కోనసీమ జిల్లాలో కోనసీమ పేరు అన్నది లేకుండా కేవలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాలని ఈనెల 15వ తేదీన విజయవాడ నగరంలో నీలి కవాతు నిర్వహించాలనుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమా? అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణంరాజు కోరారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంటే గౌరవించని వారే ఉండరని, అటువంటి వ్యక్తి పేరును మూడు జిల్లాలుగా విడిపోయి ఏర్పడిన కోనసీమ జిల్లాకు పెట్టడం అవసరమా? అని ప్రశ్నించారు.అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ నిర్వహించి అంబేద్కర్ పేరుపెట్టాలని మెజారిటీ ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా కోరితే, అలాగే పెట్టాలని సూచించారు. శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…
అంబేద్కర్ పేరిట ఇంత గొడవలు అవసరమా? అనవసరమా?? అన్నది ప్రజలందరూ ఆలోచించుకోవాలని అన్నారు.. పచ్చని చెట్లతో, గోదావరి పాయల మధ్య ఉన్న కోనసీమ ప్రాంతం కులమతాలకతీతంగా ఒక కుటుంబంగా ఉండేదని, అటువంటి కోనసీమ జిల్లాలో అల్లర్లకు కారణం ఎవరో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. నూతన జిల్లాల ఏర్పాటు లో భాగంగా కోనసీమ ప్రాంతానికి కోనసీమ జిల్లాగా నామకరణం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నట్టుండి కోనసీమ అంబేద్కర్ జిల్లాగా పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్నదని అన్నారు.. అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పాలని కోరడంతో, కోనసీమ జిల్లా పేరు మార్పు పై కొంతమంది.ఆందోళన వ్యక్తం చేస్తూ, మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ల ఇంటిపై దాడి చేసి దహనం చేసిన విషయం తెలిసిందేనన్నారు. ఈ అల్లర్లు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న తరుణంలో ఈనెల 15వ తేదీన విజయవాడ నగరంలో . నిర్వహించనున్న నీలి కవాతులో లక్షలాదిమంది పాల్గొనాలని పిలుపునివ్వడం విస్మయాన్ని కలిగిస్తోందని అని తెలిపారు.
ఈ కవాతు వెనుక మా ప్రభుత్వ పెద్దలు ఉన్నారా?, లేరా ?? అన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే, ఈ కవాతు నిర్వహణ వెనుక అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపకుడు, సి ఐ డి ఇన్ ఛార్జ్, అడిషనల్ డీజీపీ పివి సునీల్ కుమార్ ఉన్నట్లు తెలిసిందన్నారు. కవాతు నిర్వహణ వెనుక ఏమైనా కుట్రకోణం ఉందా అన్న అనుమానం ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు చెందాల్సిన ఉద్యోగ ఉపాధి అవకాశాలను దూరం చేసిందని, ఇటీవలే ఒక ఎమ్మెల్సీ చేతిలో సుబ్రహ్మణ్యం అనే దళితుడు హత్యకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయని, ఈ విషయాన్ని కోర్టు నిర్ధారించవలసి ఉందన్నారు.. ఈ పరిస్థితుల్లో దళితులను తిరిగి ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు లేకపోలేదన్నారు.
అయితే కోనసీమ అంబేద్కర్ జిల్లా ఏర్పాటుపై అభ్యంతరాలను ఆహ్వానించిన సమయంలోనే 500 మంది ఉండగా అల్లర్లు జరిగితే, ఇప్పుడు లక్షలాదిమంది పాల్గొనే అవకాశం ఉన్నా నీలి కవాతులో అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు లేకపోలేదన్నారు. నీలి కవాతుకు అనుమతి ఇవ్వకపోయినా, ఇప్పటికే కొంతమంది విజయవాడ వచ్చి మకాం వేసినట్లు తెలిసిందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ర్యాలీని అడ్డుకోవాలని సూచించారు. ఇదే విషయమై తాను కేంద్ర హోంమంత్రికి, హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి కి లేఖలు రాశానని, నిఘా సంస్థలు అప్రమత్తం చేయాలని కోరానని చెప్పారు. ఈ ర్యాలీ నిర్వహణ వెనుక ఎవరున్నారో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ నిర్వహించి మెజార్టీ ప్రజలు కోరినట్లయితే కోనసీమ జిల్లాకు కేవలం అంబేద్కర్ జిల్లాగా అని నామకరణం చేయవచ్చునని రఘురామకృష్ణంరాజు చెప్పారు.
లేఅవుట్ అభివృద్ధికి 60 నెలల సమయం అవసరమా?
అమరావతి లే ఔట్ ను మూడు నెలల వ్యవధిలో అభివృద్ధి చేయాలని హై కోర్ట్ ఆదేశిస్తే, తమకు ఆరు నెలల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడం విడ్డూరంగా ఉందన్నారు. మూడేళ్లయినా రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయకుండా గడ్డి పీకుతున్నారా అంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ఒక్క రూపాయికి భోజనం పెట్టండి
పేదవాడికి పట్టెడన్నం పెట్టడానికి గత ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్ల ఏర్పాటు చేశారనీ రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు.. అయితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లలో మూసివేసిందన్నారు. అన్నదానాన్ని అడ్డుకోవడం అతి దారుణమని ఆయన మండిపడ్డారు. అవసరమైతే రాజారెడ్డి పేరిట ఒక్క రూపాయకే పేదలకు భోజనాన్ని అందించాలని, అలా కాకపోతే ప్రభుత్వ నిధులతో ఐదు రూపాయలకు భోజనాన్ని పెట్టాలని సూచించారు. అంతేకానీ పేదలకు భోజనాన్ని అందించాలనే సదుద్దేశంతో హిందూపూర్ లో ఏర్పాటుచేసిన అన్నా క్యాంటీన్ స్టాల్ కూల్చివేసి, నిర్వాహకులపై కేసు నమోదు చేయడం హాస్యాస్పదమన్నారు. ఇక మంగళగిరిలోనూ, ఎన్టీఆర్ శతజయంతి నీ పురస్కరించుకొని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండు రూపాయలకే పేదలకు భోజనాన్ని అందించేందుకు ఏర్పాటు చేయదలచిన అన్నా క్యాంటీన్ కూల్చివేయడం దారుణమని మండిపడ్డారు. సొంత డబ్బులతో ఓ మహానుభావుడు పేరిట పేదలకు భోజనం అందించాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేయదలచిన అన్న క్యాంటీన్లను అడ్డుకోవడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు.
దస్తగిరి ప్రాణాలను కాపాడండి
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా తగ్గిపోతున్నారని, ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది, సిబిఐ దేనని రఘురామ కృష్ణంరాజు అన్నారు.. గతంలో శ్రీనివాస్ రెడ్డి అనే సాక్షి ఆత్మహత్య చేసుకున్నాడనీ, అయితే పోస్టుమార్టం రిపోర్ట్ లో శ్రీనివాస్ రెడ్డిని కొట్టి, నోట్లో ఎండ్రిన్ పోసినట్లుగా నివేదిక స్పష్టం చేశాయన్నారు.. ఇక తాజాగా గోవిందరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారా?, హత్య గావించ పడ్డారా?, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక చనిపోయారా?? అన్నది సస్పెన్స్ గా మారిందన్నారు.
ఏడు మందిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..
పదవ తరగతి పరీక్షల్లో ఫెయిలై ఏడు మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడా న్ని ప్రభుత్వ వైఫల్యం గా రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద, బాత్రూములు కడిగే వారిని పర్యవేక్షించే విధులను అప్పగించారన్నారు. ఇక విద్యార్థులకు వారు పాఠాలు ఎప్పు డూ చెప్పారని ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల్లో బిట్స్ ప్రశ్నలు తగ్గించడం వల్ల కూడా విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పై ప్రభావం చూపిందని అన్నారు.
భస్మ సూర హస్తం చేసుకోవద్దు…
ప్రజలు బోలా శంకరుల ని ఒక్క అవకాశం అంటే ఇచ్చారని, దాన్ని భస్మాసుర హస్తం గా చేసుకోవద్దని చెప్పారు. విపక్షాల సూచనల స్వీకరించి, విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు..