Home » రాష్ట్రంలో దొంగలుపడ్డారు

రాష్ట్రంలో దొంగలుపడ్డారు

-ప్రజలకు ఏం చేస్తాడో చెప్పలేక జగన్ చేతులెత్తేశారు
-కూటమి మేనిఫెస్టో సూపర్ హిట్…వైసీపీ మేనిఫెస్టే ఫట్
-మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్న జగన్…మేనిఫెస్టోలో పెట్టిన హామీలను ఎందుకు నెరవేర్చలేదు?
-మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్నావ్…ఇప్పుడెందుకు అడుగుతున్నావ్.?
-నేను అభివృద్ధికి బ్రాండ్…జగన్ నేరాలు, ఘోరాలకు బ్రాండ్
-బ్యాండేజ్ తీయకుండా డ్రామాలు చేద్దామనుకున్నాడు….ప్రజల హేళనతో తీసేశాడు
-అధికారంలోకి వచ్చాక హోంగార్డులు, అంగన్వాడీలు, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తాం
-ఆత్మకూరు ప్రజాగళం సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు

ఆత్మకూరు : రాష్ట్రంలో దొంగలు పడ్డారని…అందరం కలిసి కాపాడుకుందామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఏం చేస్తాడో చెప్పలేక జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశాడని అన్నారు. నెల్లూరు జిల్లా, ఆత్మకూరులో శనివారం ప్రజాగళం సభలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘‘అత్యంత కీలకమైన ఎన్నికలు మన భవిష్యత్ ను మార్చబోతున్నాయి. ఇప్పటి వరకు 54 సభల్లో పాల్గొన్నాను. ప్రతి సభలోను రాతి యుగం పోయి స్వర్ణయుగం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కూటమి వస్తే అభివృద్ధి జగన్ వస్తే అరాచకం. ఐదేళ్లు ప్రజలు ప్రశాంతంగా లేరు. జీవితాలన్ని తారుమారయ్యాయి. సైకో జగన్, ఏ2 విజయ్ సాయి రెడ్డి, పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల తప్ప మరెవ్వరూ బాగుపడలేదు.

మన మేనిఫెస్టో సూపర్ సిక్స్. ఇంత కంటే నేను చెయ్యలేనని జగన్ చేతులెత్తేశాడు. ఒక నాయకుడికి దక్షత ఉండాలి, సంపద సృష్టించాలి దానిని ప్రజలకు పంచాలి. కాని జగన్ రెడ్డి తెలుగు జాతికి ద్రోహం చేసిన వ్యక్తి. యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలండర్ వచ్చిందా? డీఎస్సీ, పెట్టాడా? పరిశ్రమలు వచ్చాయా? కాని జాబు రావాలంటే బాబు రావాలి. గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి.

చంద్రబాబు అంటే అభివృద్ధికి…జగన్ అంటే ఘోరాలకు బ్రాండ్
చంద్రబాబు అంటే ఒక బ్రాండ్. అభివృద్ధి చేసి చూపించాను. అభివృద్ధి జరిగితే ప్రభుత్వానికి ఆదాయం. వాటితో సంక్షేమం చేయవచ్చు. ఇది ఆర్ధిక వ్యవస్థలో రహస్యం. కాని జగన్ ఎక్కడ చదువుకున్నాడో తెలియదు. నేరాలు, ఘోరాలు చేయడంలో పీహెచ్ డీ చేశారు. మన ఆస్థులపై జగన్ బొమ్మ ఎలా వేసుకుంటారు. మీ పొలంలోను ఆయనే బొమ్మ. ప్రజల భూములన్ని కంప్యూటరైడ్జ్ చేస్తామంటున్నారు.

పట్టాదారు పుస్తకం, అడంగల్ ఉండదు. కాని వాటికి మాత్రం జగన్ దగ్గర ఉంటుంది. మీ ఆస్థికి భద్రత కావాలా లేదా? బ్రిటిష్ కాలం నుంచి ఆస్థి అనేది హక్కు. కాని నేడు రికార్డులు మార్చేందుకు కుట్ర చేస్తున్నారు. ఒంటిమిట్టలో పేద రైతుకు 4 ఎకరాలు ఉన్నాయి.వాటిని అమ్మి అప్పులు తీర్చుకుందామని అనుకుంటే కాగితాలు ఆయన పేరు లేదు. ఊరూరా తిరిగినా పని కాకపోవడంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తరువాత ఆయన కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రంలో అరాచకం జరుగుతుంది, చిన్న పిల్లలతో గంజాయి అమ్మిస్తున్నారని ఢిల్లీలో శ్రీ లక్ష్మీ అనే మహిళ బొటన వేలు కట్ చేసుకుంది.

జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మన తల మనమే నరుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆనం రాంనారాయణ రెడ్డి అభివృద్ధి చేసి నిరూపించిన వ్యక్తి. మళ్లీ ఆత్మకూరు అభివృద్ధి చెందాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి. వేం రెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవాభావంతో పని చేసే వ్యక్తి. సంపాదించిన డబ్బులు ప్రజలకు ఖర్చు చేసే వ్యక్తి. ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తి మనకు అవసరమా? ప్రభాకర్ రెడ్డికి ఓటు వేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి.

సోమశిల ఆప్రాన్ ప్రమాదంలో పడ్డా పట్టించుకోలేదు
ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చాయా? జగన్ ఉంటే నీళ్లు వస్తాయా? సోమశిల ప్రాజెక్టు 36 నుంచి 78 టీఎంసీలకు పెంచిన వ్యక్తి ఎన్టీఆర్. కండలేరు ప్రాజెక్టు కట్టి ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా దాదాపు 146 టీఎంసీలతో పెన్నా డెల్టాతో సుస్థిరం చేసిన పార్టీ టీడీపీ. తెలుగు గంగ నీళ్లు చెన్నైకి వెళ్లే ముందు సోమశిలకు రావాలి కందలేరు నిండిన తరువాతే చెన్నైకి తీసుకుపోవాలని ఎన్టీఆర్ చొరవ చూపించారు. శ్రీశైలం నుంచి 45 టీఎంసీలు నీళ్లు తీసుకువచ్చాను. ఎప్రాన్ ప్రాజెక్టుకు రూ.95 కోట్లు ఖర్చు అవుతుంది. రేపు వరదలకు ఆ ప్రాజెక్టు కొట్టుకుపోతే ఏంటి పరిస్థితి. వ్యవసాయ శాఖా మంత్రి గనుల మీద ఉన్న శ్రద్ధ సేధ్యం మీద లేదు.

కాల్వలు పూడిపోయాయి. నీళ్లు పోయే పరిస్థితి. చివరి భూములకు నీళ్లు రావడం లేదు. కరోనాలో అందరూ లాక్ డౌన్ లో ఉంటే రైతన్న సేధ్యం చేసి దేశానికి అన్నం పెట్టాడు. అలాంటి పరిస్థితిలో 860 కేజీల పుట్టికి 160 కేజీలు ధాన్యం మంత్రి దోచుకున్నారు. రైతు భరోసాను రూ.12,500 హామీనిచ్చి దానిని రూ.7,500 కి తగ్గించారు. కాని మనం రూ.20వేలు అన్నదాతకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సబ్జిడీలో యంత్రాలు, పనిముట్లు ఇస్తాం. ఆధునీకరణలో డ్రోన్స్ వచ్చాయి. వ్యవసాయంలో ముందుకు పోతుంది. కాని జగన్ వ్యవసాయాన్ని రాతియుగానికి తీసుకువచ్చారు. నేడు జగన్ మేనిఫెస్టోలో రైతుల గురించి ఏమీ చెప్పలేదు. సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తాం. ప్రతి ఎకారాకు నీళ్లు ఇస్తాం.

మేనిఫెస్టోపై మాట తప్పాడు
జగన్ మాట తప్పాడు, మడమ తిప్పాడు. మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నాడు. 99.05 శాతం హామీలు చేశానని చెప్పాడు. కాని ప్రజల ఆదాయం పెరగలేదు. ఖర్చు పెరిగాయి. మద్యపాన నిషేధం హామీ ఏమయ్యింది. నాడు క్వార్టర్ బాటిల్ రూ.60 ఉంటే నేడు రూ.200 పెరిగింది. రూ.140 ఎవరి జోబులోకి పోతున్నాయి? ఎవరి ప్యాలస్ కి పోతున్నాయి? మద్యపాన నిషేదం చేసిన తరువాతే ఓటు అడుగుతానన్నావా?

కానీ నేడు మళ్లీ సిగ్గు లేకుండా ఓటు అడుగుతున్నారు. ఆడపడుచుల మంగళ సూత్రాలు తెంచేస్తున్నారు, మద్యం తాగే వాళ్ల ప్రాణాలను హరిస్తున్నారు. గులకరాయి డ్రామాతో ఎన్నికల నాటికి బ్యాడేండ్ తియ్మొద్దని అనుకున్నాడు. నేడు అందరూ బ్యాండేజ్ పెట్టడంతో అది తీసేశాడు. కాని జగన్ గాయం కనపడిందా? బాబాయ్ ని గొడ్డలితో లేపేసి నారా సుర రక్త చరిత్ర అంటారు. నేను కనపడని గులకరాయి దాడి చేయించానంటారు. కోడికత్తితో డ్రామాలాడతారా? నేనే దానితో ఆయనను గుచ్చానంటారు. ఈ డ్రామాలరాయుడిని ఏం చేద్దాం?

ప్రజల నెత్తిన రూ.14 లక్షల కోట్ల అప్పులు
ఒక సీనియర్ నాయకుడిగా హెచ్చరిస్తున్నాను. నేను హైదరాబాద్ ను మహానగరంగా రూపకల్పన చేశాను. ఆ తరువాత అలాంటి నగరాన్ని కట్టాలి జాతి రుణం తీర్చుకోవాలనుకున్నాను. అందుకే అమరావతి కట్టాలనుకున్నాను. నేడు జగన్ సర్వనాశనం చేశారు. రూ.14లక్షల కోట్ల అప్పు చేసి ఒక్కొక్కరిపై రూ.8 లక్షల భారం వేశారు. నిత్యవసరం ధరలు, పెట్రోల్ డీజిల్, కరెంట్ చార్జీలు, చెత్త మీద పన్ను, పన్నుల భారం పెంచారు. ఇచ్చింది రూ.10 దోచింది రూ.100 జగన్ దోపిడీ చేసింది రూ.1000.

అమ్మ ఒడిని నాన్న బుడ్డిగా మార్చారు. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని 10 సార్లు పెంచారు. సీపీఎస్ వారంలో రద్దు చేస్తానని మోసం చేశారు. ల్యాండ్, ఇసుక, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం కుంభకోణాలు జరుగుతున్నాయి. నేను ఏం తప్పు చేయకపోయినా అరెస్ట్ చేశారు. అంటే ప్రశ్నిస్తే దాడులు, అరెస్ట్ చేస్తారా? జగన్ కి నాకు శత్రుత్వం ఏంటి? వైఎస్, నేను ఒకప్పుడు మిత్రులం, రాజకీయంగా రెండు పార్టీల్లో పోరాడాం. వ్యక్తిగతంగా ఎప్పుడు పోలేదు. కాని ఇప్పుడు టీడీపీ అంటే పథకాలు కట్ చేసి భూములు లాక్కునే పరిస్థితికి దిగజార్చారు. నార్త్ కొరియాలో నవ్వినా, ఏడ్చినా, పండగ చేసుకున్నా కిమ్ కొడతాడు. అలాగే ఏపీలో జగన్ ఉన్నాడు.

సూపర్-6 దెబ్బకు వెలవెలబోతున్న నవరత్నాలు
మళ్లీ బాధుడు లేని రాష్ట్రం రావాలంటే కూటమి రావాలి. గంజాయి, జేబ్రాండ్స్ పోవాలంటే కూటమి రావాలి. యువత మేలుకో, ఉద్యోగాలు రావాలంటే కూటమి రావాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేది బాధ్యత నాది. మెగా డీఎస్సీమీదే మొదటి సంతకం. నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం. సంపద లేదు, నా వల్ల కాదని జగన్ అంటున్నారు. ఐదేళ్లల్లో నేనేం చేస్తానో చేసి చూపించి చరిత్ర తిరగరాసే బాధ్యత మాది. సమయం 12 రోజులే ఉంది. సైకిల్ ఎక్కి జనసేన, బీజేపీ జెండాలు పట్టుకొని ప్రజల్లో ఛైతన్యం తీసుకురావాలి.

హోంగార్డులకు న్యాయం చేస్తాం. ఇంటి వద్దనే ఫింఛన్ ఇస్తాం. సూపర్ సిక్స్ దెబ్బకి జగన్ నవరత్నాలు వెలవెల పోతున్నాయి. జగన్ ను చూస్తే పరిశ్రమలు పారిపోతున్నాయి. మహిళలకు నాలుగు కార్యక్రమాలు ఇస్తున్నాం. ప్రతి ఒక్క మహిళకు రూ.1,500 ఇస్తాం, అందరికి ఇస్తాం. రూ.15వేలు తల్లికి వందనం ఇస్తాం. నలుగురుంటే అందరికి ఇచ్చి చదివిస్తాను. చంద్రన్నే మా డ్రైవర్ అని మహిళలందరికి చెప్పండి. ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్లు ఇస్తాం. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. చేపలు పట్టడం నేర్పించి మీ ఆస్తులను పెంచుతాను. ఎలా సంపాదించాలో మార్గం చూపిస్తాను. కుల గణనే కాదు స్కిల్ గణన చేపిస్తాం. ఎవరెవరికి ఏ ఏ స్కిల్ ఉన్నాయో చూసి నేర్పిస్తాం.

ఎస్టీ మహిళను అవమానించారు
మున్సిపల్ ఛైర్మన్ వెంకట రమణ పార్టీ మారితే అవమాన పరిచారు. నెత్తిన రూ.1 పెడితే 5 పైసలు కూడా అమ్మదని యానాది మహిళను కించపరిచేలా మాట్లాడారు. కాని జగన్ రెడ్డి నెత్తిన రూ.1 పెడితే ఎవరైనా దుర్మార్గుడిని కొంటారా? మీ నాన్నే నిన్నే చూసి భయపడే బెంగుళూరు పంపారు. నీ తల్లికే నువ్వు అన్నం పెట్టని వాడు దేశాన్ని ఉద్దరిస్తాడా?. ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి పేరుకే కాని అసలు వెంటేశ్వరరెడ్డికి పెత్తనం. కాంట్రాక్ట్, ఇసుక, ఎర్రచందనం, లేఅవుట్స్ దోపిడీ చేస్తున్నారు. పెన్నానదిని దోచేస్తున్నారు.

ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో సొంతంగా కాంప్లెక్స్ లు కట్టుకుంటారు. సోమశిల హైలెవల్ కెనాల్ పూర్తి చేస్తాం. సోమశిల ఉత్తర, దక్షిణ కాల్వలకు లైనింగ్ పనులు చేయాలి. పరిశ్రమలు రావాలి. 4 లైన్లు రోడ్ కావాలి. 1,025 టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలి. ట్రామా కేర్ సెంటర్ 250 పడకల ఆసుపత్రిని కట్టాలి. ఆత్మకూరు అభివృద్ధి బాధ్యత మాది. జగన్ నొక్కే బటన్ మన ఇంట్లో అమ్మమ్మ, నాన్నమ్మ, చిన్న పిల్లలు కూడా నొక్కుతారు. కానీ ప్రజలు నొక్కే బటన్ మీ జీవితాలను మార్చేస్తుంది.

ఆనం వెంకట రమణ రెడ్డి, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించే బాధ్యత మీదే. రూ.500, రూ.1000, క్వార్టర్ బాటిల్, బిర్యానీలకు కక్కుర్తి పడితే మన పిల్లల జీవితం మారిపోతుంది. కొమ్మ లక్ష్మణ నాయడు, బొలినేని కృష్ణయ్య, విజయరామి రెడ్డి అందరూ పని చేస్తున్నారు. ధనుంజయ్ కూడా పార్టీలో చేరారు. మున్సిపాలిటీ నిధులు ఇస్తాం. పూర్వవైభవం తీసుకువస్తాను.’’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.

Leave a Reply