Suryaa.co.in

Features

చరిత్ర – వర్తమానం – భవిషత్

– మహనీయుల పవిత్రమాస ఉత్సవాలు
– బహుజన ధూంధాం – మహనీయుల చరిత్ర

“సింహాలు తమ చరిత్ర తాము చెప్పుకునేంతవరకు వేటగాడు చెప్పిన చరిత్రనే చరిత్రగా చెప్పబడుతుంది”.
….చినువ అచెబి, ఆఫ్రికా రచయిత

మన దేశ ప్రజల విముక్తికోసం త్యాగపూరిత ఉద్యమాలు చేసిన మహనీయుల చరిత్రను బహుజన సమాజం చెప్పనంతకాలం మెజార్టీ ప్రజలను అనచివేసిన దుర్మార్గపు చరిత్రనే చరిత్రగా కొనసాగుతుంది. నేటికి మన దేశంలో పుక్కిటి పురాణాల ద్వారా, రామాయణ, మహాభారత ఇతిహాసాల ద్వారా కష్టజీవులను, ఉత్పత్తి సేవా కులాలను అణచివేసిన చరిత్రనే ఎక్కువ ప్రచారంలో వుంది. వేల సంవత్సరాల అణచివేతపై తిరుగుబాటు చేసిన వీరుల చరిత్ర ప్రచారంలో బహుజన సమాజం వెనుకబడి ఉండడానికి చాలా కారణాలున్నాయి.

రాజ్యం బహుజన వర్గాల చేతిలో లేకపోవడం, అవిద్య, పాఠ్యపుస్తకాల్లో అణచివేసిన చరిత్ర మాత్రమే పొందుపరచడం, ఎదిగిన బహుజన సమాజంలో చాలామంది ఆధిపత్య వర్గాల పార్టీల్లో చేరడం, మహనీయుల చరిత్ర ప్రచారం చేసుకునే శక్తి బహుజన వర్గాలకు లేకపోవడం ప్రధాన కారణాలుగా చెప్పాలి.

చరిత్రను, చరిత్రలో విజయాలను, అణచివేతను ప్రస్తుత సమాజానికి వివరించిన నాడే వర్తమానంలో ఎలాంటి ఉద్యమాలు చేయాలో నిర్ణయించబడుతుంది. వర్తమాన ఉద్యమాలు విజయవంతమై వాటి ఫలితాల ద్వారానే ప్రజల భవిషత్, జీవన ప్రమాణాలు నిర్ణయించబడుతాయి. ఈ క్రమంలో మన దేశ మెజార్టీ ప్రజల విముక్తికోసం పోరాటం చేసిన ఆయా వర్గాల బహుజన ఉద్యమ నాయకుల చరిత్రను ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రస్తుత ఉద్యమ నాయకత్వంపై వుంది.

నియంత పాలనకన్నా చైతన్య రాహిత్యం అత్యంత ప్రమాదకరమని మహానీయులు బోధించిన తీరును ఒకసారి మననం చేసుకుంటే బహుజన మహనీయుల పోరాట చరిత్ర, ప్రస్తుత స్థితి అర్ధమవుతుంది. వాస్తవ పోరాట చరిత్ర, త్యాగాలు చెప్పనంతకాలం, శత్రువు ఎవరో, మిత్రువు ఎవరో ప్రజలకు తెలుపనంతకాలం చైతన్య రాహిత్యంతో నియంత పాలన కొనసాగి ప్రజలు మరింత బానిసలై దోపిడి పీడనలకు గురవుతారు.
బహుజన మహనీయుల చరిత్రను అంబేడ్కర్ బయటపెట్టేవరకు మెజార్టీ ప్రజలకు దేశంలో జరిగిన అణచివేత, బానిసత్వం గురించి కనీస అవగాహన కూడా లేదు. ప్రజల కోసమే ప్రాణాలు అర్పించిన వీరుల గురుంచి, తమ వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని వదులుకొని తమ చివరి శ్వాస వరకు త్యాగపూరిత ఉద్యమాలు చేసిన మహానీయుల చరిత్ర మెజార్టీ ప్రజలకు తెలియాల్సి వుంది.

అంబేడ్కర్ కన్నా ముందుతరం మహానీయుల చరిత్రతో పాటు అంబేడ్కర్ సమకాలీకుల చరిత్రను అంబేడ్కర్ తన రచనల ద్వారా ప్రజలకు తెలియజెప్పారు. అంబేడ్కర్ రచనలను ఎంతో మంది రచయితలు ఆయా ప్రాంతీయ భాషల్లోకి అనువాదం కూడా చేశారు. అంబేడ్కర్ తర్వాత కాన్షీరాం తదితర రచయితలు, ఉద్యమకారులు మహానీయుల చరిత్రను ప్రచారం చేయడంలో వారి శక్తికి మించి కృషి చేస్తున్నారు. ముద్రణ రూపంలో, కళారూపాల్లో ప్రజలకు తెలియజేస్తున్నారు.

ప్రజల సమస్యలు, ఉద్యమాల నుండి అద్భుతమైన వాగ్గేయకారులు పుట్టుకొచ్చి వారి త్యాగపూరిత కళారూపాలతో మహాద్బుతంగా ఉద్యమాలను పదును పెట్టిన చరిత్ర కళాకారులకుంది. హక్కుల సాధనలో, పీడిత ప్రజల విముక్తి పోరాటంలో, దేశ స్వాతంత్ర పోరాటంలో, తెలంగాణ విముక్తి పోరాటంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర కీలకమైనది. అలాంటి కళాకారులు నేడు మహానీయుల జయంతి మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో బహుజన ధూందాం నిర్వహించడం గొప్ప విషయం. మహానీయుల చరిత్ర ప్రజలకు తెలియజెప్పడంలో కళాకారుల పాత్ర చాలా కీలకమైన తరుణంలో ఆ కళాకారులు ముందుకు వచ్చి బహుజన ధూందాం పేరున మహానీయుల చరిత్రను ప్రజలకు తెలియజెప్పడం వల్ల బహుజన ఉద్యమాలకు, మెజార్టీ ప్రజలకు మరింత మేలు చేస్తుంది.

సమాజంలోనున్న దుఃఖాన్ని గుర్తించిన గౌతమ బుద్ధుడు ఆ దుఃఖ కారణాలను, నివారణను కూడా సమాజానికి బోధించారు. అమితమైన కోరికలే దుఃఖానికి కారణమని, అమితమైన కోరికలు లేకుండా జీవిస్తే దుఃఖ నివారణ జరుగుతుందని వేల సంవత్సరాల క్రితం బోధించిన బుద్ధుడు బోధనలు నేటికి అవసరంగానే ఉన్నాయి. దోపిడి వర్గాల, పాలకవర్గాల అమితమైన కోరికల వల్లనే నేటి సమాజంలో దుఃఖం ఎక్కువ అవుతుంది. మానవీయ విలువల జీవితం గురించి ఎన్నో బోధనలు చేసిన బుద్ధుని ధర్మాన్ని స్వీకరించిన అశోక చక్రవర్తి హింసా మార్గాన్ని వీడి అహింసా మార్గంలో, దోపిడి, పీడనలు లేని విలువల పాలన కొనసాగించిన అశోక చక్రవర్తి జన్మదినం ఏప్రిల్ మాసం కావడం విశేషం.

అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో కార్మిక సంక్షేమ చట్టాలను తీసుకొచ్చిన బాబు జగ్జీవన్ రామ్ తో పాటు మాహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ లు కూడా ఏప్రిల్ మాసంలోనే జన్మించడం విశేషం. దేశ ప్రజలందరికి ఓటు హక్కుతో ప్రతి మనిషికి ఒకే విలువ కల్పించి రాజ్యాధికారమే మాస్టర్ కీ అని పిలుపునిచ్చిన అంబేడ్కర్ వారసత్వాన్ని స్వీకరించిన మాన్యశ్రీ కాన్షీరాం బహుజన రాజ్యాధికారాన్ని సాదించే ఆచరణాత్మక ఉద్యమం చేశారు. కాన్షిరామ్ జన్మదినమైన మార్చి 15 నుండి అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14 వరకు బహుజన వర్గాలు మహనీయుల పవిత్ర మాసంగా ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుపుకుంటారు.

ఈ దేశ మెజార్టీ ప్రజలైన శూద్రులకు విద్య లేనందువల్ల జరుగుతున్న దోపిడి పీడనలను గుర్తించిన జ్యోతిరావు పూలే బహుజన వర్గాలకు విద్యనందించడంలో ఎన్నో పోరాటాలు చేశారు. విద్యతో పాటు సంఘ పరివర్తనకు ఎంతో కృషి చేసిన పూలే ఉద్యమ కొనసాగింపులో భాగంగా అంబేడ్కర్ ఓటు ప్రాముఖ్యతను, రాజ్యాధికార అవసరాన్ని గుర్తించి పోరాటం చేశారు. “నీవు నీ కోసం పనిచేస్తే నీలోనే మిగిలిపోతావు. ప్రజల కోసం పనిచేస్తే ప్రజల్లో నిలిచిపోతావు” అని బోధించి ఆచరణాత్మక ఉద్యమాలు చేసిన అంబేడ్కర్ ఈ దేశ మెజార్టీ ప్రజల విముక్తికోసం ఎన్నో పోరాటాలు చేసి, రాజ్యాంగంలో పీడిత ప్రజలకు, మహిళలకు ఎన్నో హక్కులు పొందుపరచడమే కాకుండా అన్ని అసమానతలకు కారణమైన కులం ధ్వంసం కావాలని ఎన్నో పోరాటాలు చేసాడు. ఆక్రమంలో తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసిన అంబేడ్కర్ బుద్ధుడు చూపిన జీవన మార్గాన్ని తను స్వీకరించడమే కాకుండా దేశ మూలవాసి ప్రజలు స్వీకరించి విలువల సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.

బహుజన మహనీయుల పవిత్ర మాస ఉత్సవాల సందర్భంగా ప్రజలకోసం త్యాగం చేసిన మరికొంతమంది మహనీయులను గుర్తుచేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. జైన మహావీరుడు, ఆచార్య నాగర్జనుడు, బసవేశ్వరుడు, అక్కమహాదేవి, హరలయ్య, చెన్నయ్య, పాల్కుర్కి సోమన్న, కబీర్, రవిదాస్, మీరాబాయి, తుకారాం, చొక్కామేళా, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, కక్కయ్య, సిద్దయ్య, వేమన, దున్న ఇద్దాసు, అమ్మ సావిత్రిబాయి, అమ్మ రమాబాయి, అమ్మ షేక్ ఫాతిమా, నారాయణగురు, సాహుమహారాజ్, పెరియార్, పండిత అయోతి దాస్, అయ్యంకాలి, మహాకవి గుర్రం జాషువా, భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామసామి, బద్ధుల శ్యామ్ సుందర్, బి.ఎస్. వెంకట్రావు, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, బండి యాదగిరి, బోయి భీమన్న, సుద్దాల హనుమంతు, వట్టికోట అల్వారుస్వామి, మగ్ధుమ్ మొయినోద్దీన్, అమ్మ ఈశ్వరి బాయి, అమ్మ సధాలక్ష్మి, శివసాగర్, మారోజు వీరన్న, గూడ అంజన్న, వంగపండు, బొజ్జా తారకం, బోయ జంగయ్య, అలిశెట్టి ప్రభాకర్, సాహు, కలేకూరి ప్రసాద్, చుక్క సత్తయ్య, చిందుల ఎల్లమ్మ, మిద్దె రాములు, ఉ. సాంబశివరావు లాంటి గొప్ప మహానీయులను కూడా మననం చేసుకొని వారి వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యతను బహుజన సంఘాలు మరువరాదు.

ఎంతోమంది మహానీయుల నిస్వార్థ త్యాగాలు, అనితర సాధ్యమైన పోరాటాల వల్ల మన సమాజం ఈమేరకు పురోభివృద్ధిని సాధించింది. స్వేచ్ఛ, సమానత్వం, సహోదరత్వం, న్యాయం, విలువలతో కూడిన ప్రజాస్వామ్య సమాజాన్ని నిర్మించే సంఘపరివర్తన ఉద్యమాలు చేసిన మహనీయలను ఎత్తిచూపుతూ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ‘బహుజన ధూందాం’ (రిథం ఆఫ్ ది బహుజన కల్చర్) జరపడం వల్ల బహుజన ఉద్యమాలకు, బహుజన రాజ్య స్థాపనకు ఎంతో ఉపయోగపడుతుంది. సబ్బండ గానరీతులకు, కళారూపాలకు, పాటలకు నెలవైన తెలంగాణలో ఎన్నో ఉద్యమాల విజయం వెనుక కవులు, కళాకారుల పాత్ర కీలకమైంది. తెలంగాణ సాధనకోసం జరిగిన పోరాటంలో ప్రముఖపాత్ర వహించిన కళాకారులు బహుజన రాజ్యాధికార దిశగా సాగే ఉద్యమంలో కూడా కీలకపాత్ర వహించాల్సిన బాధ్యతను గుర్తించిన కళాకారులు తెలంగాణ ధూందాం లాగానే “బహుజన ధూంధాం” నిర్వహించడం బహుజన ఉద్యమాలకు కీలక మలుపవుతుంది.

తమ జీవితాలను ఈ సమాజాన్ని భూతల స్వర్గం చేయడానికి అంకితం చేసిన మహనీయుల జన్మదిన వేడుకల సందర్భంగా బహుజన జాతుల సంస్కృతిని సగర్వంగా చాటి మహనీయుల పోరాటాలను, త్యాగాలను నెమరువేసుకోకడమే కాకుండా వారు సాధించిన విజయాలకు వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వారి స్ఫూర్తిని ప్రతి వ్యక్తిలో నింపడం కోసం, ప్రతి పల్లెకు చేరడానికి ఆట, పాట చాలా కీలకమైన తరుణంలో రాజకీయ పార్టీలకతీతంగా కళాకారులు తెలంగాణ కళాకారులు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మహోన్నత సాంస్కృతిక ప్రదర్శన “బహుజన ధూంధాం” తెలంగాణలో సంఘ పరివర్తనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

– సాయిని నరేందర్
సామాజిక విశ్లేషకులు
9701916091

LEAVE A RESPONSE