Suryaa.co.in

Editorial

లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్‌కు బెదిరింపు

– బైకులపై కారును వెంబడించిన ఆగంతకులు
– దారి మార్చినా వెంటాడిన ఆగంతకులు
– మాసార్ చెప్పినట్లు వినకపోతే చస్తావ ని బెదిరింపు
– ఎదురు ప్రశ్నలు వేస్తే చంపేస్తామని హెచ్చరిక
– జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌లో రాజేష్ ఫిర్యాదు
– ఆగంతుడి ఫొటో, బండి నెంబరు ఆధారాలిచ్చిన వైనం
– వెంటాడి ంది ప్రైవేటు గూండాలా? పోలీసులా?
– గతంలో ఎంపి రాజు వద్ద ఇలాంటి దృశ్యాలే
– ఏపీ పోలీసులను పట్టుకున్న రాజు సిబ్బంది
– కిలారు రాజేష్ ప్రాణాలకు ప్రమాదమా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కిలారు రాజేష్ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయా? రాజేష్ లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ప్రాణాలకు ముప్పు తలపెడుతున్నారా? ఆయనను దారికి తెచ్చుకునే యత్నంలో భాగంగా బెదిరింపులకు తెరలేపారా? అందులో భాగంగానే మాటవినకపోతే చంపేస్తామని బెదిరించారా? హైదరాబాద్ నగర నడిబొడ్డున జరిగిన ఈ దృశ్యాలు చూస్తే.. కచ్చితంగా అలాంటి అనుమానాలే రాకతప్పదు.

టీడీపీ కిలారు రాజేష్ ఈనెల 7న తన కుమారుడిని, స్కూల్ నుంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు కారులో బయలుదేరారు. ఆ సమయంలో కొందరు ఆగంతులు తన కారును వెన్నాడటం గమనించారు. వెంటనే తన భార్యకు ఫోన్ చేసి, స్కూలుకు వెళ్లి కుమారుడిని ఇంటికి తీసుకువెళ్లమని చెప్పారు. ఆగంతులను దారి మళ్లించే వ్యూహంలో భాగంగా కారును స్కూలు వైపునకు కాకుండా,మరో వైపు మళ్లించారు. కానీ ఆ దారిలో కూడా ఆగంతకులు తన కారును ఫాలో అవడాన్ని గ్రహించిన రాజేష్ కారును కొద్దిసేపు నిలిపి ఉంచారు.

బైకులోని వ్యక్తులు కిందికు దిగి, ఆయన వద్దకు రాగా కారు అద్దాలు దింపిన రాజేష్‌తో.. సార్ చెప్పింది చెయ్యకపోతే ఇబ్బందులో పడతావ్ అని హెచ్చరించారు. దానికి రాజేష్.. మీ సార్ ఎవరు? ఏం చేయాలి? అని ప్రశ్నించడంతో ఆగ్రహించిన ఆగంతకులు.. ఎక్కువ ప్రశ్నలు వేస్తే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయినట్లు, రాజేష్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ సంఘటనకు సంబంధించి తనను వెన్నాడిన ఒక వ్యక్తి ఫొటోతో పాటు, అతను ఉపయోంచిన టిఎస్ 12 ఏకె 8469 పల్సర్ నెంబరును ఫిర్యాదుతో జతపరిచారు. తనకు ప్రాణహాని ఉందని, కిలారు రాజేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులకు రాజేష్ ఇచ్చిన ఫొటో ఎవరిది? పోలీసులదా? ప్రైవేటు వ్యక్తులదా? అన్న దానిపై స్పష్టత రావలసి ఉంది.

గతంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో నివసించే వైసీపీ రెబెల్ ఎంపి రఘురామకృష్ణంరాజు నివాసం వద్ద జరిగిన ఒక ఘటన, ఏపీ పోలీసుల నిఘా తీరును బట్టబయలు చేసింది. ఏపీ నిఘా విభాగానికి చెందిన పోలీసులు.. ఎంపీ రాజు నివాసం ఎదురు అనుమానాస్పదంగా తచ్చాడుతుంటే, వారిని రాజు సిబ్బంది నిర్బంధించారు. ఆ సందర్భంలో తాము ఏపీ పోలీసులమని తన కార్డులు చూపించారు. దానిపై ఆగ్రహించిన రాజు.. పోలీసులు యూనిఫారం లేకుండా, బ్యాడ్జిలు లేకుండా ఏవిధంగా తన నివాసానికి వస్తారని ప్రశ్నించారు.

ఇప్పుడు మళ్లీ కిలారు రాజేష్ వ్యవహారం చూస్తుంటే, తమకు అలాంటి అనుమానాలే వస్తున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజేష్ ఫొటో తీసిన వ్యక్తి ఎవరో తెలిస్తే గానీ ఈ కేసులో మరింత స్పష్టత వచ్చే అవకాశం లేదు. నిజానికి రాజేష్ సీరియస్ రాజకీయ నాయకుడు కాదు. ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తి కాదు.

కాబట్టి ఆయనకు రాజకీయ ప్రత్యర్ధులు ఉండే అవకాశాలు లేవు. కేవలం చంద్రబాబు కుటుంబం, లోకేష్‌ను అంటిపెట్టుకుని ఉండే రాజేష్‌కు బయట ప్రపంచంతో అంత పెద్ద సంబంధాలు కూడా ఉండవు. అయితే జగన్ ప్రభుత్వం ఆయనపై భూముల కేసు సహా వివిధ కేసులు పెట్టింది. దానిపై రాజేష్ ఉన్నత న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్నారు.

LEAVE A RESPONSE