Suryaa.co.in

Editorial

ఏపీలో కాంగ్రెస్ టార్గెట్ 20?

– ఐదు స్థానాలపై సీరియస్ దృష్టి
– ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలే టార్గెట్
– అసెంబ్లీలో కాలుపెట్టాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం
– రేవంత్, భట్టి, కోమటిరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, వీహెచ్, జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్ ప్రచారం?
– 5 నుంచి 10 శాతం ఓట్ల సాధనపై కన్ను
– వైసీపీ ఓటు బ్యాంకు కొల్లగొట్టడమే లక్ష్యం
– ఇప్పటికే జనక్షేత్రంలోకి దూసుకుపోతున్న షర్మిలారెడ్డి
– షర్మిల రచ్చబండకు అనూహ్య స్పందన
– దళిత-మైనారిటీల ఓట్లలో చీలిక
– దానితో లబ్ధిపొందనున్న కాంగ్రెస్
– అసెంబ్లీ సీట్లపై కెవిపి వ్యూహం
( మార్తి సుబ్రహ్మణ్యం)

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభలో కాలుమోపేందుకు కాంగ్రెస్ శక్తియుక్తులు ధారపోస్తోంది. 20 సీట్ల లక్ష్యంతో.. కనీసం 5 సీట్లు ఖచ్చితంగా గెలవాలన్న పట్టుదలతో, ప్రయత్నాలు తీవ్రతరం చేస్తోంది. ఆ మేరకు ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి ఇప్పటికే అవిశ్రాంతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దళిత-మైనారిటీ వర్గాల్లో ఆమెకు వస్తున్న అనూహ్య స్పందన కాంగ్రెస్ ఆశలకు జీవం పోసేలా కనిపిస్తోంది.

విభజన తర్వాత ఏపీలో.. నామరూపాల్లేకుండా పోయిన కాంగ్రెస్ నోట్లో ఉన్న తులసితీర్ధం స్థానంలో, సంజీవనిని తీసుకువచ్చే ప్రయత్నాలు తీవ్రతరమవుతున్నాయి. దానిని ఏపీసీసీ చీఫ్, వైఎస్ బిడ్డ షర్మిలారెడ్డి ఒక సవాలుగా తీసుకున్నారు. వైసీపీకి వెళ్లిపోయిన దళిత-మైనారిటీ ఓటు బ్యాంకును తిరిగి తెచ్చుకోవడమే లక్ష్యంగా షర్మిలా రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఆమె పార్టీ పగ్గాలందుకున్న తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చింది.

రాష్ట్ర రాజకీయ పరిస్థితుల మేరకు.. ఇప్పటిదాకా స్తబ్దతగా ఉన్న కాంగ్రెస్ నేతలు, షర్మిల రాకతో మళ్లీ రోడ్డెక్కుతున్న వాతావరణం కనిపిస్తోంది. గత పదేళ్లలో మీడియాలో ఎక్కడా చోటు లేని కాంగ్రెస్‌కు.. షర్మిల రాకతో ఆ లోటు కూడా భర్తీ అవుతుండటం, పార్టీ నాయకత్వానికి సంతృప్తినిస్తోంది. ఇది ఆ పార్టీకి సానుకూల అంశమే. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలపై సీరియస్‌గా దృష్టి సారించడం.. తన సొంత కడప జిల్లాలో మళ్లీ కాంగ్రెస్‌ను బతికించడం.. వైసీపీలోని అసంతృప్తి నేతలు-టికెట్ దక్కని వారిని చేరదీయడం వంటి బహుముఖ లక్ష్యాలతో, కాంగ్రెస్ చీఫ్ షర్మిలారెడ్డి ఒంటరిపోరాటం సాగిస్తున్నారు. ఇప్పుడు ఆమె వెంట సీనియర్లంతా కలసి నడుస్తున్నారు.

ఆ ప్రకారంగా… రాష్ట్రంలో మొత్తం 20 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందులో కనీసం 5 సీట్లు ఖచ్చితంగా గెలిచేలా సీరియస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలోని 36 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు, 8 ముస్లిం ప్రభావిత నియోజకవర్గాలపై కార్యాచరణ ప్రారంభించింది.

ఆ మేరకు 5 నుంచి 10 శాతం ఓట్లు సాధించాలన్న లక్ష్యంతో కార్యాచరణ రూపొందించింది. రాజ్యసభ మాజీ సభ్యుడు కెవిపి రామచంద్రరావు సారథ్యంలో అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికకు శ్రీకారం చుట్టారు. ఏపీ భౌగోళిక-రాజకీయ పరిస్థితులు-నియోజకవర్గాలపై సంపూర్ణ అవగాహన ఉన్న కెవిపి అనుభవం, కాంగ్రెస్‌కు ఉపయోగపడనుంది.

ఇక రాజకీయాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే, సోషల్‌మీడియా రంగంలో కాంగ్రెస్ అత్యంత బలహీనంగా ఉంది. ఆ లోటు భర్తీ చేయాల్సి ఉందని పలువురు సీనియర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ-టీడీపీ సోషల్‌మీడియా రంగంలో పోటాపోటీగా ఉన్నాయి. అధికారం ఉండటం, సోషల్‌మీడియా సైనికులకు నిధులివ్వడం ద్వారా వైసీపీ, ప్రతిపక్షాలపై ప్రచారదాడులు ఎక్కువగా నిర్వహిస్తోంది. మార్ఫింగ్ ఫొటోలు, జడ్జిలపై వ్యాఖ్యల వంటి చర్యలతో ఇప్పటికే వైసీపీ సోషల్‌మీడియా కలకలం సృష్టిస్తోంది. చివరకు జగన్ సోదరి షర్మిలను కూడా విడిచిపెట్టకుండా, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది.

దానితో దివంగత వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత వారిపై హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. పార్టీ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా, వాటి స్థాయిలో కాకపోయినా.. కనీసం పార్టీని జనంలోకి తీసుకువెళ్లేంత స్థాయిలోనయినా, సోషల్‌మీడియాను బలోపేతం చేయాలన్నది సీనియర్ల అభిప్రాయం.

రాష్ట్రంలో కాంగ్రెస్ పునరుద్ధానం కోసం వ్యూహరచన ప్రారంభించిన కేంద్ర నాయకత్వం.. తెలంగాణ కాంగ్రెస్ ప్రముఖులను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఏపీలో కూడా విపరీతమైన ఇమేజ్ ఉన్న సీఎం రేవంత్‌రెడ్డిని రంగంలోకి దింపితే, దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నాయకత్వం భావిస్తోంది.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, వి.హన్మంతరావు, అద్దంకి దయాకర్ వంటి జనాదరణ ఉన్న నేతలను.. ప్రచార రంగంలో దింపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక రాయలసీమలో కర్నాటక మంత్రులను రంగంలోకి దించాలని భావిస్తోంది.

LEAVE A RESPONSE