Home » ‘లా’ ఒక్కింతయు లేదు..

‘లా’ ఒక్కింతయు లేదు..

– సీఎం జగన్, విపక్షనేత బాబుపై రాయి దాడి
– గతంలో బాబుపై చెప్పులు, రాళ్ల వర్షం
– సీఎస్‌ఓ, ఎన్‌ఎస్‌జీ అధికారికీ రక్తం
– బాబు ఇంటిపైనే దొమ్మీకి యత్నం
– డీజీపీ ఆఫీసు పక్కనే ఉన్నా టీడీపీ ఆఫీసు ధ్వంసం
– అయినా కళ్లు మూసుకున్న ఖాకీలు
– నిరసన ప్రజాస్వామ్య హక్కని సవాంగ్ సూత్రీకరణ
– ఎన్నికల సమయంలోనూ ఆగని దాడులు
– సీఎం, విపక్ష నేతల రక్షణకే దిక్కులేదా?
– ఎస్‌ ఐ, సీఐ, డీఎస్పీలపైనేనా చర్యలు
– ఐపిఎస్‌లపై చర్యలు తీసుకోరా?
– నిఘా నిద్రపోతోందా?
– తమ సం‘గతే’మిటని జనం ప్రశ్న
( మార్తి సుబ్రహ్మణ్యం)

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా? చచ్చిపోయిందా? లేక గొంతునులిమి చంపేశారా? సాక్షాత్తూ సీఎం, ప్రతిపక్షనేత రక్షణనే గాలికొదిలేస్తే ఇక సామాన్యుల సం‘గతేమిటి’? అప్పుడు డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలోని టీడీపీ ఆఫీసుపై, అధికార పార్టీ కిరాయి గూండాలు స్వైరవిహారం చేస్తే స్పందించే దిక్కులేదు. స్వయంగా విపక్షనేత చంద్రబాబుపై రాళ్లదాడిచేస్తే ..సెక్యూరిటీ ఆఫీసర్ సహా నేషనల్ సెక్యూరిటీగార్డ్స్ అధికారి రక్తమోడితే, చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. విపక్ష నేత ఇంటిపై కర్రలతో అధికార పార్టీ ఎమ్మెల్యే దొమ్మీకి దిగితే అడ్డుకున్న దిక్కులేదు.

ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు దుండగులకు, ఏకంగా సీఎంపై రాయి వేసే తెగింపునకు చేర్చిందా? ఆ బేఖాతరిజమే ఇప్పుడు విపక్షనేతలపై, వెలుగులోనే రాయి వేసే బరితెగింపునకు కారణమయిందా? మరి ఇంత జరుగుతుంటే నిఘా నిద్రపోతోందా? వీఐపీల పర్యటనల్లో జాగ్రత్తలు తీసుకోరా? దుండగులెవరో కనిపెట్టరా? చర్యల కొరడా ఝళిపించేందుకు ధైర్యం చచ్చుబడిపోయిందా? వీవీఐపీల ప్రాణాలకే దిక్కులేకపోతే ఇక తమ సం‘గతేమిటి’?.. ఇదీ ఇప్పుడు ఏపీలో ప్రజల ఆందోళన.

ఒక్కరోజు వ్యవధిలో.. రెండు రోజుల్లో పోలీసుల నెత్తిన ఉన్న సింహాలు తలదించుకునే మూడు పరువుతక్కువ పనులు. ఒకరోజు రాత్రి ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో చిమ్మచీకటి చాటున ఆగంతుడు ఆయనపై విసిరిన రాయి. దానితో సీఎం కంటిపైన గాయం. మరుసటిరోజే విపక్ష నేత, దక్షిణభారతదేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై, వెలుగులోనే మరో ఆగంతుడు విసిరిన మరో రాయి. ఇక తెనాలిలో కూడా జనసేనాధిపతి పవన్‌పై రాయి విసిరారన్నది జనసైనికుల మాట. అది నిజమో కాదో ఇంకా తేల్చని వైనం. వరస వెంట వరస వైఫల్యాలు. . భద్రతా వైఫల్యాలు.

ఇవన్నీ ..ఆంద్రప్రదేశ్‌లో వీవీఐపీల రక్షణకు దిక్కులేదని, దిక్కులు పిక్కటిల్లేలా వెల్లువెత్తే సంకేతాలన్నది మనం మనుషులం అన్నంత నిజం! ఇప్పుడే కాదు. ఈ ఒక్కసారే కదా సరిపెట్టుకోలేని వైఫల్యాలవి!! గతంలో విపక్ష నేత చంద్రబాబుపై ‘అధికారపార్టీ ప్రాయోజిత సైనికులు’ ఆయనపై రాళ్లు రువ్వారు. ఫలితంగా ఆయన సెక్యూరిటీ ఆఫీసర్‌కు తలకు ‘నిజమైన’ గాయాలు. ఎందుకంటే ధారగా కారిన రక్తమే దానికి సాక్షి. ఆయనొక్కడే కాదు. బాబుకు పహారాకాసే ఎన్‌ఎస్‌జీ కమాండర్ తలకూ గాయం. కేంద్ర హూం శాఖ కూడా దానిపై రంగంలోగి దిగిన వైనం. మరోసారి అదే బాబుపై చెప్పుల దాడి.

అంతేనా? ఆ గూండాగిరి అంతటితో ఆగిందా? స్వయంగా బాబు నివాసంపైనే అధికార పార్టీ ఎమ్మెల్యే దొమ్మీకి దిగిన ధిక్కార పర్వం. దానికి.. సదరు ఎమ్మెల్యే బాబుతో మాట్లాడానికి వెళ్లాడన్నది ఘనత వహించిన నాటి ఎస్పీ ఇచ్చిన సమాధానం. ఒక ఐపిఎస్ అనాల్సిన మాటేనా అది? అంతేనా?.. డీజీపీ కొలువుదీరే పోలీస్‌హెడ్‌క్వార్టర్సకు కూతవేటు దూరంలోనే ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై, అధికారపార్టీ ముష్కరమూకల సామూహి స్వైరవిహారం. ఇనుపరాడ్లు, కర్రలతో పార్టీ ఆఫీసు అద్దాలు పగులగొట్టిన అరాచకకాండ. పనిచేసే ఉద్యోగుల తలపగులకొట్టిన దాదాగిరి. సీసీటీవీ పుటేజీలో నిందితులెవరో కనిపిస్తున్నా వారిని శిక్షించలేని వైఫల్యం. అసలు జడ్జిలపై దారణంగా పోస్టులు పెడితేనే, చర్యలు లేని చేవలేనితనం!

ఇంత జరిగినా నాటి డీజీపీ మౌనం. పైగా.. ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉందంటూ దిక్కుమాలిక భాష్యం! అంటే నిరసన తెలిపే హక్కు, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందని సెలవిచ్చిన నాటి పోలీసుబాసు.. అలాంటి నిరసన ప్రకటించే గొంతులను ఎందుకు అణచివేశారు? అర్ధరాత్రి-అపరాత్రి సీఐడీ పోలీసులు ఇళ్లలోకి జొరబడి, ఎంపీలను కూడా ఎత్తుకొచ్చి ఎందుకు చిత్రహింసలకు గురిచేశారు? ప్రజాస్వామ్యం అంటే పార్టీకి ఒకరకంగా ఉంటుందన్నదా సవాంగు సారు కవిహృదయం?!

అప్పుడూ..ఇప్పుడూ..పోలీసులది ప్రేక్షకపాత్రనే. అధికారులు మారారే తప్ప అదే తీరు. అధికారంలో ఉన్న పార్టీలు మళ్లీ గెలవచ్చు. ఓడిపోవచ్చు. కానీ అధికారులు శాశ్వతం. వ్యవస్థ శాశ్వతం. ప్రజలు ఇంకా శాశ్వతం. ఆ స్పృహ లేక , లాభసాటి పోస్టింగులకు ఆశపడి పాలకులకు సాగిలబడి, వారి అడుగులకు మడుగులొత్తే అధికారుల చరిత్ర చెత్తబుట్టలో కలుస్తుంది. ఇది నిఖార్సయిన నిజం. అప్పుడు చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పటి అధికారులే ఇప్పుడూ ఉన్నారు. కాకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులు కొందరున్నారు. మరి అప్పుడెందుకు ఇంత విచ్చిలవిడితనం లేదు? అప్పుడెందుకు ఇంత బేఫర్వాయిజం లేదు? అంటే పాలకులను బట్టి పాలితులు. రౌతును బట్టి గుర్రం!

ఇక ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి అయినా, చంద్రబాబునాయుడయినా ఇద్దరూ ఉన్నత స్థానాల్లో ఉన్న బాధితుల కింద లెక్కనే. ఓమాటకొస్తే జగన్ కంటే బాబుకు భద్రత ఎక్కువ. మరి అలాంటి వ్యక్తులపైనే రాయి వేశారంటే, ఇక రాష్ట్రంలూ న్యాయం ఎక్కడ. చట్టం- ధర్మం నాలుగు పాదాలతోకాదు, అవిటితనంతో నడుస్తోందన్నది రెండురోజుల్లో జరిగిన ఘటనలతో సుస్పష్టం.
మరి వారిపై జరిగిన దాడులకు ఎవరు బాధ్యులు? పవన్‌కల్యాణ్ అన్నట్లు.. జగన్‌పై దాడికి బాధ్యులైన వారికే విచారణ బాధ్యత అప్పగిస్తే, ఇక నిందుతులెవరో తేలేదె ప్పుడు? అసలు జగన్‌పై దాడికి విజయవాడ కమిషనరే కారణమంటూ, రాజకీయ పార్టీలు ఒకవైపు ఘోషిస్తుంటే.. ఆయన ఆధ్వర్యంలోనే విచారణ ఏమిటన్నది పవన్ ప్రశ్న. లాజిక్కే కదా?

నిజానికి ఇలాంటి ఘటన ఏదైనా జిల్లా పర్యటనలో జరిగి ఉంటే.. ఈపాటికి అక్కడి డీఎస్పీ, సీఐల శిరచ్ఛేదనమయి ఇప్పటికి రెండురోజులయ్యేది. వీలైతే అక్కడ కులబలం లేని ఎస్పీ ఉంటే ఆయనపైనా వేటు వేసేవారు. గతంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి కూడా. అంటే సాధారణ కానిస్టేబుల్, ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీలకు ఒక న్యాయం? ఐపిఎస్‌లకు మరో న్యాయమా? అదే నిజమైతే చట్టం కళ్లు చిన్నవన్నట్లా అన్నది బుద్ధిజీవుల సందేహం.

దీన్నిబట్టి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా, ఇంకా వ్యవస్థ అధికార పార్టీ ప్రభుత్వం చేతిలోనే ఉందన్నది సుస్పష్టం. ఈసీ చేతికి వెళ్లాల్సిన పగ్గాలు, ఇంకా పాలకుల చేతిలో ఉంటే ఇక బాధితులకు సత్వర న్యాయం ఎలా జరుగుతుంది? ఈసీ అధికారులు ఎలా స్పందిస్తారు? న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఇలాంటి వైఫల్యాలపై పంచకల్యాణి కంటే వేగంగా స్పందించి, చర్యల కొరడా ఝళిపించాల్సిన ఈసీ కూడా.. ఢిల్లీ ఆదేశాల కోసం ఎదురుచూస్తూ మీనమేషాలు, వారాలు- వర్జాలూ లెక్కబెట్టడం వివేకం కాదు. సూటిగా చెప్పాలంటే అది బాధ్యతా రాహిత్యమే.

నోటిఫికేషన్ ఘంటారావం మోగబోతోంది. అయినా ఇప్పటివరకూ ఇన్చార్జి డీజీపీగా ఉన్న అధికారి స్థానంలో, రెగ్యులర్ డీజీపీని నియమించే ప్రక్రియ ప్రారంభించలేదంటే.. ఎన్నికల సంఘం ఎంత వేగంగా పనిచేస్తుందో, ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఫర్వాలేదు. అది బహుశా ఒక ఇన్చార్జి డీజీపీ హయాంలో ఎన్నికలు నిర్వహించిన తొలి రాష్ట్రంగా, ఏపీని నిలబెట్టాలన్న తలంపు కావచ్చన్నది మేధావుల ఉవాచ.

Leave a Reply