సంతోష్‌కు నోటీసుతో ఇక మోదీతో సమరమే!

– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు తెలంగాణ సిట్ నోటీసు
– ఈనెల 21న హాజరుకావాలని సంతోష్‌కు సిట్ అధికారుల హుకుం
– సంతోష్‌కు నోటీసు ఇచ్చారంటే మోదీ-అమిత్‌షాతో యుద్ధమే
– బీజేపీలో శక్తివంతమైన నేత సంతోష్
– పార్టీ-ప్రభుత్వంలో ఆయన తర్వాతనే మోదీ, అమిత్‌షా
– సంతోష్‌కు నోటీసు కవిత అరెస్టుకు ముందస్తు సంకేతమా?
-ఢిల్లీ లిక్కర్ స్కాంలో కూతురు అరెస్టును కేసీఆర్ ముందే ఊహించారా?
– ముందస్తు వ్యూహంలో భాగంగానే సంతోష్‌కు నోటీసు?
– రేపో మాపో కవితకూ ఈడీ నోటీసు ఖాయమేనా?
– తెలంగాణ పాలకుడు అన్నింటికీ తెగిస్తున్నారా?
– భవిష్యత్తులో మరిన్ని ఈడీ అరెస్టులు?
– ఎమ్మెల్యేల ఎర కేసులో టీఆర్‌ఎస్-బీజేపీ ఎత్తుపైఎత్తులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎమ్మెల్యేలకు ఎర కేసులో అంతా అనుకున్నట్లే జరుగుతోంది. కాకపోతే కాస్త అటు ఇటుగా! ఈడీ అధీనంలో ఉన్న రామచంద్ర పిళ్లై, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు విచారణలోపు.. ప్రతీకారచర్యగా బీజేపీ సుప్రీం బీఎల్ సంతోష్‌కూ.. తెలంగాణ సిట్ నోటీసు ఇవ్వవచ్చన్న, రాజకీయ వర్గాల అంచనా అక్షరాలా నిజమయింది.

అనుకున్నట్లే.. బీజేపీ జాతీయ అగ్రనేత సంతోష్‌కు తెలంగాణ సిట్ నోటీసు ఇచ్చింది. ఈనెల 21న విచారణకు హాజరుకాకపోతే, అరెస్టు చేస్తామని హెచ్చరించింది. ఆ మేరకు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసు ఇచ్చింది. అంటే.. మీరు వస్తారా? అరెస్టవుతారా? అని తెలంగాణ సర్కారు, బీజేపీని హెచ్చరించినట్లే లెక్క. కేరళ బీజేపీ నేత తుషార్, వైద్యుడు జగ్గుస్వామి, లాయర్ శ్రీనివాస్‌కూ అలాంటి హెచ్చరిక సంకేతమే పంపింది. దానితో నిబంధనల ప్రకారం బీజేపీ దిశానిర్దేశకుడయిన సంతోష్ ,సిట్ ముందు హాజరుకాక తప్పనిసరి పరిస్థితి. ఒకవేళ హాజరుకాకపోతే, ఆయన అరెస్టు తప్పదు. సిట్ నిబంధనల ప్రకారం 41ఏ నోటీసు ఇచ్చింది కాబట్టి, సంతోష్ సిట్ ముందుకు రాక తప్పదు. ఆ తర్వాత సంతోష్‌ను అరెస్టు చేస్తారా? లేదా? అన్నది ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో, ఈడీ వేసే అడుగుల బట్టే ఉంటుంది.

ఇక ఆ తర్వాతి వంతు కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టేనా? ఆమెకు రేపో మాపో ఈడీ నోటీసు ఇవ్వబోతోందా? ఆ తర్వాత అడుగు ఆమె అరెస్టేనా? కేసీఆర్ తన కుమార్తె అరెస్టును ముందస్తుగా ఊహించారా? అందుకే ఆయన బీజేపీపై రాజకీయాస్త్రం సంధించారా? ఇలా.. కేంద్రం ఆడుతున్న ఈడీ-సీబీఐ, తెలంగాణ సర్కారు ఆడుతున్న సిట్ ఆట సెమీ ఫైనల్‌కు చేరింది. ఎవరి పరిథిలో వారు వినియోగిస్తున్న అధికారాలతో, ఎవరు ముందుగా అరెస్టవుతారు? ఈ పరిణామాలు ఏ పార్టీకి లాభం? ఎవరికి నష్టం అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలయింది.

తెలంగాణ రాకీయాలపై పట్టు సాధించేందుకు అధికార టీఆర్‌ఎస్-ప్రతిపక్ష బీజేపీ ఆడుతున్న, టామ్ అండ్ జెర్రీ ఆట.. బీజేపీ జాతీయ అగ్రనేత బీఎల్ సంతోష్‌కు నోటీసు జారీతో, సెమీఫైనల్‌కు చేరినట్లే కనిపిస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీకి దిశానిర్దేశం చేసే ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధిగా ఉన్న సంతోష్‌కు నోటీసు ఇవ్వడం ద్వారా, తెలంగాణ సీఎం కేసీఆర్ పెద్ద సాహసమే చేశారన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఎందుకంటే.. బీఎల్ సంతోష్ బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా కంటే బయట ప్రపంచానికి తెలియని అత్యంత శక్తిశాలి. ఆర్‌ఎస్‌ఎస్ తరఫున పార్టీకి దిశానిర్దేశం చేసే, జాతీయ సంఘటనా మహామంత్రి. అలాంటి శక్తిశాలికి కేసీఆర్ సర్కారు నోటీసు ఇవ్వడమంటే, బీజేపీతో అమీతుమీకి సంకేతాలిచ్చినట్లే లెక్క.

నిజానికి బీజేపీలో సంతోష్ పాత్ర ఏమిటన్నది తెలిసినవారెవరూ, ఆయన వైపు చూసేందుకే భయపడతారు. అలాంటిది కేసీఆర్ సర్కారు, ఆయన ఏకంగా విచారణకు హాజరుకాకపోతే అరెస్టు చేస్తామన్న నోటీసే ఇచ్చింది. ఆ ప్రకారంగా.. ఇది కేసీఆర్ అన్నింటికీ సిద్ధపడి చేసిన సాహసంగానే పరిగణించాలన్నది రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య.

ప్రస్తుతం టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య జరుగుతున్న యుద్ధంలో.. కేంద్రానికి ఈడీ-సీబీఐ, రాష్ట్రంలోని కేసీఆర్ సర్కారుకు సిట్.. అస్త్రాలుగా మారినట్లు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నారు. కేంద్రం అధీనంలోని ఈడీ చేతిలో కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం, తెలంగాణలో మైనింగ్ ఎగుమతులు, సినిమాల్లో కవిత పెట్టుబడుల కేసులు ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణలో కేసీఆర్ సర్కారు చేతిలో ఎమ్మెల్యేల ఎర కేసు ఉంది.

అంటే ఈడీ ఒక అడుగు ముందుకేస్తే, సిట్ రెండడుగులు ముందుకేస్తుందని అర్ధమవుతూనే ఉంది. సినీ దర్శకుడు పూరీ జగన్నాధ్, చార్మిని సినిమా పెట్టుబడుల కేసులో, ఈడీ ఇప్పటికే విచారిస్తోంది. లైగర్ సినిమాతోపాటు, పూరీ తీస్తున్న మరో సినిమాకు, కేసీఆర్ కూతురు కవిత పెట్టుబడులు పెట్టారన్నది ఈడీ అనుమానం.

దానితోపాటు, చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసులో మంత్రి తలసాని సోదరులు, ఆయన పీఏతోపాటు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణనూ ఈడీ విచారిస్తోంది. దీనికి సంబంధించి ఇంకా ఎంతమందిని, విచారణకు పిలుస్తారన్నది సస్పెన్స్‌గా మారింది. అదే సమయంలో మైనింగ్ కేసులో, మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని ఈడీ సోదా చేసింది. అదే కేసులో మైనింగ్ కంపెనీల నుంచి, కోటిరూపాయలకు పైగా నగదు స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఈడీ.. కరీంనగర్ నుంచి కృష్ణపట్నం పోర్టు వరకూ విచారణ జరుపుతోంది.

ఈ పరిణామాల తర్వాత.. ఇక తర్వాతి వంతు, సీఎం కేసీఆర్ కుమార్తె కవితదేనన్న చర్చ రాజకీయవర్గాల్లో మొదలయింది. ఈలోగా అప్రమత్తమయిన కేసీఆర్ సంధించిన సిట్ అస్త్రం, నేరుగా బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్‌కు తగలడంతో వేడి రాజుకుంది. నిజానికి కేసీఆర్ అంత సాహసం చేస్తారని బీజేపీ ఊహించలేదు. సంతోష్‌ను ఈనెల 21న విచారణకు హాజరుకావాలని సిట్ ఆదేశించింది. ఒకవేళ హాజరుకాకపోతే అరెస్టు తప్పదని స్పష్టం చేసింది.

ఎమ్మెల్యేల ఎర కేసులో.. ఇప్పటికే బీజేపీ ప్రతినిధులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్‌శర్మ, సింహయాజులు, నందకుమార్‌ను తెలంగాణ సర్కారు ఇప్పటికే అరెస్టు చేసింది. ఈలోగా ఈడీ ఆలోచనలు పసిగట్టిన కేసీఆర్ సర్కారు.. కేరళ వెళ్లి, బీజేపీ నేత తుషార్, వైద్యుడు జగ్గును విచారించింది. ఫాంహౌస్‌లో జరిగిన ఎమ్మెల్యేలకు ఎర ఎపిసోడ్ సంభాషణలో, మధ్యవర్తిగా ఉన్న రామచంద్రప్రభు నోటి నుంచి వీరి పేర్లు దొర్లాయి. దానితో సిట్ వారినీ విచారించింది.

ఇక కవిత అరెస్టుపై, రాజకీయవర్గాల్లో మొదటి నుంచి చర్చ జరుగుతోంది. అదే సమయంలో బీజేపీ జాతీయ అగ్రనేత సంతోష్ అరెస్టుపైనా, అదే స్థాయిలో చర్చకు తెరలేచింది. అయితే కవిత అరెస్టు వ్యవహారం, ఈడీ తీసుకునే చర్యలబట్టే ఉంటుందన్న చర్చ కూడా రాజకీయవర్గాల్లో జోరుగా సాగింది. ఆ క్రమంలో అందుకు తగినట్లే.. సంతోష్‌కు సిట్ నోటీసు ఇచ్చింది.

ఆ ప్రకారంగా.. దెబ్బతిన్న కేంద్రం రేపో-మాపో కవితను కూడా ఈడీ విచారణకు పిలిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం, సినిమాల్లో పెట్టుబడిపై విచారణకు పిలిచే ఈడీ.. తర్వాత కవితను అరెస్టు చేస్తుందన్న ఊహాగానాలకు తెరలేచింది. నిజంగా అదే జరిగితే.. సిట్ కూడా ప్రతీకార చర్యగా సంతోష్‌ను అరెస్టు చేయవచ్చన్న చర్చ జరుగుతోంది.

అంటే.. ప్రస్తుతం ఈడీ అధీనంలో ఉన్న ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, రామచంద్రపిళ్లైలలో ఎవరిని అరెస్టు చేసినా, సిట్ అడుగు అదే దారిలో ఉండబోతోందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ వారి వాంగ్మూలం ఆధారంగా కవితను అరెస్టు చేస్తే, 21న విచారణకు హాజరయ్యే సంతోష్‌ను కూడా అరెస్టు చేసే ప్రమాదం లేకపోలేదన్న చర్చ జోరుగా సాగుతోంది.

అయితే.. 41 ఏ నోటీసు ఇచ్చింది అరెస్టు చేయడానికి కాదని, సంతోష్‌ను అరెస్టు చేయవద్దంటూ తాజాగా హైకోర్టు ఆదేశించడం బీజేపీకి కొంత ఊరటే. అసలు నోటీసునే రద్దు చేయాలంటూ బీజేపీ చేసిన వాదనను హైకోర్టు పట్టించుకోకపోవడం మరోవైపు బీజేపీకి నిరాశగానే భావించవచ్చు.

Leave a Reply