పాతబిల్లులిస్తేనే కొత్త పనులు చేస్తాం

పాతబిల్లులిస్తేనే కొత్త పనులు చేస్తాం

– ‘తూర్పు’లో నడి‘రోడ్డు’న నిలిచిపోయిన టెండర్లు
– 616 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం
– కాంట్రాక్టర్ల సహాయ నిరాకరణ
– ఐదుసార్లు టెండర్లు పిలిచినా నో రెస్పాన్స్
– పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త రోడ్లకు మోక్షం
– 200 కోట్ల పాత బకాయిలపై చేతులెత్తేసిన సర్కార్
– మళ్లీ కొత్తగా 198 కోట్ల కొత్త పనులకు టెండర్
( మార్తి సుబ్రహ్మణ్యం)
తూర్పు గోదావరి జిల్లాలో కాంట్రాక్టర్లు కొత్త పనులు చేసేది లేదని ఖరాఖండిగా చెబుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్, మంత్రులకు ఎన్నిసార్లు వినతిపత్రాలిచ్చినా ఫలితం కనిపించకపోవడంతో.. జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లంతా ఏకతాటిపైకి వచ్చి, సహాయ నిరాకరణ ప్రకటించారు. దానితో జిల్లాలో కొత్తగా రోడ్డు పనులు చేసే అవకాశం కనిపించడం లేదు. దీనితో గత రెండున్నరేళ్ల నుంచి జిల్లాలో ధ్వంసమైన రోడ్ల స్థానంలో, కొత్త రోడ్లు వేసే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. ఆర్ అండ్‌బీ అధికారులేమో, ప్రభుత్వం నుంచి డబ్బులొచ్చేదాకా తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేయాల్సిన 200 కోట్ల రూపాయల పాత బకాయిలపైనే అందరి దృష్టీ నిలిచింది.
తూర్పు గోదావరి జిల్లాలో రోడ్లు భయంకరంగా మారాయి. రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవలే జనసేన కార్యకర్తలు గోతులు పడిన రోడ్ల వద్దకు వెళ్లి, ఫొటోల ఉద్యమం నిర్వహించడంతో,pavanప్రభుత్వం పరువు రోడ్డెక్కినట్టయింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా ధ్వంసమైన రోడ్లను మళ్లీ నిర్మించాలంటూ, ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. దీనిైపై జిల్లా మంత్రులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న్పటికీ, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసేంతవరకూ తామేమీ చేయలేమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలెవరూ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి… జిల్లాలో రోడ్ల దుస్థితి గురించి చర్చించి.. నిధులు విడుదల చేయించే స్థాయి లేకపోవడంతో, ఎక్కడి రోడ్లు అక్కడే గుంతలు పడి ఉన్నాయి. పైగా భారీ వర్షాలు కురుస్తుండటంతో మరికొన్ని రోడ్లు కొట్టుకుపోతున్న దుస్థితి నెలకొంది. డీఆర్‌సీ సమావేశాల్లో సైతం ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీసినా, నిధుల సమస్య ఉందని చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్ల దుస్థితిపై మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఇబ్బందిగా పరిణమించింది. జిల్లాలో మొత్తం 616 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయినట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు గుర్తించారు.వాటిలో సాధారణ స్థాయి నుంచి, భారీ స్థాయిలో గోతులు పడిన రోడ్లు కూడా ఉన్నాయి. వాటికి మరమ్మతులు చేయాలంటే 198 కోట్లు అవసరం అని అంచనా వేసి, ఆ మేరకు తాజాగా టెండర్లు పిలిచారు. 159 కిలోమీటర్లకు 79 కోట్లు, 457 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులకు 119 కోట్లు అంచనా వేసి, ఆ మేరకు ఐదుసార్లు టెండర్లు పిలిచారు.
ఈ నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ శాఖ గుంతలు, గోతులు, పూర్తిగా ధ్వంసమైన రోడ్లను మరమ్మతు చేయించేందుకు సీరియస్‌గానే రంగంలోకి దిగింది. కానీ తొలిసారి పిలిచిన టెండర్లకు కాంట్రాక్టరెవరూ స్పందించలేదు. ఆవిధంగా 5 సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో, అధికారులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. చివరికి ఆర్‌అండ్‌బీ జిల్లా ఉన్నతాధికారులు కాంట్రాక్టర్లును వ్యక్తిగతంగా పిలిపించి, రోడ్డు పనులు చేయాలని ఒత్తిడి చేశారు.
uppada-beachజిల్లాలో కాంట్రాక్టర్లందరికీ సుమారు 200 కోట్లు బకాయిలు ఇవ్వాల్సి ఉందని, అవి ఇచ్చేవరకూ కొత్త పనులు చేసేదిలేదని కాంట్రాక్టర్లు ఖరాఖండీగా చెప్పారు. అయితే తాము నిధులు తీసుకువస్తామని, ఈలోగా మీరు పనులు ప్రారంభించాలని ఎంత బ్రతిమిలాడుకున్నా ఫలితం కనిపించలేదు. ఇప్పటివరకూ మీమీద గౌరవం, మొహమాటంతోనే అప్పులు చేసి మరీ పనులు చేశామని, ఇకపై డబ్బులు చెల్లిస్తేనే పనులు చేస్తామని నిర్మొహమాటంగా చెప్పడంతో అధికారుల పరిస్థితి అడకతె్తరలో పోక చెక్కలా మారింది. రోడ్డు మెటీరియల్, కూలీలకు డబ్బులు మీరు చెల్లించుకుంటే, పనులు చేస్తామని మరికొందరు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అయితే అధికారుల వద్ద వాటికీ నిధులు లేకపోవడంతో ఆ ప్రతిపాదనకు సైనం మౌనం వహిస్తున్నట్లు సమాచారం.
అటు రోడ్లపై విమర్శలు వస్తుంటే ఎందుకు మరమ్మతులు చేయించడం లేదని తమ శాఖ ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ప్రశ్నలు, మరోవైపు బకాయిలిస్తే గానీ పనులు చేసేది లేదని భీష్మించుకుంటున్న కాంట్రాక్టర్లు. మధ్యలో ఎమ్మెల్యేల నుంచి కాంట్రాక్టర్లకు బిల్లుల సంగతి చూడాలని, ఫోన్లలో వస్తున్న ఒత్తిళ్లతో ఆర్‌అండ్‌బీ అధికారులు నలిగిపోతున్నారు. చాలామంది కాంట్రాక్టర్లకు వైసీపీ ఎమ్మల్యేలే సిఫార్సు చేశారు. స్థానిక సంస్థలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో వారు ఎమ్మెల్యేలకు ఆర్ధికసాయం చేసినందుకు, ప్రతిఫలంగా ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లకు పనులు ఇప్పించారు. అయితే ఇప్పటివరకూ కాంట్రాక్టర్లకు పాతబకాయిలు విడుద ల కాకపోవడంతో, వారంతా ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు.