Suryaa.co.in

Features

వైద్యో నారాయణో హరి..!

అవి నేను ఇస్రోలో పని చేస్తున్న రోజులు..ఓ రోజు భువనేశ్వర్ నుంచి మా నాన్న ఫోన్..ఉన్నపళంగా బయలుదేరి ఇంటికి రమ్మని..నేను అప్పటికి పని మీద చెన్నైలో ఉన్నాను.గబగబా సామాను సర్దుకుని రూం ఖాళీ చేసి సెంట్రల్ స్టేషన్ కి చేరుకున్నాను.అసలే వేసవి..రైళ్లు కిటకిటలాడుతున్నాయి..
అసలు స్టేషనే జనసంద్రంలా ఉంది. ఇంతలో రైలు రానే వచ్చింది..కాలు మోపడానికి కూడా జాగా లేదు.. ఏసి టికెట్ దొరకడం అసాధ్యం..ఇక జనరల్ భోగీ సంగతి ప్రత్యేకంగా చెప్పాలా..
సరే ఏమైతే అయిందని ఎదురుగా కనిపిస్తున్న స్లీపర్ కోచ్ ఎక్కేసాను..నడుం మోపడానికి అవకాశం ఉంటుందేమో చూస్తూ ఓ పెద్దాయనని కాస్త సర్థుకోమని సగం ఆశతోనే అడిగాను.ఆయన వెంటనే నవ్వు ముఖంతో పక్కకి జరిగి కూర్చోమంటూ చోటు చూపించాడు..రైలు నిండు చూలాలిలా కదిలినా చూస్తుండగానే జోరందుకుంది..

తోటి ప్రయాణీకులు అందరూ ఎవరి జాగాల్లో వారు సర్దుకుని తిండి తినే ప్రయత్నంలో పడ్డారు.
నా పక్కన పెద్దాయన తన బాగ్ లోంచి టిఫిన్ పాకెట్ తీసి కాస్త షేర్ చేసుకుంటారా అని అడిగాడు.. రైల్లో అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలు తినవద్దనే హెచ్చరికలు బాగా గుర్తున్న నేను సున్నితంగానే తిరస్కరిస్తూ నా బాగ్ లోంచి అంతకు ముందే స్టేషన్లో కొనుక్కున్న శాండ్విచ్ తీసి తింటున్నాను.
పెద్దాయన మాట కలిపాడు.

తాను చెన్నైలోనే ఉంటానని,సెలవు దొరికినపుడు సొంతూరు వెళ్లి తల్లిదండ్రుల్ని.. పరిచయస్తులను చూసి వస్తుంటానని ఆయన చెప్పారు.ఆయన ఏం చేస్తుంటారని నేను అడగలేదు. కాని ఆయన నన్ను అడిగాడు.నేను ఇస్రోలో సైంటిస్టుని అని చెబుతూ ఎటూ మాట కలిసింది కదాని నా బాధ పంచుకునే ప్రయత్నం చేశాను.బాధంటే ఇంకేం కాదు.. అనుకోని ప్రయాణం కనుక ఎసిలో కాక ఇదిగో ఇలా స్లీపర్లో..అదీ రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేయాల్సి వచ్చిందని ఆవేదన..పెద్దాయన నవ్వి తన పేరు జగ్మోహన్ రావ్ అని చెప్పాడు.ఆ పేరు ఎక్కడో విన్నట్టు అనిపించింది.అయితే అప్పుడు నేనున్న పరిస్థితిలో ఆ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు.పెద్దాయన మాత్రం నేను ఇస్రో సైంటిస్ట్ ని అని తెలిసాక కాస్త ఎక్సైటింగ్గా మా సంస్థ గురించి ఆసక్తికరంగా కొన్ని వివరాలు అడిగితే నేను గర్వంగా ఫీలై చెప్పాను.మొత్తానికి నేను ఓ సైంటిస్ట్ తో కలిసి ప్రయాణం చేస్తున్నానన్న మాట అని పెద్దాయన అంటే నాకు గర్వంగా అనిపించింది.

ఈలోగా కంపార్ట్మెంట్లో అందరూ నిద్రకు ఉపక్రమిస్తున్నారు.పెద్దాయన ఇంకాస్త సర్దుకుని కునుకు తియ్యమని చెప్పాడు.గుడ్ నైట్ అంటూ ఆయన నెమ్మదిగా నిద్రలోకి జారాడు.
నేను మాత్రం అలా కూర్చునే నాన్న ఎందుకు అంత అర్జంటుగా రమ్మన్నాడా అని ఆలోచిస్తూ ఫోన్లో వాట్సాప్ సందేశాలు చూస్తున్నాను.ఈలోగా మా ఎదురు బెర్తులోని నడి వయసు మనిషి అసౌకర్యంగా కదలడం ప్రారంభించాడు.

చూస్తుండగానే గుండె పట్టుకుని విలవిలలాడిపోతున్నాడు.అంతలోనే నోటి నుంచి చొంగలు..నాకు అర్థమైపోయింది.అతనికి ఏదో పెద్ద సమస్య వచ్చిందని..వెంటనే లేచి అతనిని పట్టుకుని కుదుపుతూ బోగీలో ఎవరైనా డాక్టర్ ఉన్నారా అని అరిచాను.ఈలోగా అప్పర్ బెర్త్ పై పడుకున్న ఒకబ్బాయి..అనారోగ్యం పాలైన వ్యక్తి కొడుకనుకుంటా గాభరా పడుతున్నాడు.

అతగాడు కూడా బోగీలో డాక్టర్ ఉన్నారా అని అరుస్తున్నాడు.స్లీపర్ బోగీలో డాక్టర్లు ప్రయాణం చేసే రోజులు కావు.. ఏం చెయ్యాలా అని నేను కలవర పడుతుండగానే నాకు బెర్త్ పై చోటు ఇచ్చిన పెద్దాయన లేచి పరిస్థితిని గ్రహించి వెంటనే రోగి నాడి చూసి గుండెలపై కొంచెం రుద్దాడు.హెల్త్ అసిస్టెంట్ అయుంటాడు. డాక్టర్లా ఫోజు కొడుతున్నాడని అనుకున్నాను. కాని ఆ సమయంలో అంతకు మించి అందుబాటులో ఉండేదెవరు.అయినా మందులు ఇచ్చి అనవసరమైన రిస్కులు చేయకుండా తెలిసిన ఫస్ట్ ఎయిడ్ ఏదో చేస్తున్నాడు కదాని అనుకుంటుండగానే పెద్దాయన తన బ్రీఫ్ కేసు తెరిచి సిరంజి.. కాటన్..ఏదో మందు తీసి క్షణాల్లో లోడ్ చేసి ఇంజక్షన్ ఇవ్వబోతున్నాడు.అది చూసి నేను అప్రయత్నంగానే ఏయ్..ఏం చేస్తున్నారు.తెలిసీ తెలియని వైద్యం చేసి ప్రాణాలు తీస్తారా అని కటవుగానే అన్నాను.అయినా ఆయన ఇంజక్షన్ చేశాడు.

చూస్తుండగానే రోగి కాస్త తేరుకున్నాడు.నేను వెంటనే పెద్దాయన వైపు ఆశ్చర్యంగా చూసాను.ఆయన అదేమీ పట్టించుకోకుండా ఆ రోగి కొడుకుతో” మీరు గాభరా పడకండి..మీ నాన్న గారికి హార్ట్ ఎటాక్ వచ్చింది.నేను ఇచ్చిన ఇంజక్షన్ తో పెద్ద ప్రమాదం తప్పినట్టే.అయితే మీరు వచ్చే స్టేషన్లో దిగిపోయి మీ నాన్న గారిని వెంటనే ఆస్పత్రిలో చేర్చి మెరుగైన చికిత్స అందే ఏర్పాటు చెయ్యండి ..నేను ఈలోగా కంప్లైంట్ వివరాలు..నేను ఇచ్చిన ఇంజక్షన్ పేరుతో పాటు కొన్ని మందులు రాసిస్తాను”అంటూ బ్రీఫ్ తెరిచి ప్రిస్క్రిప్షన్ బుక్ తీశాడు.ఆ సరికే నా పక్కన ఇంతసేపు కూర్చున్నది డాక్టర్ అనే విషయం నాకూ..రోగి కొడుక్కి అర్థం అయింది.ఈలోగా పెద్దాయన మందులు రాస్తుంటే యథాలాపంగా చూస్తున్న నేను ఆ బుక్ పై అపోలో హాస్పిటల్స్ పేరు చూసి ఉలిక్కిపడ్డాను.అంతకంటే ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఆ చీటీపై ఉన్న డాక్టర్ పేరు..ఆయన డిజిగ్నేషన్.డాక్టర్ జగ్మోహన్ రావ్ అనే పేరు..కింద బోలెడు డిగ్రీలు..వాటి కింద చీఫ్ కార్డియాలజిస్ట్ అనే హోదా..నాకు నోటంట మాట రాలేదు.నేను సైంటిస్టునని చెప్పినప్పుడు అబ్బో..అయితే నేను ఓ సైంటిస్ట్ తో కలిసి ప్రయాణం చేస్తున్నానన్న మాట అంటూ ఎగ్జైటింగ్గా కనిపించిన ఆ పెద్దాయన అంత పెద్ద డాక్టర్ అన్నమాట.

కొన్నాళ్ల క్రితం నేను మా నాన్నగారిని చూపించడానికి అపోలోకి వెళ్ళినప్పుడు ఆయన గురించి విన్నాను.ఇప్పుడు ఆయన ఎవరో తెలిసిన తర్వాత నా మనసును ఓ సందేహం దొలిచేయడం మొదలుపెట్టింది.అంత పెద్ద డాక్టర్ ఇలా స్లీపర్లో ప్రయాణం చేస్తున్నారేమిటని..ఈలోగా స్టేషన్ రావడం..ఆగిన రైలు నుంచి రోగిని దింపడం..అప్పటికే టిసి ఇచ్చిన సమాచారంతో వైద్య సిబ్బంది వచ్చి వీల్ చెయిర్లో తీసుకువెళ్లడం జరిగాయి.డాక్టర్ జగ్మోహన్ కూడా స్టేషన్లో దిగి వైద్య సిబ్బందికి కొన్ని సూచనలు చేసి వారు వెళ్ళాక రైలు ఎక్కి సీట్లో కూర్చున్నారు..ఇప్పుడు నాకు ఆయన్ని చూస్తుంటే
ఓ అద్భుతాన్ని చూస్తున్నట్టు ఉంది.

ఇక ఉత్సుకత ఆపుకోలేక ఆయన్ని అడిగేసాను..మీరు అంత పెద్ద డాక్టర్ అయి ఉండి ఇలా స్లీపర్ క్లాసులో..!?
దానికి ఆయన నవ్వుతూ..నేనొక చిన్న గ్రామంలో పుట్టాను.చిన్నప్పుడు ఎప్పుడైనా రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఎవరికైనా వైద్యం అవసరం అయిన సందర్భాల్లో అందక ఒకరిద్దరు చనిపోయిన ఉదంతాలు చూసాను.అసలు నేను వైద్య విద్య అభ్యసించడానికి కూడా ఆ ఉదంతాలే స్ఫూర్తి..సరే…చదువుకుని అంత పెద్ద ఆస్పత్రిలో పని చేస్తున్నాను గనక ఎటూ పేదలకు వైద్యం అందించే అవకాశం తక్కువ.అందుకే వారానికి రెండు రోజులు మా ఊరు వెళ్లి అక్కడి పేదలకు ఉచితంగా వైద్యం చేసి వస్తుంటాను.ఎటూ వెళ్తున్నాను గనక ఇలా చిన్నప్పుడు చూసిన చేదు అనుభవాల నేపధ్యంలో స్లీపర్లోనే వెళ్తూ అవసరం పడినప్పుడు వైద్య సేవలు అందిస్తూ..మామూలు పరిస్థితుల్లో ఇలా జనాలతో మాటలు కలిపి వైద్య సలహాలు ఇస్తుంటాను.

అప్పుడే నా విద్య..జ్ఞానం పది మందికి ఉపయోగపడుతాయనే తృప్తి..అలా మా మధ్య సంభాషణ జరుగుతుండగానే ఆయన దిగాల్సిన స్టేషన్ వచ్చింది.ఆయన పెట్టేబేడా సర్దుకుని నాకు వీడ్కోలు చెబుతూ షేక్ హాండ్ తో పాటు తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా రమ్మని చెప్పి రైలు దిగి వెళ్ళిపోయాడు.

ఆయన అలా వెళ్తుంటే నేను అబ్బురంగా చూస్తూ ఉన్నాను.ఆయన అంతవరకు కూర్చున్న చోట ఏదో వెలుగు కనిపించినట్లు అనిపించింది.అప్రయత్నంగా నేను చేతులు జోడించి ఆ గొప్ప వ్యక్తి వెళ్ళిన వైపే చూస్తూ నమస్కరించాను..ఆ తర్వాత చాలాకాలం ఆయన జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.నూటికో కోటికో ఒక్కరు..ఎప్పుడో ఎక్కడో పుడతారు..అన్నట్టు…పెద్దలు వైద్యో నారాయణో హరి అని ఇలాంటి మహనీయుల్ని చూసే అని ఉంటారుగా అనుకుంటాను..ఆయన గుర్తు వచ్చినప్పుడల్లా..!

ఇ.సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE