జపాన్ లో క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్లిన విషయం తెలిసిందే. జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతోన్న ఈ సమావేశంలో క్వాడ్ దేశాల అధినేతలు పాల్గొన్నారు. మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిదా, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ ఈ సమావేశంలో పాల్గొని చర్చలు జరుపుతున్నారు. ఇండో పరిఫిక్ ప్రాంతంలో పరిణామాలు, అంతర్జాతీయ అంశాలపై వారు చర్చిస్తున్నారు.
అలాగే, ప్రధానంగా ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధం, క్వాడ్ దేశాలతో చైనా సంబంధాలపై చర్చలు జరుపుతున్నారు. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ కోసం కట్టుబడి ఉన్నామని నాలుగు దేశాల అధినేతలు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ… క్వాడ్ దేశాల మధ్య విశ్వాసం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తినిస్తుందని చెప్పారు.ఇండో పసిఫిక్ కోసం నిర్మాణాత్మక ఎజెండాతో క్వాడ్ ముందుకు వెళుతోందని ఆయన అన్నారు. విస్తృతమైన క్వాడ్ పరిధి మరింత ప్రభావవంతంగా మారిందని తెలిపారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ పలు అంశాల్లో సమన్వయం కొనసాగించామని గుర్తు చేసుకున్నారు. కాగా, ఉక్రెయిన్ లో రష్యా యుద్ధాన్ని ఆపేవరకు భాగస్వామ్య పక్షాలకు సాయం కొనసాగుతుందని అమెరికా స్పష్టం చేసింది.