-కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన భూములతో రియల్ వ్యాపారమా?
-ప్రభుత్వాలు ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తాయా? రియల్ వ్యాపారం కోసమా?
-అధికారం లోకి రాగానే వరంగల్ డిక్లరేషన్ ను అమలు చేస్తాం
-శీలం సిద్ధారెడ్డి ఆశయాలు నిజం చేయడమే మనం ఇచ్చే నిజమైన నివాళి
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలు, అసైన్డ్ భూములను టిఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి బలవంతంగా గుంజుకుంటే ప్రభుత్వంతో ఇక సమరమే ఉంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర గురువారం ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో పున ప్రారంభించారు. మీనవోలు అంకమ్మ దేవాలయంలో భట్టి దంపతులు పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి
తక్కెళ్ళపాడు, సఖినవీడు, మొలుగుమాడు, ఇనగలి గ్రామాల్లో పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన లబ్ధిదారులకు మూడెకరాల భూమి, ఇంటికొక ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని వాగ్దానం చేసి ఎనిమిది సంవత్సరాలు కావస్తున్న నెరవేర్చడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిన టిఆర్ఎస్ పాలకులు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలు సాగు చేసుకుని జీవనోపాధి పొందాలన్న ఉద్దేశంతో పంపిణీ చేసిన అసైన్డ్ భూములను ఇప్పటికే రైతు వేదికలు, స్మశాన వాటికలు, నర్సరీల ఏర్పాటు పేరిట ప్రజల నుంచి బలవంతంగా తీసుకుందన్నారు. ఇది సరిపోనట్టుగా ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడం కోసం గత కాంగ్రెస్ పాలకులు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను బలవంతంగా తీసుకొని అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి సన్నద్ధం అవ్వడం సిగ్గుచేటుగా ఉందన్నారు. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన పాలకులు ప్రజా సంక్షేమం కోసం పని చేస్తారా? లేక ఆదాయం పెంచుకోవడానికి రియల్ వ్యాపారం చేయడం ప్రభుత్వం పనేనా అని నిలదీశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకోవడానికి అధికారంలో ఉండాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు పంపిణీ చేసిన భూములను గుంజుకుంటూ ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. “ఎర్రుపాలెం మండలం తక్కెళ్ళపాడు గ్రామం వేదిక నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ను హెచ్చరిస్తున్న పేదల భూములు తీసుకోకుండా వెంటనే మీరు అధికారులకు ఆదేశాలు జారీ చేయండి. ప్రభుత్వం పేదల భూములను బలవంతంగా తీసుకుంటే బాధితుల పక్షాన కాంగ్రెస్ అండగా ఉంటుందని, కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని” భట్టి అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వరంగల్ డెకరేషన్ అమలు వ్యవసాయ సంక్షేమం కోసం ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వందకు వందశాతం అమలు చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షల రుణ మాఫీ, వరి కి మద్దతు ధరకు అధికంగా వెయ్యి రూపాయలు బోనస్, పత్తి, మిర్చి, పెసర, మినుము ఇతర పంటలకు బోనస్ ఇవ్వడంతో పాటు నకిలీ విత్తానాల అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకొచ్చి నిందితులు ఎవరైనా వదిలిపెట్టకుండా శిక్షిస్తామని వెల్లడించారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తామన్నారు. రైతులకు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఏడాదికి రూ. 15వేలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కలిగి ఉన్న రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు.
సిద్ధారెడ్డి ఆశయాలు నెరవేర్చడమే మనం ఇచ్చే నిజమైన నివాళి
మాజీ మంత్రి స్వర్గీయ శీలం సిద్ధారెడ్డి ఆశయాలు నెరవేర్చడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా తక్కెళ్ళపాడు లో ఏర్పాటుచేసిన శీలం సిద్ధారెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నీటి పారుదల శాఖ మంత్రి గా పని చేసి అభివృద్ధికి ప్రణాళికలు వేసిన జిల్లా తొలి మంత్రి స్వర్గీయులు శీలం సిద్ధా రెడ్డి గారి విగ్రహాన్ని ప్రారంభించడం చాలా గర్వంగా ఉందన్నారు.
ఖమ్మం జిల్లాలో వ్యవసాయం, విద్య , వైద్యం అభివృద్ధికి సిద్ధారెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. సిద్ధారెడ్డి ఆశయాలను కొనసాగించడం లో భాగంగానే మధిర నియోజకవర్గంలో కొత్తగా నీటిపారుదల ప్రాజెక్టులను తీసుకువచ్చామని,. కట్టలేరు ప్రాజెక్టు ఆధునీకరించి రైతులకు సాగునీరు అందిస్తామని, నియోజకవర్గంలో పాఠశాలల నిర్మాణం, అదనపు తరగతి గదుల నిర్మాణం చేసి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ వీరభద్రం, జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, పాదయాత్ర కన్వీనర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల శాఖ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.