– పెద్దల సభ ఎంపికలో కనిపించని తెలుగోడు
– రాజ్యసభకు అభ్యర్ధులు ప్రకటించిన బీజేపీ
– ఏపీ-తెలంగాణకు మొండిచేయి
– తెలుగు నేతలను విస్మరించిన నాయకత్వం
– తెలుగు రాష్ట్రాలపై ఆసక్తిలేని బీజేపీ
– ఓటు కోణంలో తెలుగు రాష్ట్రాలకు బీజేపీ అన్యాయం
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలుగు రాష్ట్రాలంటే తమకు ఎనలేని గౌరవమని బహిరంగసభల్లో మెచ్చుకునే బీజేపీ అగ్రనాయకత్వం.. వాస్తవంలో మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ పార్టీ వర్గాలను అసంతృప్తికి గురిచేసింది. రాజ్యసభ సభ్యుల ఎంపికలో ఈసారి, తెలుగువారికి మొండి చేయి చూపడం విమర్శలకు తెరలేపింది.
రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ నాయకత్వం ముగ్గురి పేర్లు ప్రకటించింది. గుజరాత్ నుంచి బాబు బాయి జేసంగ్ బాయ్, కే శ్రీదేవన్స్ జాలా, బెంగాల్ నుంచి అనంత్ మహారాజ్‌కు అవకాశం ఇచ్చింది. ఇప్పటికే గుజరాత్ నుంచి కేంద్రమంత్రి జైశంకర్ పేరును నామినేట్ చేసిన విషయం తెలిసిందే.జులై 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
అయితే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒ బీజేపీ నేతకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. ఆ క్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎంపి గరికపాటి మోహన్‌రావు పేరు ప్రముఖంగా వినిపించింది. కమ్మ సామాజికవర్గానికి చెందిన గరికపాటికి రాజ్యసభ ఇస్తే, ఆయనతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కమ్మ సామాజికవర్గాన్ని ఆకర్షించవచ్చన్నది, నాయకత్వ యోచనగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఆ మేరకు మీడియాలో కూడా విస్తృత ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గరికపాటి తెలంగాణలోని ఎస్టీ నియోజకవర్గాలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.
కాగా బీజేపీ నాయకత్వ తాజా నిర్ణయం పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాలపై ఆ పార్టీకి నమ్మకం, ఆశలు లేవన్నట్లు స్పష్టమవుతోంది. ఏపీ-తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం ఇవ్వడం ద్వారా, పార్టీ క్యాడర్‌లో కొంత ఉత్సాహం నింపుతారని అటు పార్టీ వర్గాలు కూడా భావించాయి. చివరకు ఎవరికీ ఇవ్వకపోవడంతో క్యాడర్ నిరాశ చెందాల్సివచ్చింది.
దీన్నిబట్టి.. తెలుగు రాష్ట్రాలపై బీజేపీ నాయకత్వానికి పెద్ద ఆశలు, పార్టీ ఎదుగుతుందన్న భ్రమలు లేవన్నని అర్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఇక ఎదిగే అవకాశం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు, తమ పార్టీ వైఖరి స్పష్టమవుతోందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. తెలంగాణ నుంచి డాక్టర్ లక్ష్మణ్, ఏపీ నుంచి జీవీఎల్ నరసింహారావుకు ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభ సీట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, పార్టీ బలపడలేదన్నది నాయకత్వం భావనగా కనిపిస్తోంది.
రెండు రాష్ట్రాలకు ఎంత సమయం కేటాయించినా, ఎంతమందికి పదవులిచ్చినా, ఎన్నిసార్లు పర్యటించినా వృధా ప్రయాస అన్న భావనకు వచ్చినట్లు, తాజా నిర్ణయం కనిపిస్తోందని బీజేపీ సీనియర్లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల్లో ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ, బీజేపీతో ప్రత్యక్షంగానో-పరోక్షంగానో సన్నిహితంగా ఉండక తప్పదని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అలాంటప్పుడు మళ్లీ ప్రత్యేకంగా రాష్ట్రాలపై దృష్టిసారించడం ద్వారా సమయం-డబ్బు వృధా అన్న భావన కూడా నాయకత్వంలో లేకపోలేదని చెబుతున్నారు.
ముఖ్యంగా ఆంధ్రాలో బీజేపీ ఇప్పటికిప్పుడు కోలుకునేదని, ఎన్ని దశాబ్దాలకు లేచి పరుగులు తీస్తుందన్న దానిపై నమ్మకం కూడా లేదు. ఈ నిర్లిప్తతతోనే నాయకత్వం, ఏపీ నేతలకు రాజ్యసభ ఇవ్వకపోయి ఉండవచ్చని ఓ బీజేపీ నేత విశ్లేషించారు.
కానీ తెలంగాణలో కమలదళమంతా కదనరంగంలోకి దిగిన వేళ, దానికి కొనసాగింపుగా కనీసం తెలంగాణకయినా ఇవ్వకపోవడమే ఆశ్చర్యంగా ఉందంటున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు నద్దా, కేంద్రమంత్రులంతా వరసపెట్టి పర్యటిస్తూ, తెలంగాణలో పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేయడంతోపాటు, క్యాడర్‌లో ఉత్సాహం పెంచేందుకయినా.. తెలంగాణ నుంచి రాజ్యసభ ఇస్తారని, పార్టీ నేతలు భావించారు. కానీ అసలు తెలుగు రాష్ట్రాల నేతలెవరికీ రాజ్యసభ సీటు ఇవ్వకుండా, బీజేపీ నాయకత్వం ఝలక్ ఇవ్వడంతో కమలదళాలు ఖంగుతినాల్సి వచ్చింది.