్రాజు టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేశారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైసీపీపై ఎలా వ్యవహరించారో మీకూ తెలుసు. ఇప్పుడు ఆయనకు సీటు అడిగితే టీడీపీ వాళ్ల ఓట్లు మా పార్టీకి ఎలా బదిలీ అవుతాయి? ఒక్క టీడీపీ కార్యకర్తయినా వీర్రాజుకు ఓటేస్తారా? పోనీ మా పార్టీకి అక్కడ ఏమైనా సొంత బలం ఉందా? అంటే అక్కడ వైసీపీని గెలిపించేందుకే ఆ సీటు అడుగుతున్నారా? అని రాజమండ్రికి చెందిన ఓ సీనియర్ బీజేపీ నేత ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా.. ధర్మవరం అసెంబ్లీ సీటు, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్‌కు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి గత పదిరోజుల క్రితమే కేంద్ర పార్టీ, ఆయనను అసెంబ్లీకి పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. సత్యకుమార్ చాలాకాలం నుంచి హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరి, సత్యకుమార్, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్‌రాజు,ఆదినారాయణరెడ్డి వంటి బలమైన నేతలు అసెంబ్లీ బరిలో దిగడం పార్టీకి శుభసూచికమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరంతా అసెంబ్లీకి అడుగుపెడితే 80వ దశకంలో అసెంబ్లీ గుర్తుకురాక తప్పదంటున్నారు.

ఇలా అంగ-అర్ధబలాల్లో వైసీపీని ఎదుర్కొనే స్థాయి నేతలను రంగంలోకి దింపకుండా.. వందల ఓట్లు కూడా తెచ్చుకునే స్థాయి నేతలకు టికెట్ ఇవ్వడం ద్వారా.. పరోక్షంగా వైసీపీకి సహకరించినట్టే అవుతుందన్న వ్యాఖ్యలు బీజేపీ సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి.

Leave a Reply