పదవి కోసం నేతల పూజలు..హోమాలు

– గుళ్లూ, గోపురాల చుట్టూ మహిళా ఎమ్మెల్యేలు
– విశాఖ స్వామి చుట్టూ మరికొందరి ప్రదక్షణలు
– ‘గాలి’ మద్దతుకోసం సీమ ప్రముఖులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

మాజీలుగా మారిన వారితోపాటు, తాజా మంత్రివర్గ జాబితాలో చేరాలనుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలకు ఈ రెండు రోజులు కంటిమీద కునుకు కరవయిందట. 11వ తేదీన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఒకవైపు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా, మరోవైపు ఆ వేదికపై తామూ ఉండేందుకు పలువురు ఎమ్మెల్యేలు తమ ముందున్న అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నారు.

అందులో భాగంగా ఆంధ్రా-తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు, ఆశ్రమాల చుట్టూ తిరుగుతుంటే, మరికొందరు తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు, ప్రముఖ ఆలయాల్లో పనిచేసే పండితులను పిలిపించుకుని హోమాలు చేస్తున్నారు. ఇంకొందరు చెన్నై-కేరళ-హైదరాబాద్, రాజమండ్రి నుంచి జ్యోతిష పండితులను పిలిపించుకుని తమ భవిష్యత్తుపై ఆరా తీస్తున్నారట. మరికొందరు గత వారం క్రితమే వాస్తు పండితుల సూచన మేరకు తమ ఇళ్లలో మార్పులు చేసుకున్నారట. మంత్రివర్గంలో చేరాలనుకునే వారంతా ఇలా తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నారట.

నగరి ఎమ్మెల్యే రోజా ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని అన్ని
roja ప్రముఖ దేవాలయాల్లో పూజలు చేయిస్తున్నారు. ఆమలె ఇటీవల యాదాద్రిని కూడా సందర్శించారు. మాజీగా మారిన కొడాలి నాని, బాలినేని నేరుగా హైదరాబాద్‌కే వచ్చి
cab2-1 రిలాక్సవుతుంటే, మళ్లీ మంత్రి పదవి ఖాయమనుకుంటున్న ఆదిమూలం సురేష్ బెంగళూరుకు వెళ్లిపోయారట. మరికొందరు సీఎం జగన్ బంధువర్గంతో టచ్‌లో ఉంటే, ఇంకొందరు బెంగుళూరులో ఉన్న ఆయనకు తెలిసిన పారిశ్రామికవేత్తల వద్దకు వెళుతున్నారు. మిగిలిన వారంతా నియోజకవర్గాలకు పరిమితమయ్యారు.

ఇక ఆధ్మాత్మిక మార్గం ద్వారా పదవి పట్టేందుకు, లౌక్యం తెలిసిన మరికొందరు ఎమ్మెల్యేలు విశాఖ పట్నం వెళుతున్నారు. జగన్‌కు రాజగురువైన ఆ స్వామి ఓ మాట చెబితే తమకు మంత్రి పదవి వస్తుందని కొత్తవారు.. ఆయన ఓ మాట చెబితే తమ పదవి నిలుస్తుందని సిట్టింగులూ, ఎవరికివారు విశాఖపట్నం స్వామి వారి సేవలో ఉన్నారట. వీరిలో చాలామంది చాలాకాలం నుంచి ఆయనకు శిష్యులుగా ఉన్నవారే ఎక్కువ.

రాయలసీమకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు గత రెండురోజుల నుంచి బెంగళూరులో మకాం వేసినట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన గాలి జనార్దన్‌రెడ్డితో, మంత్రి పదవి సిఫార్సు చేయించుకునేందుకు వారంతా బెంగళూరుకు క్యూ కట్టారట. ఇప్పటికే కర్నూలు జిల్లాకు చెందిన ఓ మంత్రికి, గాలి ఆశీస్సులతోనే టికెట్‌తోపాటు మంత్రి పదవి కూడా వచ్చింది. దానితో గాలి కోటాలో కొత్త క్యాబినెట్‌లోనూ అతని పేరు ఖాయమన్న ప్రచారం జరిగింది. ఈలోగా టీడీపీ సదరు మంత్రి అవినీతి చిట్టా విప్పటంతో.. ‘ఎందుకయినా మంచిద’న్న ముందుచూపుతో ఆయన కూడా గాలిని ఆశ్రయించారట.

చెన్నై, హైదరాబాద్, కేరళ, రాజమండ్రి పండితులకు యమా గిరాకీ
మంత్రి పదవులను ఆశించిన ఎమ్మెల్యేలు చెన్నై, కేరళ, హైదరాబాద్, రాజమండ్రిలోని జ్యోతిష పండితుల వద్దకు క్యూలు కడుతున్నారు. వీరిలో కొందరు పండితుల సలహా మేరకు హోమాలు చేయిస్తుండగా, ఈ రెండురోజులు గోశాలలో నిద్రించాలని కొందరు ఎమ్మెల్యేలకు పండితులు సూచించారట. ఇక మూడు రోజుల నుంచి మంత్రి పదవులు ఆశించిన పలువురు ఎమ్మెల్యేలు శనిపూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply