Home » జగన్ శత్రువు జగనే!

జగన్ శత్రువు జగనే!

( మార్తి సుబ్రహ్మణ్యం)

మనిషికి శత్రువు మనిషే. జగన్‌కు శత్రువు జగనే! ఈ ఐదేళ్ల కాలంలో జగన్ నైజం అనుభవించిన ఆంధ్రా ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ పతనాన్ని శాసించింది జనం అనుకుంటే పొరపాటు. చంద్రబాబు ఓడించారనుకుంటే మహా పొరపాటు. తన పతనాన్ని తానే శాసించుకున్నారాయన. అలాంటి అవకాశం జగన్ జనాలకు ఇవ్వదలచుకోలేదని ఫలితాలే స్పష్టం చేశాయి. మూర్తీభవించిన అహంకారం, నిలువెల్లా నియంత్రృత్వం, సర్వజనులూ తనకు సాగిలబడాలన్న శాడిజం, ఎదుటివారిని గౌరవించకుండా అవమానించే కండకావరం, ప్రత్యర్ధులను వేటాడే ఆటవికోన్మాదం.. వీటికిమించి తానొక దైవాంశసంభూతుడినన్న వెర్రి భమలు. కలసి వెరసి ఒక జగన్! ఇదీ ఇప్పుడు కళ్లు తెరిచి నిజం తెలుసుకున్న వైకాపేయుల భావన.

ఐదేళ్లపాటు ఆయనలోని శాడిజాన్ని దగ్గరుండి చూసిన వారికి ఈ వర్ణన పాతదే కావచ్చు. కానీ బయట నుంచి చూసే మహాజనులకు మాత్రం కొత్తదే. జగన్ చుట్టూ ఉన్న ‘విజ్ఞానవంతులనుమనుకునే’ అజ్ఞానులే, ఆయనను భస్మాసురుడిగా మార్చారన్నది నిష్ఠురనిజం. లేకపోతే వారెంత? వారికి ఉన్న రాజకీయ అనుభవమెంత? వారిచ్చే బోడి సలహాలేమిటి? వాటిని జగన్ మతిలేకుండా గతితప్పిన వారి సలహాలు పాటించడమేమిటి? ఆ ప్రభావమే జగన్‌ను 11 మంది ఎమ్మెల్యేల నాయకుడిగా దిగజార్చిందన్నది.. జగన్‌ను జగజ్జేతగా భావించే అభిమానుల నిశ్చితాభిప్రాయం.

రాజకీయ నేతలు సంపాదన సంగతి పక్కనబెడితే.. గౌరవం ఆశిస్తారు. అధినేతల వద్ద తమ మనోభావాలు వెళ్లబోసుకోవాలనుకుంటున్నారు. ప్రజల పల్సును అధినేత దృష్టికి తీసుకువెళ్లాలని పరితపిస్తుంటారు. వాటిని అమలుచేయాలా? వద్దా అన్నది అధినేతల నిర్ణయమయితే, కనీసం వాటిని వినడం నాయకుడి ధర్మం. చంద్రబాబుగానీ, వైఎస్ దగ్గర ఈ లక్షణాలు బాగా కనిపించేవి. కానీ అదెక్కడా ఈ ఐదేళ్లలో జగన్ తన పరివారానికి ఇచ్చిన దాఖలాలు భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు. రెండుమూడుసార్లు మంత్రులుగా చేసిన వారిని సైతం సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, ధనంజయరెడ్డి ఎదుట ముద్దాయిలుగా నిలబెట్టిన అహంకారిగా జగన్ ముద్రపడ్డారు. అసలు రాజకీయాల్లో వీరి అనుభవం ఎంత? చంద్రబాబును ఢీకొట్టడం అటుంచి, ఆయన వ్యూహాలు పసిగట్టే స్థాయి-అనుభవం-తెలివి వీరిలో ఎంతమందికి ఉందన్నది ప్రశ్న. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, జక్కంపూడి పార్టీ ఓటమికి సీఎంఓ కార్యదర్శి ధనంజయరెడ్డి అహంకారమే కారణమని నిర్మొహమాటంగా చెప్పారు. తమను గంటలపాటు చాంబరు బయట నిలబెట్టిన ధనంజయరెడ్డి అహంకారం ముందు, తమ అనుభవం అవమానించబడిందన్నది వారి ఆవేదనలో అణువంతయినా అబద్ధం లేదు. ఇప్పుడు బయటపడింది ఈ ముగ్గురే కావచ్చు. కానీ ఆగ్రహంతో రగిలిపోతున్న అందరి అంతరంగం ఇదేనన్నది.. మనం మనుషులం అన్నంత నిజం.

జగన్ చేయాల్సిన ఆలోచలన్నీ ఆయనే చేసి, అమలు చేయడం వల్లే పార్టీ కూలి నేలరాలిందన్నది వారి ఆగ్రహం. నియోజకవర్గ అభివృద్ధి కోసం ధనంజయరెడ్డి దగ్గర సాగిలబడి, నిధులు అడుక్కోవలసిన ఖర్మ పట్టిందన్న వారి మనోవేదనకు బాధ్యుడు జగనే. ఆయన చాంబరు దగ్గర చకోరపక్షుల్లా కావలికాసి, ఫోన్లు కూడా తీయని ధనంజయరెడ్డికి రాజకీయ వ్యూహరచన చేసేంత అనుభవం ఎక్కడుంది?
సీఎం సొంత జిల్లా, బంధువన్న ఏకైక కారణం తప్ప, మంత్రులు సైతం ఆయన చాంబరు దగ్గర వేచి ఉండటానికి మరేం అర్హత ఉంది? చూడ్డానికి ఇది ధనంజయరెడ్డిపై తిరుగుబాటుగానే కనిపిస్తున్నా, నిజానికి ఈ తిరుగుబాటు బావుటా జగన్‌పైనే. జగన్ అవకాశం ఇవ్వకపోతే ధనంజరెడ్డి వంటి అధికారులు నేతలపై పెత్తనం చెలాయించరుకదా?

నిజానికి ఈ ఐదేళ్లలో జగన్ ఒక్క ఎమ్మెల్యేకూ అపాయింట్‌మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే వారంతా తన స్థాయి కాదన్నది అసలు అహంకారం. ఏమున్నా సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పుకోవడమే. అసలు సజ్జల రాజకీయ అనుభవం ఎంత? ఆయనెప్పుడైనా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారా? ఒక పార్టీకి కార్యకర్తగా జెండా మోశారా? పూర్వాశ్రమంలో జర్నలిస్టుగా పనిచేసిన సజ్జలకు, రాజకీయ నిర్ణయాలు తీసుకునేంత అవగాహన ఉంటుందా? ఎత్తుగడలు-ఎత్తుపైఎత్తులు-వ్యూహరచన చేసే తెలివి ఉందా?

రోజూ మీడియాలో ఎదురుదాడి చేస్తే సరిపోతుందా? కార్యకర్తల పల్స్ తెలిసే ఎమ్మెల్యే, నాయకుల అభిప్రాయాలకు విలువ ఇవ్వరా? వాలంటీర్లతో ఎమ్మెల్యేలు-నాయకులను నామమాత్రావశిష్టులను చేసి, నేరుగా జగన్ టు ఓటరుతో సరిపుచ్చే అతితెలివి ఆలోచనను నాయకులు స్వాగతిస్తారా? అసలు సజ్జలకు పెత్తనం ఇస్తే పార్టీ పెరుగుతుందా? మునుగుతుందా అన్న తెలివి లేదా? ఇవన్నీ.. ఎమ్మెల్యేలను ఆయన దయాధర్మానికి విడిచిపెట్టిన జగన్ తొలిరోజుల్లోనే ఆలోచిస్తే, ఈ పతనం తప్పేదన్నది పార్టీవాదుల వాదన. క్షవరం అయితే గానీ వివరం తెలియదు మరి. ఇప్పుడు జగన్‌కు క్షవరం అయింది. మరి వివరం తెలిసిందా?

పార్టీ ఎలా విజయం సాధించాలని సూక్తులు చెప్పి, చాలాకాలం చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి ఎంపీగా పోటీ చేసి ఎందుకు ఓడిపోయారు? అభ్యర్ధులకు ఉపదేశించిన వ్యూహాలు, తన గెలుపునకు ఎందుకు పనిచేయలేదు? జనంలో లేని వారు ఒక్కసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే ఫలితాలు ఇంతకు భిన్నంగా ఎందుకు ఉంటాయి?

ప్రజాస్వామ్యంలో బ్రూట్ మెజారిటీ ఎవరికీ మంచిదికాదు. అది నాయకుడిని నియంతను చేస్తుంది. కళ్లు నెత్తికెక్కేలా ఆ మెజారిటీ కిక్కు ఇస్తుంది. ఆ సంఖ్య నాయకుడిని భ్రమల్లో బతికిస్తుంది. మళ్లీ మేమే వస్తామన్న భ్రమ రేపుతుంటుంది. ప్రజల మనోభావాలేమిటన్నది ఆ కిక్కు తెలియనివ్వదు. మంచి చె ప్పిన వారిని దూరం పెట్టేలా చేస్తుంది. సద్వివిమర్శలను కూడా భరించే శక్తి ఉండదు. అన్నీ తనకు తెలుసన్న అహంకారం ప్రవేశిస్తుంది. ఆ అహంకారమే పతనానికి నాంది అవుతుంది.

ఏబీ వెంకటేశ్వరరావు అనే సీనియర్ ఐపిఎస్‌కు, ఐదేళ్లు పోస్టింగ్ ఇవ్వకుండా చేసిన జగన్ పైశాచిక ఆనందం, ఐదేళ్లు మిగిలిన అధికారులను ఆయనను ప్రశ్నించే అవకాశం లేకుండా చేసి ఉండవచ్చు. కానీ చప్రాసీలు కూడా ఈర్ష్యపడేలా ఊడిగం చేసి, ఇప్పుడు పోస్టింగులు లేని పరిస్థితి అనుభవిస్తుంది ఎవరు? ఏబీ అనే అధికారికి పోస్టింగ్ ఇవ్వమని కోర్టులు చెప్పినా, అమలుచే యకుండా కోట్లు ఖర్చు పెట్టి ఆయనను వేధించే శాడిజం వల్ల జగన్ సాధించేదేమిటి? వృధా అయిన అన్ని కోట్ల ప్రజాధనం ఎవడబ్బ సొమ్ము? కోర్టు దయాధర్మంతో బెయిల్‌పై బతుకున్న ఒక వ్యక్తి సీఎం అయితే.. వారిలోని క్రూరత్వం ఇంత అమానవీయంగా, ఇంత రాక్షసత్వంగా, హిట్లర్, ముస్సోలిని, బాబర్, ఔరంగజేబు, తుగ్లక్ అంశ ప్రవేశిస్తుందా? ఇదెవరి తప్పు? అలాంటి వారికి అవకాశం ఇచ్చిన రాజ్యాంగానిదా? ప్రజలదా?

మధ్యలో మిడిమిడి జ్ఞానపరులు, ‘కుల’వేల్పులు, భజనపరులు, పైరవీకారులు ప్రవేశిస్తారు. వారి సలహాలతో రాజకీయ ప్రత్యర్ధులపై దాడులు చేసి, ప్రత్యర్థి పార్టీని నిర్వీర్యం చేయాలనుకుంటారు. ఫలితంగా అహంకారి కాస్తా నియంతగా రూపాంతరం చెందుతారు. ఆ ఘర్షణలో జనం మేల్కొంటారు. సొంత పార్టీ వాళ్లు సైతం జారుకుంటారు. పరాజయం తర్వాత వెనక్కి తిరిగిచూస్తే ఎవరూ ఉండరు. ఉమ్మడి-విభజన తర్వాత చాలామంది సీఎంలను చూసిన వారు ఇప్పటివరకూ దర్శించిన అనుభవం ఇదే. అందుకు ఎవరూ మినహాయింపు కాదు.

‘అసలు ఈ ఐదేళ్లూ రాష్ట్రాన్ని పాలించింది జగన్ కాదు. ఈ పులివెందుల ముఠానే. భారతీరెడ్డి ఆదే శాల మేరకే పాలన సాగింద’న్న వైకాపేయుల మనోభావనను కొట్టిపారేయలేం. సజ్జల, ధనంజయరెడ్డి, అవినాష్ చుట్టూనే పాలన సాగిందన్నది వారి విమర్శలను త్రోసివేయలేం. ఆమేరకు ప్రజల పల్సు తెల్సిన గోనె ప్రకాష్‌రావు, తెలంగాణ నుంచి ఆంధ్రాకు వె ళ్లి మరీ చెప్పాల్సిన పనిలేదు. కడప జిల్లాలో ఏ చెట్టునడిగినా చెబుతుంది. పులివెందులలో ఏ పుట్టనడిగినా చెబుతుంది.

ఇప్పటికయినా మించిపోయింది లేదు. రాజకీయాల్లో గెలుపు-ఓటమి సహజం. జనం దయతలిస్తే, పడిన వారు మళ్లీ లేస్తుంటారు. ఇప్పటి చంద్రబాబు మాదిరిగా! జగన్‌కు ఇంకా బోలెడు వయసుంది. లేనిదల్లా.. వినే ఓపిక. ఎదుటివారిని గౌరవించే తత్వం. అన్నీ తనకు తెలుసుననే అహంకారం. తానొక దైవాంశసంభూతుడినన్న వెర్రి భ్రమనే! దానిని జమ్మిచెట్టు మీదకెక్కించి, ప్రజాస్వామ్యయుత నిర్ణయాలు తీసుకుంటే ఆయన భవిష్యత్తుకే మంచిది.

ప్రభుత్వంపై సద్విమర్శలు చేసి, జనం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడితే ప్రజలే చేరువవుతారు. కానీ కోటి ఆశలతో, తనపై కసితో గెలిపించిన కూటమికి కొద్దికాలం సమయం ఇవ్వాల్సిన బాధ్యత జగన్‌పై ఉంది. ఎందుకంటే తాను ధ్వంసం చేసిన వ్యవస్ధలను చక్కదిద్దడానికి, కొత్త పాలకుడికి సమయం ఇవ్వాలి కదా? అప్పటివరకూ తను బుద్ధిమంతుడిగా మారి, ఇల్లు చక్కదిద్దుకుంటే మేలు. ఎందుకంటే ఇప్పుడు జగన్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాదు. కేవలం ఒక ప్రతిపక్షపార్టీ నాయకుడు మాత్రమే. బోలెడు ఖాళీ ఉంటుంది కాబట్టి తనలోని శత్రువును బయటకు పంపిస్తే, భవిష్యత్తు ఆశాజన కంగానే కనిపిస్తుంది.

Leave a Reply