Home » సీబీఐ…నత్తలూ నవ్వుతున్నాయ్!

సీబీఐ…నత్తలూ నవ్వుతున్నాయ్!

– అవినాష్ అరెస్టుపై సుప్రీంకోర్టు ఓకే
– మరి ఇంకా అభ్యంతరాలెందుకు?
– అడ్డుపడుతున్న ఆ శక్తులెవరు?
– సామాన్యుడి విషయంలోనూ సీబీఐది ఇదే వైఖరా?
– తీరిక లేదు తీరిగ్గా వస్తానంటే ఊరుకుంటుందా?
– ఎంపి రఘురామరాజును అర్ధరాత్రి అరెస్టు చేసిన సీఐడి
– ఆ పాటి సత్తా కూడా సీబీఐకి లేదా?
– ఇలాగైతే ఇండియాలోనే ఉండేవాడినంటూ విజయ్‌మాల్యా పేరుతో సెటైర్లు
– సీబీఐతో అవినాష్ ఆడుకుంటున్నారన్న వ్యాఖ్యలు
– సోషల్‌మీడియాలో సీబీఐపై పేలుతున్న వ్యంగ్యాస్త్రాలు
– ప్రముఖులనే అరెస్టు చేసిన సీబీఐకి ఇదో నగుబాటు
– సర్జికల్‌స్ట్రైక్స్ చేసిన కేంద్రానికి ఒక ఎంపీని అరెస్టు చేసే దమ్ము లేదా?
– సీఆర్పీఎఫ్‌ను ఎందుకు వాడుకోవడం లేదు?
– మోదీ సర్కారుకు ఇదో అప్రతిష్ఠ
– బీజేపీనే కాపాడుతోందన్న బద్నామ్
– అవినాష్ అరెస్టు ఆలస్యంపై బీజేపీకి అప్రతిష్ఠ
– సోషల్‌మీడియాలో అవినాష్-సీబీఐ తీరుపై చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

పక్క దేశంపై అర్ధరాత్రి చడీ చప్పుడూ లేకుండా సర్జికల్ స్ట్రైక్స్ చేసిన మోదీ సర్కారు ఒక ఎంపీని అరెస్టు చేసేందుకు భయపడుతోందా?
అయ్యా ఎంపీ గారూ.. దయచేసి సీబీఐపై కాస్త కరుణచూపి అరెస్టుకు సహకరించండి. లేకపోతే మోదీ ఇమేజ్ డామేజ్ అయ్యేట్టుంది
మన్మోహన్‌సింగ్ సర్కారు హయాంలో పెద్ద తలకాయలనే అరెస్టు చేసిన సీబీఐ, ఇప్పుడు కర్నూలు కొండారెడ్డి బురుజు దాటాలంటే భయపడటం ఏం బాగోలేదు.
అవినాష్ అరెస్టుకు కేంద్ర బలగాలు రావు. కేంద్రమే వారి బలగం.
సీబీఐ అంటే కమ్ బ్యాక్ ఇమ్మీడియెట్లీ.
సీఎం గారికి నమస్కారం. అవినాష్ ప్రక్రియ అరెస్టయ్యేవరకూ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ రెండు బకెట్ల పాప్‌కార్న్, రెండు లీటర్ల కూల్‌డ్రింక్స్ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని మనవి.సీబీఐలో పనిచేసే ఓ అటెండర్ కోటి రూపాయలతో కొత్త అపార్ట్‌మెంట్ కొన్నాడు. ఇది తెలిసిన ఐటీ శాఖ ఆ ఇంటిపై దాడి చేసింది. ఇంత డబ్బెక్కడిదని నిలదీసింది. అందుకా అటెండర్.. అయ్యా అవినాష్‌రెడ్డి సీబీఐకి రాసిన లేఖలు పాతపేపర్ల వాడికి అమ్మితే ఈ డబ్బు వచ్చిందని చెబితే, ఐడి అధికారులు సంతృప్తి చెంది వెళ్లిపోయారు.
నేను అనవసరంగా దేశం విడిచి వెళ్లిపోయా. పులివెందుల వైసీపీ వాళ్లకు బిర్యానీ, క్వార్టర్ మందు, పదివేలు ఇచ్చి కాపలా పెట్టుకుంటే సరిపోయేది. ( విజయ్‌మాల్యా స్వగతం)దైవం మంత్రాధీనం. మంత్రం బ్రాహ్మణాధీనం. సీబీఐ కేంద్రాధీనం. కేంద్రం జగనన్నాధీనం.
అవినాష్‌రెడ్డిగారూ.. పిచ్చిచూపులు చూస్తున్న సీబీఐ మీద కాస్త కరుణించండి. సర్జికల్ స్ట్రైక్స్‌తో ప్రపంచానికే హీరోగా నిలబడిన మోదీ గారి చేతిలో సీబీఐ ఉందన్న చెడ్డపేరు తీసుకురాకండి. ప్లీజ్ లొంగిపోండి!

ఇవన్నీ.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అనుమానితుడిగా ఉన్న, కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుపై, సీబీఐ ఆడుతున్న దోబూచులాటను వెక్కిరిస్తూ.. సోషల్‌మీడియాపై వెల్లువెత్తుతున్న విమర్శనాస్త్రాలు. ప్రధానంగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు-అమరావతి పరిరక్షణ సమతి కన్వీనర్, డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు సంధిస్తున్న వ్యంగ్యాస్త్రాలు.

ఇవి ఇప్పుడు సోషల్‌మీడియాలో లక్ష్మీటపాసుల్లా పేలుతున్నాయ్! ఈ పరిణామాలు కలసి వెరసి.. ప్రధాని మోదీ-బీజేపీ ఇమేజీకి, డామేజీగా మారుతున్నాయన్నది రాజకీయ పరిశీలకుల వ్యాఖ్య. ఇలాంటి వెసులుబాటు-సౌకర్యం సాధారణ పౌరుడికీ సీబీఐ ఇస్తుందా అన్న చూపుడువేలు ప్రశ్నలతో, బీజేపీ ప్రతిష్ఠ మసకబారుతోంది. కేంద్ర సహకారం లేకపోతే, ఎంపి ఇంత స్వేచ్ఛగా తిరగగలడా అన్న నెటిజన్ల ప్రశ్నలకు జవాబులేక, బీజేపీ నేలచూపులు చూడాల్సిన దుస్థితి.

ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టు వ్యవహారం, ఇప్పుడు బీజేపీకి చిక్కులు తెచ్చి పెడుతోంది. జయలలిత,శిబుసోరేన్, జగన్, గాలి జనార్దన్‌రెడ్డి వంటి పెద్దతలలనే అలవోకగా అరెస్టు చేసిన సీబీఐ.. ఒక సాధారణ ఎంపీని అరెస్టు చేసేందుకు, ఒక ఎస్పీని బతిమిలాడుకోవలసిన దుర్గతి పట్టిందన్న విమర్శ ఎదుర్కొంటోంది. మరి ఇలాంటి నిర్వాకంతో సీబీఐ ప్రతిష్ఠ పెరుగుతుందా? తగ్గుతుందా అన్నది ప్రశ్న.

కేంద్రంలోని బీజేపీ సర్కారు సహకారం లేకపోతే, ఎంపీ ఇంత స్వేచ్ఛగా తిరిగే సౌకర్యం ఉంటుందా అన్న ప్రశ్నలతో, బీజేపీ ప్రతిష్ఠ మసకబారుతోంది. బహుశా.. ఎటూ తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి బలం లేదు కాబట్టి, కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదన్న ధైర్యం కూడా కేంద్ర బీజేపీ బేఫర్వాకు కారణం కావచ్చన్నది, రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. నిజం ‘నరేంద్రుడి’కెరుక?!

ఇంతకూ అవినాష్‌రెడ్డి అరెస్టుపై కోర్టు ఏం చెప్పింది? ఆయన అరెస్టును ఆపమని మేం సీబీఐకి ఆదేశాలివ్వలేమని చెప్పింది. మీ పని మీరు చేసుకోమని చెప్పింది. అయినా రెడ్డి గారు కోర్టుల్లో అరెస్టు మినహాయింపు పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. ఇంత తతంగం జరుగుతున్నా సీబీఐ బెల్లంకొట్టిన రాయిలా ఎందుకు బిగుసుకుపోతోంది? ఆయన అరెస్టుకు ఉన్న ప్రతిబంధకాలేమిటి? అరెస్టు కాకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? ఏ అదృశ్య శక్తి ఆయన అరెస్టును అడ్డుకుంటోంది? అవినాష్ అరెస్టుపై అసలు సీబీఐకి ఉన్న మొహమాటాలేమిటి?

ఒకవేళ కర్నూలులో అరెస్టు చేస్తే పోలీసులు సెలవిచ్చినట్లు.. లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిందనుకుందాం. ఆంధ్రా పోలీసులు సహకరించడం లేదనుకుందాం. కేంద్ర బలగాల సాయంతో కాగల కార్యం తీర్చవచ్చు కదా? సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్ దళాలు ఉన్నదే అందుకు కదా? మరి సీబీఐ ఆ పని ఎందుకు చేయడం లేదు?

ఆంధ్రా సీఐడీ పోలీసులు ఎంపి రఘురామకృష్ణంరాజును పక్క రాష్ట్రంలోని ఆయన ఇంటికి వెళ్లి మరీ చెరపట్టారు కదా? డజన్ల మందిని అదే స్కీములో అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు కదా? మరి సీఐడీ పాటి తెగువ, పేరు గొప్ప సీబీఐ ఎందుకు చూపడం లేదు? పోనీ.. అర్ధరాత్రి, తెల్లవారు ఝామున ఇళ్లకెళ్లి, గేట్లు దూకి మరీ అరెస్టులు చేసే సీఐడీ అధికారులను పిలిచి.. ఆ చిట్కా ఏదో కనుక్కొని, అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయవచ్చు కదా అన్నది.. సోషల్‌మీడియాలో సీబీఐకి నెటిజన్లు సంధిస్తున్న వ్యంగ్యాస్త్రాలు.

సీఐడీ బాధిత ఎంపీ రఘురామకృష్ణంరాజు- అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికిపూడి.. ఈ కేసును సీబీఐ విచారిస్తున్నట్లు లేదు. నిందితుడే సీబీఐని విచారిస్తున్నట్లుందంటూ చేసిన వ్యాఖ్యలు, సీబీఐ ప్రతిష్ఠకూ మంచిదికాదు. రేపు ఏ సుబ్బారావో, పుల్లారావునో సీబీఐ అరెస్టు చేయడానికి వెళితే.. ‘‘నాకు ఇప్పుడు ఖాళీ లేదు. నాలుగురోజుల తర్వాత రండి. మా ఇంట్లో ఇవ్వాళే వడియాలు, ఆవకాయ పెట్టాం. అవి ఎండిపోవడానికి వారం పడుతుంది. కాబట్టి ఓ ఆరునెలల తర్వాత రండి’’ అంటే, సీబీఐ సదరు శాల్తీలపై కూడా ఇదే విశాల హృదయం ప్రదర్శిస్తుందా? లేదా పెడరెక్కలు విరిచి కారులో పడేసి తీసుకువెళ్తుందా? అన్న సామాన్యుడి ప్రశ్నలు, సీబీఐ విశ్వసనీయతను ప్రశ్నించేవే. కాదంటారా?

ఒక కేసులో నిందితుడిగా వ్యక్తి కర్నూలు ఆసుపత్రిలో ఉంటే, సీబీఐ అధికారులు అతగాడిని అరెస్టు చేయడానికి వెళ్లారనుకుందాం. సదరు నిందితుడు గారు వంద లారీలు బుక్ చేసి.. పక్క జిల్లా నుంచి మంచి దిట్టమైన వస్తాదులను దించి, సీమ సినిమాల్లో మాదిరిగా.. కత్తులూ కటార్లూ తిప్పుతూ వచ్చి, సీబీఐని సవాల్ చేశారనుకోండి. తమను వెన్నాడుతున్న మీడియా ప్రతినిధులను రక్తాలొచ్చేలా కొట్టారనుకోండి. ఆ వచ్చిన వస్తాదులంతా, ఆసుపత్రి ఆవరణలో ఎంచక్కా వేసిన టార్పారిన్లపై కూర్చుని, సీబీఐకి వ్యతిరేక ంగా ధర్నా చేశారనుకోండి. అప్పుడు సీబీఐ మనకెందుకు వచ్చిన తలనొప్పి అని వదిలేస్తుందా? లేక సీఆర్పీఎఫ్‌కు ఫోన్ చేసి, నాలుగైదు బెటాలియన్ల ఫోర్సును దించి వచ్చిన పని కానిస్తుందా? అన్నది బుద్ధిజీవుల ప్రశ్న.

అవినాష్‌రెడ్డి అరెస్టు యవ్వారంలో సీబీఐది తొలి నుంచీ.. మూడడుగులు ముందుకు, ముప్ఫై అడుగులు వెనక్కి అన్న చందమే. ఉన్నట్లుండి హడావిడి. కొద్దిరోజుల తర్వాత అర్జెంటుగా ఏదో గుర్తుకొచ్చినట్లు మళ్లీ వెనక్కి. మళ్లీ విచారణ హడావిడి. పెద్ద పెద్ద కేసులే నెలల్లో విచారణ పూర్తి చేస్తున్న సీబీఐ.. ఒక మాజీ ఎంపీ హత్య కేసును, నాలుగున్నరేళ్లు విచారిస్తున్న తీరును చూసి నత్తలూ నవ్వుకుంటున్నట్లు, రాజకీయ విశ్లేషకులు సంధించే వ్యంగ్యాస్త్రం.

సీబీఐ విచారణకు-కేంద్రానికి ఏ సంబంధం? మా పార్టీ ఎవరినీ కాపాడదు అన్నది పువ్వుపార్టీ అగ్రనేతల విచిత్ర వాదన. కేంద్రానికి-కోర్టులకు; కేంద్రానికి-విచారణ సంస్థలకు ఏం సంబంధం? అని ప్రశ్నించే కమలదళాల మాటలు వినడానికి, పాత్రికేయులు రాసుకోవడానికయితే బాగానే ఉంటాయి. కానీ జనాలను కూడా వెర్రి పుష్పాలుగా జమకడితే ఎలా? శివుడాజ్ఞ లేనిదే చీమయినా కుట్టనట్లు.. కేంద్రంలోని పెద్దతలల అనుమతి లేనిదే, విచారణ సంస్థలు అడుగు ముందుకు వేయవన్న సంగతి సామాన్యులకూ తెలుసన్న విషయం.. పువ్వుపార్టీ పెద్ద తలలకు తెలియకపోతే ఎలా? అన్నది బుద్ధి జీవుల ప్రశ్న.

Leave a Reply