Home » పెళ్లి రోజు..రామోజీ హాజరైన వేళ..

పెళ్లి రోజు..రామోజీ హాజరైన వేళ..

(ఎం.వి.ఆర్.శాస్త్రి)

” ఏమిటి ఏమ్వీఆర్ ఈ వేళ వచ్చావ్ ” అన్నారు రామోజీరావు గారు ఒకింత ఆశ్చర్యంగా.

ఆదివారం సెలవు. సాధారణంగా ఆయనని డిస్టర్బ్ చేయము. అతిముఖ్యమైన పని ఉంటే తప్ప. అందునా ఇంటికి వెళ్లి.

” నా పెళ్లి కుదిరిందండి ” అన్నాను కొంచెం బిడియంగా.

“అవునా ! కంగ్రాట్స్ . వెరీ గుడ్. మంచి కబురు చెప్పావు. ఎప్పుడు పెళ్లి ? ”

“అది మాట్లాడటానికే ఇప్పుడు వచ్చానండి. వచ్చే నెల మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే దానికి తగ్గట్టు ముహూర్తం పెట్టిస్తా . మీరు రావటం నాకు అన్నిటికంటే ఇంపార్టెంటు ” అన్నాను.

“మీకు నచ్చిన ముహూర్తం ఏ రోజైనా సరే పెట్టించుకో . అది ఏ రోజైనా నాకు ఎన్నిపనులున్నా మానుకుని వస్తా ” అని హామీ ఇచ్చారు ‘చైర్మన్ గారు ‘.

హైదరాబాద్ లో చిక్కడపల్లి లోని కోనసీమ ద్రావిడ సంఘం హాల్ లో 1983 మార్చ్ 24 ఉదయం 9-30 కి నా పెళ్లి . దానికి వారం ముందే నన్ను పిలిచి 2500 రూపాయలు కాష్ గిఫ్ట్ ఇచ్చారు రామోజీరావు గారు. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. నాకు రెండు నెలల జీతం తో సమానం. హనీమూన్ ఖర్చంతా దానితోనే వెళ్ళిపోయింది.

పెళ్లి హాల్ చాలా చిన్నది. నిండా 150 కుర్చీలు పట్టవు. గెస్ట్ లు అందరికంటే ముందు 8- 45 కల్లా శ్రీమతి రమాదేవి గారితో కలిసి వచ్చారు రామోజీ రావు గారు. అప్పటికింకా కన్యాదానం తతంగం మొదలే కాలేదు. ఆ సందర్భంలో తీసిందే ఈ ఫోటో.

ఈనాడు లో నాకు చాలా ఆప్తులైన వారిలో ముఖ్యులు రాంభట్ల కృష్ణమూర్తి గారు. నేను 1978 ఫిబ్రవరి లో చేరేసరికి ఆయన ఎడిటర్ ( అడ్మినిస్ట్రేషన్ } గా ఉండేవారు. ఈనాడు లో చేరక ముందు నుంచే కమ్యూనిస్ట్ పార్టీ లో ఆయన నాకు చాల ఏళ్ళుగా తెలుసు. అరసం లో పాత కామ్రేడే . ఈనాడులో నేను చేరటం లో ఆయన ప్రమేయం లేదు. చేరబోతున్నట్టు కూడా ఆయనకు తెలియదు. కానీ చేరాక బాగా దగ్గరయ్యాం. నా పెళ్లి నాటికి ఆయన ఈనాడులో మానేసినట్టు గుర్తు.

నేను తప్పనిసరిగా ఇంటికి వెళ్లి ఆహ్వానించి పెళ్ళికి పిలవవలిసిన అతిముఖ్యులలో రాంభట్ల ఒకరు. కాని అప్పటి పని వొత్తిడిలో మరిచిపోయాను. ఆ సంగతి తీరా పెళ్లి రోజు గానీ గుర్తు రాలేదు.అయ్యో పెద్ద తప్పయిపోయింది . తెలిస్తే ఆయన ఏమనుకుంటారో అని బాగా ఫీల్ అయ్యాను. ఆ సంగతి పెళ్లి మంటపం లో నా సహచరులతో అంటూండగానే ప్లెజంట్ సర్ప్రైస్ !
రాంభట్లగారు వచ్చారు. ” ఏమి శాస్తుర్లూ ! నీ పెళ్ళికి నువ్వు పిలిచేదేమిటి ! ఇందాకే తెలిసింది ! వెంటనే వచ్చేశాను ” అన్నారు నిండు మనసుతో నన్ను నోరైనా ఎత్తనివ్వకుండా ! ”

దటీజ్ రాంభట్ల ! రియల్లీ ఎ గ్రేట్ మాన్ ! ఆయన వచ్చిన ఆనందంలో తీసుకున్నది ఈ కింది ఫోటో

అప్పట్లో సిగరెట్లు బాగా కాల్చేవాడిని. అలవాటు ప్రకారం అప్పుడూ చేతిలో సిగరెట్ ఉంది. మా పక్కన ఉన్నవారిలో అప్పటి న్యూస్ టుడే డైరెక్టర్ ఎస్.ఆర్.రామానుజన్ గారు, సీనియర్ ఎక్జిక్యూటివ్ డి.పి.వర్మ, సబ్ ఎడిటర్ పళ్ళంరాజు , బందా గాంధీ, నా బాల్యమిత్రుడు పి.వి.
ఎం.ఎల్. నరసింహా రావు ఉన్నారు. అప్పటికి నేను ఈనాడు లో చీఫ్ సబ్ ఎడిటర్ ని .

ఆ నాటి పెళ్ళి ఫోటో ఇది :

Leave a Reply