సిటీ సెటిలర్లపై ‘కమలం’ కన్ను?

– కేసీఆర్‌ రద్దు చేసిన బీసీ కులాలపై కమలం సమరం
– తెలంగాణలో 26 ఆంధ్రా బీసీ కులాలకు రిజర్వేషన్‌ తొలగింపు
– రాష్ట్ర విభజన తర్వాత మూడు నెలలకే కేసీఆర్‌ జీఓ
– దానివల్ల ఉత్తరాంధ్ర బీసీలకు అన్యాయం
– దశాబ్దాల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడిన ఉత్తరాంధ్ర బీసీలు
– తాజాగా వారి కోసం కదం తొక్కనున్న కమలదళం
-గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చిన బీజేపీ తెలంగాణ బీజేపీ నేతలు
– సెటిలర్లపై కేసీఆర్‌ సర్కారుకు ఎందుకంత కక్ష అని కమలం కన్నెర్ర
– సెటిలర్ల కడుపు కొడుతున్నారని ఆగ్రహం
– ఎనిమిదేళ్ల తర్వాత కమలం కదనానికి కారణమేమిటి?
– సెటిలర్లను సంతృప్తిపరచడమే బీజేపీ వ్యూహమా?
– టీడీపీ స్థానం ఆక్రమించేందుకు వ్యూహం సిద్ధం
– ఇప్పటిదాకా ఆంధ్రా సెటిలర్లపై దృష్టి సారించని బీజేపీ
– గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు జైకొట్టిన ఆంధ్రా సెటిలర్లు
– ఆ ఎన్నికల్లో బీజేపీని బలపరచని టీడీపీ ఓటర్లు
– దానితో వ్యూహం మార్చి ఆంధ్రా బీసీలపై దృష్టి పెట్టిన బీజేపీ
– శిక్షణా శిబిరంలో జీవీఎల్‌ చేసిన సూచనతో రంగంలోకి దిగిన బీజేపీ ఓబీసీ సెల్‌
– బీసీ కులాల రద్దుపై పోరాటానికి కమలం సమరం
( మార్తి సుబ్రహ్మణ్యం-హైదరాబాద్‌)

హైదరాబాద్‌ నగరంలో టీడీపీ స్థానాన్ని ఆక్రమించేందుకు బీజేపీ అడుగులు వేస్తోందా? ఆంధ్రా సెటిలర్లపై కమలదళం కన్నేసిందా? ఇప్పటిదాకా సిటీ సెటిలర్లను పట్టించుకోని బీజేపీ, తాజాగా ఉత్తరాంధ్ర బీసీలను దరిచేర్చుకునే వ్యూహానికి పదునుపెడుతోందా? కేసీఆర్‌ సర్కారు ఎనిమిదేళ్ల క్రితం రద్దు చేసిన 26 ఆంధ్రా బీసీ కులాల రిజర్వేషన్ల రద్దును వ్యతిరేకిస్తూ, హటాత్తుగా ఎనిమిదేళ్ల తర్వాత రంగంలోకి దిగడంలో మతలబు అదేనా? తాజాగా తెలంగాణ గవర్నర్‌ తమిళసైను కలిసి, వినతిపత్రం ఇచ్చిన బీజేపీ అసలు లక్ష్యం అదేనా?

ఉమ్మడి రాష్ట్రం ఉన్నంత వరకూ కొనసాగిన ఉత్తరాంధ్రకు చెందిన 26 కులాల రిజర్వేషన్లను, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ సర్కారు రద్దు చేసింది. ఆయన సీఎం కాగానే మూడు నెలలకే తీసుకున్న నిర్ణయమది. దానిపై ఏపీ బీసీ సంఘాలు అప్పట్లో విమర్శలు కురిపించాయి. కానీ తెలంగాణ బీసీ కులాలు స్పందించలేదు. ఇది జరిగి ఎనిమిదేళ్లయింది. అప్పుడు ఏ రాజకీయపార్టీ కేసీఆర్‌ నిర్ణయంపై పెదవి విప్పలేదు. కానీ హటాత్తుగా కమలదళం దానిపై రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రా సెటిలర్ల పక్షాన రంగంలోకి దిగిన బీజేపీ వ్యూహం… దానికి కారణాలేమిటో చూద్దాం.

తెలంగాణపై పట్టు సాధించేందుకు తన ముందున్న అన్ని మార్గాల్లో దూసుకువెళుతున్న బీజేపీకి, తాజాగా సెటిలర్ల అస్త్రం అందివచ్చింది. తెలంగాణలో ఇప్పుడిప్పుడే విస్తరించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి.. హైదరాబాద్‌ నగరంలో దశాబ్దాల క్రితమే స్థిరపడిన, 26 బీసీ కులాల అంశం ఆయుధంగా దొరికింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదిలోనే ఉత్తరాంధ్రకు చెందిన 26 బీసీ కులాల రిజర్వేషన్లను రద్దు చేస్తూ, 14 ఆగస్టు 2014న జీఓ 3 విడుదల చేసింది. నిజానికి ఉత్తరాంధ్ర మూలాలు ఉన్న, ఈ 26 కులాలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నంతవరకూ బీసీ ఫలాలు అనుభవించాయి.

రాష్ట్రం విడిపోయిన సంవత్సరంలోనే ఉత్తరాంధ్రకు చెందిన 26 బీసీ కులాలను, తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితా నుంచి తొలగించారు. దానితో దశాబ్దాల నుంచి ఆ కులాలు అనుభవిస్తున్న ఫలాలు ఆగిపోయాయి. ప్రైవేట్‌ కాలేజీ, స్కూళ్లు, ఇతర రంగాల్లో వారు అప్పటివరకూ అనుభవించిన సౌకర్యాలు నిలిచిపోయాయి. దానితో తెలుగుదేశం పార్టీ, కేసీఆర్‌ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకించింది. కానీ తెలంగాణలోని బీసీ సంఘాలు ఆ నిర్ణయంపై పెద్దగా స్పందించలేదు. బీసీ జాబితాలో ఏ కులాలను చేర్చాలన్న అంశం ఆయా రాష్ట్రాలదే కాబట్టి, ఈ అంశంలో కేంద్రంలోని బీజేపీ కూడా పట్టించుకోలేదు.

ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో.. మూడురోజులపాటు బీజేపీ నిర్వహించిన శిక్షణా శిబిరాల్లో, ఆ పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మీడియాతో సంబంధాలపై ప్రసంగించారు. ఆ సందర్భంలో ఆయన.. రద్దయిన 26 బీసీ కులాల గురించి ప్రస్తావించారు. సామాజికన్యాయం అజెండాతో ఈ అంశాన్ని ఆయా కులాల వారి వద్దకు తీసుకువెళ్లాలని సూచించారు.

దానితో బీజేపీ ఓబీసీ మోర్చా రంగంలోకి దిగింది. ఓబీసీ జాతీయ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలో.. ఓబీసీ నేతలు తెలంగాణ గవర్నర్‌ తమిళసైను కలిశారు. రద్దు చేసిన 26Fi-Ua-R4-Hac-AALR6n కులాలను పునరుద్ధరించి, వాటిని బీసీ సంక్షేమ శాఖలో చేర్చాలని కోరారు. నిజానికి, ఈ అంశంపై ఎంపీలు జీవీఎల్‌, లక్ష్మణ్‌ గత పదిరోజుల క్రితమే, ఆంధ్రా సెటిలర్లను ఆకర్షించే అంశంపై చర్చించినట్లు సమాచారం.

కాగా హైదరాబాద్‌ నగరంలో.. దశాబ్దాల క్రితమే స్థిరపడిన లక్షలాదిమంది ఆంధ్రా సెటిలర్లు, తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి మానసిక మద్దతుదారుగా కొనసాగుతున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయిన తర్వాత, ఆ పరిస్థితి కొంతమారి, రాయలసీమ వాసులు కాంగ్రెస్‌ మద్దతుదారుగా మారారు. ఆ ప్రకారంగా హైదరాబాద్‌లోని సెటిలర్లు అప్పట్లో తెలుగుదేశం, కాంగ్రెస్‌ వైపు నిలిచారే తప్ప, మిగిలిన పార్టీల వైపు చూడలేదు. నగరంలో కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌ వంటి నియోజకవర్గాల్లో టీడీపీ, ఆ పార్టీ మద్దతునిచ్చిన బీజేపీ గెలిచిన సందర్భాలున్నాయి.

విభజన తర్వాత చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా వెళ్లిపోవడంతో, తెలంగాణలో.. ప్రధానంగా, హైదరాబాద్‌ నగరంలో ఆ పార్టీ కార్యకలాపాలు తగ్గిపోయాయి. విభజన తర్వాత కూడా టీడీపీకి 15, ఆ పార్టీ కలసిపోటీ చేసిన బీజేపీకి 5 స్థానాలు రావడం విశేషం. అవన్నీ హైదరాబాద్‌ పరిసరాల్లోని నియోజవర్గాలే అన్నది గమనార్హం. అయినా ఓటుకు నోటు కేసు తర్వాత, టీడీపీ నాయకత్వం తెలంగాణను పార్టీని దాదాపు వదిలేసింది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో స్థిరపడిన సెటిలర్లు.. అనివార్య పరిస్థితిలో, టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ నాయకత్వం కూడా వారికి ఎమ్మెల్యే- కార్పొరేటర్‌ సీట్లు వారి నిష్పత్తిFi-Ua-Sfna-UAAg-DBD మేరకు ఇచ్చి, సెటిలర్లను మెప్పించింది. గత గ్రేటర్‌ ఎన్నికల్లో.. ఆంధ్రా సెటిలర్లు ఉన్న అన్ని డివిజన్లలో టీఆర్‌ఎస్‌ గెలిస్తే, తెలంగాణ జిల్లాల నుంచి స్థిరపడిన వారు నివసించే డివిజన్లు బీజేపీకి జై కొట్టాయి.

ఆ రకంగా బీజేపీ-కాంగ్రెస్‌ విస్మరించిన ఆంధ్రా సెటిలర్ల ప్రాధాన్యం తెలిసిన బీజేపీ.. హ టాత్తుగా వ్యూహం మార్చి, బీసీల అంశాన్ని లేవనెత్తడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ లేవెత్తిన అంశం ఎనిమిదేళ్ల క్రితం నాటిదే అయినప్పటికీ, సుమారు 50 లక్షల సంఖ్యలో ఉన్న బీసీ బాధితులు, బీజేపీ వైపు మొగ్గు చూపేందుకు ఆ అంశం కారణమవుతుంది. ఈ అంశం కేంద్ర పరిథిలో లేనందున, రాష్ట్ర స్థాయిలో పోరాడాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా ఆంధ్రా బీసీ కులాల బాధితులను ముందుంచి, తెరవెనుక మద్దతునిచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు, సెటిలర్లు టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపుతున్న వైనం పరిశీలించిన బీజేపీ నాయకత్వం.. ఇకపై సెటిలర్లనూ తమ శాశ్వత ఓటు బ్యాంకు చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు, తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
Representation-to-HER-Excellency-the-Governor-of-Telangana-24-Nov-2022

Leave a Reply