Suryaa.co.in

Editorial

‘సీమ’లో ‘తమ్ముళ్ల’ సమరోత్సాహం

– బాబు మూడురోజుల కర్నూలు టూర్‌ సూపర్‌హిట్‌
– ఈసారి జనసమీకరణ చేయని కర్నూలు జిల్లా నేతలు
– అయినా బాబు పర్యటనలో పోటెత్తిన జనప్రవాహం
– ఐదు నియోజకవర్గాల్లో అనూహ్య జనస్పందన
– మహిళల రాకపైకర్నూలు జిల్లా తమ్ముళ్ల ఖుషీ
– ఎన్టీఆర్‌ తర్వాత ఆ స్థాయిలో జనం రావడంపై తమ్ముళ్ల జోష్‌
– గతంలో బాబు పర్యటనలకూ ఇంతమంది రాలేదంటున్న తమ్ముళ్లు
– జనస్పందనకు చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి
– అంచనాలకు మించి జనం వచ్చారంటున్న టీడీపీ నేతలు
– మేడలు, మిద్దెలు, చెట్లు ఎక్కిన సంకేతాలపై నేతల ఆనందం
– అది ప్రభుత్వ వ్యతిరేక సంకేతాలని సీనియర్ల విశ్లేషణ
– కర్నూలు జిల్లా తమ్ముళ్లకు టానిక్‌గా మారిన బాబు పర్యటన
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా పర్యటన తెలుగుతమ్ముళ్లకు టానిక్‌లా మారింది. బాబు మూడురోజుల కర్నూలు జిల్లా పర్యటనలో.. అంచనాలకు మించి, జనం పోటెత్తడంతో టీడీపీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. గతంలో ఎన్టీఆర్‌ తర్వాత, ఈ స్థాయిలో ఇప్పుడే అంతమంది జనప్రవాహహాన్ని చూశామని టీడీపీ నేతలు సంబరపడిపోతున్నారు. జనసమీకరణ చేయకుండానే అంతమంది తరలిరావడమే వారి ఆశ్చర్యానికి కారణంగా కనిపిస్తోంది. చంద్రబాబు పర్యటన గంటలపాటు ఆలస్యమయి.. రాత్రి అయినప్పటికీ జనం ఓపికగా ఎదురుచూస్తారని, తాము అంచనా వేయలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.

చివరకు చంద్రబాబు సైతం తాను అనేకసార్లు ఆ మార్గంలో పర్యటించినప్పటికీ, ఈ స్ధాయిలో స్పందన ఎప్పుడూ కనిపించలే దని అంగీకరించారు. అంటే బాబు మూడు రోజుల కర్నూలు జిల్లా పర్యటనలో జనం ఏ స్థాయిలో పోటెత్తారో స్పష్టమవుతుంది. మొత్తం ఐదు నియోజకవర్గాల్లో జరిగిన బాబు సభలు, రోడ్‌షోలకు దాదాపు 7 నుంచి 8 లక్షల మంది హాజరయి ఉంటారన్నది పార్టీ వర్గాల అంచనా.

కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆలూరు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సభలు, రోడ్‌షో సూపర్‌హిట్‌ అవడంతో.. తమ్ముళ్లలో సమరోత్సాహం తొంగిచూసింది. కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి పత్తికొండకు వెళ్లడానికి చంద్రబాబు కాన్వాయ్‌కు, దాదాపు 8cbn1గంటలు పట్టింది. దారిపొడవునా ప్రజలు బాబు కాన్వాయ్‌ను ఆపి, నీరాజనాలు పట్టడం అటు చంద్రబాబునూ విస్మయపరిచింది. అసలు షెడ్యూల్‌ లేని చోట కూడా, అర్ధగంట సేపు బాబు ఆగవలసివచ్చిందంటే.. జనం ఏ స్ధాయిలో విరగబడ్డారో ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు.

చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు, వివిధ సంఘాలు ప్రయత్నించినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ఒకవైపు మూడు రాజధానుల మద్దతుగా, వైసీపీ అనుకూల వర్గాలు ఆందోళనలు నిర్వహిస్తే.. అదే మూడు రాజధానులు వద్దంటూ, చంద్రబాబు కర్నూలు జిల్లా ప్రజలతో చెప్పించారు. రోడ్లు వేయించలేని జగన్‌, మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారన్న ప్రశ్నను బాబు ప్రతి సభలోనూ ప్రశ్నించారు.

దాన్నిబట్టి తన సభలకు హాజరయిన జనాలను చూసి చంద్రబాబు ఏ స్థాయిలో రెచ్చిపోయారో అర్ధమవుతుంది. తమకు మూడు రాజధానులు వద్దంటూ.. వచ్చిన జనంతో చెప్పించడం ద్వారా, వైసీపీ అనుకూల వర్గాల వాదనకు బలం లేదన్న సంకేతాలు పంపించడంలో, బాబు సఫలమయినట్లే కనిపిస్తోంది. బాబు ప్రసంగించిన ప్రతిచోటా, విశాఖను దోచుకునేందుకే జగన్‌ అక్కడ రాజధాని పెడతానంటున్నారన్న విషయాన్ని ప్రచారం చేయగలిగారు.

ఇక బాబు సభలకు మహిళలు పెద్ద సంఖ్యలో రావడంపై తమ్ముళ్లు సంబరపడుతున్నారు. బాబు రోడ్‌షోకు హాజరయిన మహిళలు ఆయన వద్దకు వెళ్లి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం, కొన్ని చోట్ల పూలుచల్లడం వంటి ఘటనలు.. వైసీపీ సర్కారుపై మహిళల అసంతృప్తికి నిదర్శనమేనని పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

బాబును చూసి, ఆయన ప్రసంగం వినేందుకు మేడలు, మిద్దెలు, చెట్లు, చివరకు భూమిలో పాతిన కర్రలపైనా నిల్చుని రాత్రి వరకూ కదలకుండా ఉన్నారంటే ఇక ఈ ప్రభుత్వానికి ఇవి చివరిరోజులనే అర్ధమని కేంద్రమాజీమంత్రి, టీడీపీ పోలిట్‌బ్యూరోసభ్యుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తనcbn2 జీవితంలో ఎన్నో మీటింగులు ఏర్పాటుచేశామని, కానీ ఈ స్థాయిలో ఎప్పుడు అంతమంది జనం హాజరయిన దాఖలాలు లేవని స్పష్టం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ తర్వాత తమ జిల్లాలో, ఆ స్ధాయిలో జనం వచ్చిన సంఘటన ఇదేనని వివరించారు. వచ్చిన మహిళల స్పందనబట్టి, వైసీపీ సర్కారుపై ఏ స్థాయిలో మహిళలు వ్యతిరేకంగా ఉన్నారో స్పష్టమవుతోందని కోట్ల విశ్లేషించారు.

గతంలో చంద్రబాబు సీఎం, విపక్ష నేతగా ఉన్నప్పుడు.. అదే మార్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహించినా, ఈస్థాయిలో జనం వచ్చిన దాఖలాలు లేవని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అదే విషయాన్ని స్వయంగా చంద్రబాబు కూడా అంగీకరించారంటే, ర్నూలు జిల్లా పర్యటన అధినేతను ఏ స్థాయిలో సంతృప్తిపరిచిందో స్పష్టమవుతుంది. తర్వాత విజయవాడ వచ్చిన చంద్రబాబు.. తన కర్నూలు జిల్లా పర్యటన గురించి కార్యకర్తలకు వివరించారు.

బాబు పర్యటనలో రెండు చోట్ల మాత్రమే జనసమీకరణ చేయగా, మిగిలిన అన్ని చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చినట్లు ఓ సీనియర్‌ నేత వెల్లడించారు. తాము కేవలం తమ నియోజకవర్గాల నుంచి వచ్చిన వారికి భోజనాలు మాత్రమే పెట్టామని ఆ నేత వివరించారు. మొత్తానికి చంద్రబాబు సీమ పర్యటన , తమ్ముళ్లలో సమరోత్సాహం నింపే టానిక్‌ మాదిరిగా పనిచేసినట్లు వారి సమరోత్సాహమే స్పష్టం చేస్తోంది.

LEAVE A RESPONSE