Suryaa.co.in

Features

అస్తమించిన అక్షర సూరీడు!

-‘ఈనాడు’ రామోజీ మహాభిష్క్రమణం
-అక్షర ప్రపంచాన్ని శాసించిన రారాజు
-తెలుగు జర్నలిజాన్ని కొత్తమార్గం పట్టించిన మీడియా మొఘల్
(అన్వేష్)

‘మీడియాతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయ్’.. రాజకీయవర్గాల్లో ఈ భావన – భయం జమిలిగా జనించేందుకు కారకులైన ఈనాడు అధినేత రామోజీరావు ఇక లేరు. శనివారం తెల్లవారుఝామున అక్షరాకాశంలో అంతర్ధానమయ్యారు. తెలుగునేల నలుచెరుగులా వెదజల్లిన అక్షరమొక్కలను శ్వాసిసూ, శాసిస్తూ ఇక సెలవంటూ వెళ్లిపోయారు.

అక్షర సామ్రాజ్యంలో సంపూర్ణ విజయాలను సాధించిన పెద్దాయన రామోజీ గురించి ఎంత చెప్పినా తక్కువ. పాతుకుపోయిన కాంగ్రెస్ సామ్రాజ్యాన్ని తెలుగుదేశం అనే ఆయుధంతో కూకటివేళ్లతో పెళ్లగించి, రాజకీయులకు పత్రిక సత్తా ఏమిటో రుచిచూపించిన రామోజీకి ఎంతమంది అభిమానులో, అంతమంది ప్రత్యర్ధులు. ఆయనపై ప్రశంసలెన్నో, విమర్శలన్ని! ప్రత్యర్ధులు సైతం మెచ్చుకునే సాహసి రామోజీ. తెలుగు గడ్డపై రామోజీ ఫిలిం సిటీ అనే సినీ సామ్రాజ్యం నెలకొల్పినా.. ఈటీవీతో న్యూస్ చానెల్ ఆరంభించినా.. మార్గదర్శి పేరుతో చిట్‌ఫండ్ ప్రారంభించినా.. చిన్న తారలకు వెలుగునిచ్చేందుకు, సినిమాలు తీసినా రామోజీ అడుగు-ఆలోచన భిన్నం.

రాజ్యసభ సీటు ఇచ్చేందుకు ఎంతోమంది ముందుకొచ్చినా, అక్షరాన్నే అంటిపెట్టుకున్న మీడియా మొఘల్ ఆయన. ఈనాడులో పనిచేయడమంటే జర్నలిస్టులకు అదో ప్రతిష్ఠ. ప్రజల పాశం తీసే ప్రభుత్వాలకు, ఆయన ఊపిరిపోసిన ‘ఈనాడు’ యమపాశమే. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను నిర్మొహమాటంగా చెర్నాకోల్‌తో వీపు వాతలుపడేలా చీల్చి చెండాటడం ఈనాడు బాధ్యత- ఇంకా చెప్పాలంటే సామాజికమాధ్యతగా మార్చారు.

రామోజీ స్వతహాగా జర్నలిస్టు కాదు. కానీ ఎంతోమందిని గర్వించదగ్గ జర్నలిస్టులుగా సానబట్టిన పాత్రికేయ యజమాని. ఆయన కాంపౌండ్‌లో పుట్టిన ఎన్నో మొక్కలు, పాత్రికేయ వనంలో మహావృక్షాలుగా ఎదిగాయి. పనిమంతులకు పట్టం కట్టే రామోజీ అమ్ములపొదిలో వినమ్రంగా ఒదిగిన పాత్రికేయ అర్జనులెందరో. వ్యక్తిగత ఆరాధన, వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించే ఆయన, చివరి వరకూ అదే సిద్ధాంతంతో బతికారు. ప్రజాస్వామ్యం కూలకుండా, తన ఈనాడుతో నిలబెట్టేందుకు అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆ పాత్రికేయ శిఖరం ఒరిగిపోవడం ప్రజాస్వామ్యపిపాసులకు వేదనే. నేడు అక్షరం గాయపడ్డరోజు. అక్షర శిఖరం నేలకూలిన రోజు. వేలాదిమంది అక్షరసైనికులు తమ ‘మార్గదర్శి’ని కోల్పోయిన రోజు. అక్షరం మోర ఎత్తి జీవించినంత కాలం రామోజీ చిరంజీవిగానే ఉంటారు. తెలుగు జర్నలిజం సత్తాను ఢిల్లీబాదుషాలకు చాటిన చెరుకూరి రామోజీ చిరస్మరణీయుడు.

LEAVE A RESPONSE