Suryaa.co.in

Editorial

కేజ్రీవాల్ జైల్లో – గాలి బిజెపిలో…

– బిజెపిలో చేరగానే అక్రమార్కులు శుద్దులైపోతారా?
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ

లిక్కర్ స్కాం పేరుతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను జైలుకు పంపిన బిజెపి ప్రభుత్వం, భారీ మైనింగ్ అక్రమాలకు పాల్పడి, జైలుకెళ్లి, ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటున్న గాలి జనార్దనరెడ్డిని మాత్రం బిజెపిలో చేర్చుకుంటున్నదని; ఇవేనా బిజెపి చెప్తున్న నీతి రాజకీయాలు? ఎంతటి అవినీతి, అక్రమాలకు పాల్పడినప్పటికీ బీజేపీలో చేరగానే అక్రమార్కులంతా శుద్దులైపోతారా? అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు.

బిజెపి నీతిమాలిన, శుద్ద రాజకీయాలు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. రూ.100 కోట్ల లిక్కర్ స్కామ్ పేరుతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను బిజెపి ప్రభుత్వం జైలుకు పంపేందుకు సిద్ధమైంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను మోడీ సర్కార్ గత ఏడాదికాలంగా కక్షపూరితంగా జైల్లోనే ఉంచింది.

కానీ వేలకోట్ల రూపాయల మైనింగ్ కుంభకోణానికి పాల్పడి, జైలుకెళ్లి, బళ్లారి జిల్లా నుండి వెలివేయబడ్డ గాలి జనార్దన్ రెడ్డిని బిజెపిలో చేర్చుకున్నది. మరోపక్క ఏపీలో మద్యం అమ్మకాలలో వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ సాక్షాత్తు ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురంధరేశ్వరి కేంద్ర హోం మంత్రికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం శూన్యం. జగన్మోహన్ రెడ్డి బిజెపి చేస్తున్న దుష్ట నిర్ణయాలకు వంతపాడతారు కాబట్టే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

దీనిని బట్టి బిజెపి కక్షపూరిత రాజకీయాలు ప్రజలందరికీ అర్థమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు, వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వం తమకు అనుకూలురైనవారు ఎన్ని అక్రమాలు చేసినప్పటికీ అక్కున చేర్చుకుంటున్నది. కేసుల మాఫీకి ప్రయత్నిస్తున్నది. ఇది బిజెపి అవకాశవాద, నీచ, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు నిదర్శనం. ప్రజాతంత్ర వాదులంతా బిజెపి చేస్తున్న నీతిమాలిన రాజకీయాలను, కక్షపూరిత విధానాలను తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాం.

LEAVE A RESPONSE