బీజేపీ ‘బియ్యం స్లోగన్’ బూమెరాంగ్

– బియ్యం బదులు నగదు వద్దని సోము డిమాండ్
– అది కేంద్ర పథకమేనంటూ వైసీపీ ఎదురుదాడితో ఉక్కిరిబిక్కిరి
– కేంద్ర పథకం వద్దంటున్న సోము తీరుపై తలపట్టుకుంటున్న బీజేపీ సీనియర్లు
– కిలో 40 రూపాయల చొప్పున నగదు ఇవ్వాలన్న బీజేపీ నేత లంకా దినకర్
( మార్తి సుబ్రహ్మణ్యం)

సొంత పార్టీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధానాలనే వ్యతిరేకిస్తున్న తమ పార్టీ అధ్యక్షుడి తీరుపై బీజేపీ నేతలు తలపట్టుకుంటున్నారు. రాష్ట్రంలోని రేషన్‌కార్డు దారులకు బియ్యం బదులు నగదు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు దానికి సంబంధించిన ఫైలుపై పౌరసరఫరాల శాఖ మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన కారుమూరు నాగేశ్వరరావు తొలి సంతకం చేశారు. అయితే, దీనిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుపట్టారు. ఇది పేద ప్రజలపై కుట్రగా అభివర్ణించారు. అదే పార్టీకి చెందిన లంకా దినకర్ మాత్రం.. కిలో 40 రూపాయల చొప్పున నగదు ఇవ్వాలన్న కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకురావడం మరో విశేషం. ఈవిధంగా ఒకే పార్టీలో రెండు డిమాండ్లు వినిపించడం.. పైగా కేంద్ర విధానాన్ని పార్టీ అధ్యక్షుడే విమర్శిస్తుండటంతో పార్టీ నేతలు తలపట్టుకోవలసి వస్తోంది.

జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవలి కాలంలో విరుచుకుపడుతున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేదలకు వ్యతిరేకమని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సీపీఐ దారిలోనే… రేషన్‌కార్డులు ఎత్తేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే.. దీనిపై ర ంగంలోకి దిగిన వైసీపీ సర్కారు చేస్తున్న ఎదురుదాడితో బీజేపీ నేతల వద్ద జవాబు లేక బిక్కమొహం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

YCP-minister-sensational-comments-on-Somu-Veerraju‘‘బియ్యానికి నగదు వద్దంటున్న సోము వీర్రాజు ఓసారి వాస్తవాలు గ్రహించాలి. ఇది 2017లో బీజేపీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వమే తీసుకువచ్చిన విధానం. ఆరోగ్యరీత్యా చాలామంది బియ్యం వాడరు. దానిబదులు ముడిబియ్యం, రాగులు, సజ్జలకు ప్రాధాన్యం ఇస్తారు. అందుకే కేంద్రం రేషన్‌కార్డుదారులందరికీ న్యాయం చేయాలనే సదుద్దేశంతో ఈ విధానం తీసుకువచ్చింది. ఆ మేరకు దానిని చండీఘడ్, పాండిచ్చేరి, దాద్రానగర్ హవేలి వంటి కేంద్రపాలిత రాష్ట్రాలు అమలుచేస్తున్నాయి. అయితే ఈ పథకం తప్పనిసరి కాదు. వినియోగదారులు వద్దంటే బియ్యమే ఇస్తారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిద’ని మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, బీజేపీ అధ్యక్షుడికి ఘాటైన చురకలు అంటించారు. అయినా ఆయన అదే విమర్శలు కొనసాగిస్తుండటం ప్రస్తావనార్హం.

అసలు ఇలాంటి కేంద్ర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే వ్యతిరేకిస్తాయని, కానీ ఏపీ ప్రభుత్వమే దీనిని అమలుచేస్తుంటే అభినందించాల్సింది పోయి, విమర్శలు చేయడమే ఆశ్చర్యంగా ఉందని అటు వైసీపీ నేతలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కాగా దీనిపై బీజేపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వమే 2017లో రూపొందించిందని, ఆహారభద్రత కోసం కేంద్రం ఇప్పటికే 2 లక్షల కోట్లరూపాయలకు పైగా ఖర్చు పెడుతోందని బీజేపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ‘తమ పార్టీ అధికారంలో ఉన్న కేంద్రం రూపొందించే విధానాలు కూడా తెలుసుకోకుండా, మీడియాలో పేరు కోసం ఏదో ఒకటి మాట్లాడి పార్టీని ఇరికించడం వల్ల.. తమ లాంటి నాయకులు మీడియా వద్ద దొరికిపోతున్నార’ని ఉత్తరాంధ్రకు చెందిన ఓ బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

‘ ఈ పథకాన్ని విమర్శించేందుకు చాలా మార్గాలున్నాయి. కేంద్రం ఇచ్చే నిధులను మిగుల్చుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం కిలో బియ్యం 40 రూపాయలకో, 42 రూపాయలకో ఇవ్వాలని డిమాండ్ చేయాలే తప్ప.. అసలు పథకాన్నే విమర్శిస్తే అది సొంత బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్నే విమర్శించినట్టవుతుంద’ని ఆ నేత విశ్లేషించారు. కాగా బీజేపీ నేత లంకా దినకర్ తాజాగా.. బియ్యం కేజీని 16 రూపాయలకు బదులు 40
dinakar-tweet రూపాయలు ఇవ్వాలని, కేంద్రం ఇచ్చే నిధులను పూర్తిగా ప్రజలకే ఖర్చు పెట్టాలని డిమాండ్ చేయడం విశేషం.

కాగా, సోము వీర్రాజు సొంత పార్టీ అధికారంలో ఉన్న కేంద్రప్రభుత్వ విధానాలకే వ్యతిరేకంగా మాట్లాడటంపై, పార్టీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోము విమర్శలపై మంత్రి నాగేశ్వరరావు ఎదురుదాడి చేసిన తర్వాత, బీజేపీ నుంచి కనీస స్థాయిలో ప్రతిఘటన కనిపించలేదంటే… ఈ అంశంపై ఆ పార్టీ నేతలు ఏ స్థాయిలో ఆత్మరక్షణలో పడ్డారో స్పష్టమవుతోంది. ‘ కేంద్రపథకాలపై నిరంతరం అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో వివరాలు తెప్పించుకుని, వాటిని పార్టీ నాయకులకు అందించి రాష్ట్ర ప్రభుత్వంపై ఎదురుదాడికి నాయకత్వం వహించాలి. దానికి ఢిల్లీలో ఒక సమన్వయకర్తను నియమించుకోవాలి. గతంలో ఇది జరిగింది. ప్రధానంగా ఆర్ధికశాఖలో ఏం జరుగుతోందో నిఘా వేయించి, సర్కారును ఇరుకునపెట్టాలి. ఇవన్నీ అధికారం లేని తెలుగుదేశం పార్టీ చేస్తోంది. కానీ కేంద్రంలో అధికారంలో ఉండీ, తాము మాత్రం కేవలం ప్రెస్‌మీట్లకు, కోడిగుడ్లపై విమర్శలకు పరిమితమవుతున్నా’మని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply