పార్టీ ఏదైనా.. పోటీ ఒంగోలు నుంచే!

– అనుచరులకు స్పష్టం చేసిన బాలినేని
– ఒంగోలు మేయర్ సహా కీలకనేతలతో బాలినేని భేటీ
– ఏ పార్టీకి వెళ్లినా మీతోనే ఉంటామని ప్రతిన
– గిద్దలూరు వద్దని అనుచరుల ఒత్తిడి
– మాకు జగన్ కంటే మీరే ఎక్కువ
– మాగుంటకు సీటు ఇవ్వనని జగన్ చెబుతున్నారు
– ఆయన దారి ఆయన చూసుకుంటున్నారన్న బాలినేని
– అయినా మాగుంట కోసం ప్రయత్నిస్తానన్న బాలినేని
– ఒంగోలు నుంచి శిద్దా సుధీర్ పోటీ చేయరని స్పష్టం
– టికెట్ ఇవ్వకపోతే అంతా కలసే నిర్ణయం తీసుకుందామని బుజ్జగింపు
– ఒంగోలు నుంచే పోటీ చేస్తానని బాలినేని స్పష్టీకరణ
( మార్తి సుబ్రహ్మణ్యం)

సిట్టింగుల సీట్లు మార్చే ప్రయోగం చేస్తున్న వైసీపీ అధినేత-సీఎం జగన్ ప్రయత్నం .. మాజీ మంత్రి, ఆయన సమీప బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో వర్కవుట్ అయ్యే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. ఒంగోలులో బాలినేనికి వ్యతిరేకత ఉన్నందున, ఆయనను గిద్దలూరు లేదా మార్కాపురం నియోజకవర్గానికి వెళ్లాలన్నది పార్టీ అధినేత జగన్ ఆలోచన. కానీ తాను ఒంగోలు తప్ప, మరెక్కడా పోటీ చేసేది లేదని బాలినేని భీషణ ప్రతిన చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బాలినేనికి సొంత నియోజకవర్గంలో అనూహ్య మద్దతు లభించింది. ‘మీరు ఏ పార్టీలోకి వెళ్లినా మేమంతా మీ వెంటే ఉంటారు. మీరు ఎవరికీ భయపడవద్దు. మీవెనుక మేం, ప్రజలంతా ఉన్నాం. అయితే గిద్దలూరు-మార్కాపురం వెళ్లవద్దు. మీరు ఒంగోలు నుంచే పోటీ చేయాలి. మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది’ని ఒంగోలు నుంచి హైదరాబాద్ వచ్చిన వైసీపీ మేయర్-కార్పొరేటర్లు బాలినేనిని భరోసా ఇచ్చినట్లు సమాచారం.

బాలినేనికి ఒంగోలు సీటివ్వడం లేదన్న ప్రచారం నేపథ్యంలో.. ఒంగోలు మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు, కీలక నేతలు హైదరాబాద్‌లో ఉన్న బాలినేనితో భేటీ అయ్యారు. తొలుత మీరు మార్కాపురం గానీ, గిద్దలూరు గానీ వెళుతున్నారన్న ప్రచారాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. మీరు ఎక్కడికీ వెళ్లవద్దని, ఒంగోలులోనే ఉండాలని ఒత్తిడి చేశారు. తమకు జగన్ కంటే మీరే ముఖ్యమని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

దానికి స్పందించిన బాలినేని.. తాను ఎక్కడికీ వెళ్లనని స్పష్టం చేశారు. ‘పార్టీ ఏదైనా నేను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తా. ఈ విషయం జగన్, విజయసాయిరెడ్డికి స్పష్టం చేశా. శిద్దా సుధీర్ ఒంగోలు నుంచి పోటీ చేయరు. ఏదైనా మిమ్మల్ని సంప్రదించిన తర్తాతనే పార్టీలో చేరతా’’ని బాలినేని స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎన్నికల తర్వాత ఒంగోలులో 25 వేల మందికి పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని వారికి వివరించారు.

తాను దానికోసం గత నాలుగున్నరేళ్లుగా ప్రయత్నిస్తున్నా, కించిత్తు ఉపయోగం లేదని బాలినేని వాపోయారట. ‘నేనేమీ నాకోసం పనులు అడగడం లేదు. మన నియోజకవర్గంలో 25 వేల మందికి పట్టాలివ్వాలని జగన్‌ను కోరా. అది నా ఎన్నికల హామీ అని మీకు తెలుసు. వెళ్లినప్పుడల్లా సీఎంఓ అధికారులను అడుగుతూనే ఉన్నా. సీఎం తలచుకుంటే అది 5 నిమిషాల పని. కానీ కావాలనే ఆపుతున్నారు. మనకూ సహనం ఒక పరిమితిలోనే ఉంటుంది. దానికి భూసేకరణ కోసం 75 కోట్లు కలెక్టర్ ఖాతాలో జమచేసిన తర్వాతనే మీతో మాట్లాడతానని ధనంజయరెడ్డి, విజయసాయికి స్పష్టం చేశాన‘ని బాలినేని న అనుచరుల వద్ద వ్యాఖ్యానించారట. త న పోటీపై స్పష్టత వచ్చేవరకూ సంయమనం పాటించాలని, బాలినేని తన అనుచరులకు సూచించనట్లు తెలుస్తోంది. ఎక్కడికి వెళ్లినా అంతా కలసే వెళదామని స్పష్టం చేశారట.

Leave a Reply