Home » జగన్ కని‘కట్టు’

జగన్ కని‘కట్టు’

– ‘కట్టు’ జారిపోయిందే..
– 13 రోజులుగా జగన్ తలపై బ్యాండేడ్
– ఒకసారి చిన్నగా, మరోసారి పెద్ద సైజులో దర్శనం
– పోలింగ్ దాకా ఉంటుందని సోషల్‌మీడియాలో వెటకారం
– బ్యాండేడ్ వేస్తే గాలి ఎలా వస్తుందన్న డాక్టరు చెల్లి సునీత
– చివరాఖరకు తలపై కట్టు తీసేసిన జగన్
– ఒక్క గీత కూడా కనిపించని వైచిత్రి
– వైద్యశాస్త్రంలో అద్భుతమంటూ వ్యంగ్యాస్త్రాలు
– ఎట్టకేలకు ముగిసిన కని‘కట్టు’ పర్వం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇట్స్ గాన్.. పోయిందే! ఇది ఏళ్ల క్రితం టీవీలో ప్రజాదరణ పొందిన యాడ్. ఇప్పుడు వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగన్ తలకు తగిలిందంటున్న రాయి దెబ్బ అనేక మలుపు తిరిగి, సోషల్‌మీడియాలో వెటకారాలకు కేంద్రమయింది. దానికి కారణం… దెబ్బ తగిలిన తొలి రోజు చిన్నసైజు ప్లాస్టర్ వేసుకున్న జగన్, ఆ తర్వాత పెద్ద సైజు పట్టీతో దర్శనమివ్వడమే. అటు ఆయనకు తగిలిన రాయి కిందపడి.. మళ్లీ దానంతట అదే పైకి లేచి, పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తలకూ తగిలిందన్న ఫొటోలొచ్చాయి.

వెల్లంపల్లి తొలిరోజు ప్రెస్‌మీట్‌లో మాట్లాడినప్పుడు, ఆయన తల మామూలుగానే కనిపించింది. కానీ ఆయన కూడా తర్వాత కూడా పెద్ద కట్టుతో దర్శనమిచ్చారు, అయితే నామినేషన్ రోజు వెల్లంపల్లికి తగిలిన దెబ్బ ఒకవైపయితే.. ఆయన కట్టు మాత్రం ఇంకోవైపు ఉండటంతో సోషల్‌మీడియాలో వ్యంగ్యాస్త్రాలు పేలాయి. ఇప్పుడు లేటెస్టుగా ఆయన తల కూడా కట్టు లేకుండా ఫ్రీగా కనిపిస్తోంది. అది వేరే విషయం.

కానీ జగన్‌కు తగిలిన దెబ్బ చాలా ప్రమాదం. పైగా ఆయనను హత్య చేసేందుకు విసిరిన రాయి అన్నది పోలీసుల ఆరోపణ. దానితో ఆయన దాదాపు 13 రోజుల పాటు తలపై పెద్దసైజు పట్టీతో బహిరంగసభల్లో కనిపించారు. దానిపైనా సోషల్‌మీడియాలో నెటిజన్లు ఆడుకున్నారు. అదివేరే విషయం.

అదే సమయంలో డాక్టర్ చెల్లెమ్మ సునీత కూడా.. జగనన్న తలపై పట్టీ తీసేస్తే , తలకు గాలి తగిలి గాయం మానిపోతుంది. గవర్నమెంట్ డాక్టర్లు ఆయనకు ఎందుకు ఆ సలహా ఇవ్వలేదో అర్దం కావడం లేదని వ్యాఖ్యానించారు. నిజానికి కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు, ఆంకాలజిస్టు, చివరాఖరకు గైనకాలజిస్టులు కలసి మూడు కుట్లు వేసిన జగన్ కట్టు, ఎంతకూ తగ్గకపోవడం జగనన్న అభిమానులను ఆందోళన పరిచింది.

అటు టీడీపీ సైతం.. ‘‘పోలింగ్ వరకూ జగన్ తలపై పట్టీ తీసేలా లేవు. అప్పటికి ఆ సైజు ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదు. గర్భిణులకు కూడా వారంలో కుట్లు తీస్తారు. జగన్ డ్రామాలు చూడలేక ఛస్తున్నాం. ఇక ఈ డ్రామాలు ఆపితే మంచిది’’ అని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

సీన్ కట్ చేస్తే.. జగన్ వైసీపీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ సందర్భంలో ఆయన తలపై కట్టు కనిపించలేదు. అదే ఆశ్చర్యం. ఇంకా చెప్పాలంటే వైద్యచరిత్రలో అదో అద్భుతం. ఎందుకంటే.. 13 రోజులు పట్టీతో ఉన్న జగనన్న నుదురు, మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఒక్క చిన్న గీత కూడా కనిపించకుండా నున్నగా ఉండటమే. సహజంగా హత్యచేసేందుకు విసిరిన రాయి, చాలా ప్రమాదకరంగా ఉండాలి. ఒక లీటరు రక్తమయినా పోయిండాలి. దానితో ఆయన కనీసం వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. వైద్యచరిత్రనే తిరగరాసిన జగనన్న, అప్పుడే ప్రచారానికి వెళ్లారు. అదే అద్భుతం!

కానీ ఇప్పుడు మేనిఫెస్టో విడుదల రోజు.. జగనన్న తలపై ఒక చిన్న గీత కూడా లేకపోవడం చూస్తే, వైద్యశాస్త్రంలో ఒక అద్భుతం జరిగినట్లేనన్నది నెటిజన్ల ఉవాచ. ఏతావాతా.. గొడ్డలి పోయి రాయి వచ్చే ఢాం ఢాం కథ సుఖాంతమయింది.

Leave a Reply