జనంలోకి టీడీపీ, జనసేన అధినేతలు

* పబ్లిక్‌ పల్సు పట్టుకునేపనిలో అగ్రనేతలు
* చంద్రబాబు ఏడాది, పవన్‌ ఆరునెలల పర్యటనలు
* ఈనెల 15 నుంచి చంద్రబాబు పర్యటనలు
* ప్రతి జిల్లాలో మినీమహానాడు, రోడ్‌షోలు
* దసరా నుంచి పవన్‌ పర్యటనలు షురూ
* తిరుపతి నుంచే యుద్ధం మొదలు
* టీడీపీ-జనసేన ‘ముందస్తు’ పర్యటనలు
* మార్చి, ఏప్రిల్‌లో ముందస్తు ఎన్నికల అంచనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎన్నికలకు ఇంకా రెండేళ్ల ముందే ఏపీలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. దానికి కారణం ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనా. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయని టీడీపీ-జనసేన నాయకత్వం అంచనా వేస్తోంది. అందులో భాగంగా తమ పార్టీ యంత్రాంగాన్ని యుద్ధానికి సిద్ధం చేయడంతోపాటు, ప్రజలను కలిసేందుకు ప్రణాళికలు ఖరారు చేసుకున్నాయి. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఏడాది, జనసేనాధిపతి పవన్‌ ఆరునెలలపాటు ఏకబిగిన జనంలోనే ఉండేలా పర్యటనలు రూపొందించుకుంటున్నారు. వీరిద్దరూ విడివిడిగా అన్ని నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొననున్నారు. జగన్‌ ప్రభుత్వ వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా, ప్రారంభం కానున్న వీరిద్దరి పర్యటనలకు ఆయా పార్టీల యంత్రాంగం ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఆరకంగా అటు చంద్రబాబు, ఇటు పవన్‌ ప్రజల పల్సు పట్టేందుకు రోడ్డెక్కనున్నారు.

వేసవికాలం ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ మళ్లీ రాజకీయాలపై సీరియస్‌గా దృష్టి సారించాయి. ఏపీలో అధికారపగ్గాలు చేపట్టేందుకు పోటీ పడటంతోపాటు, జగన్‌ సర్కారును కూలదోయాలన్న ఏకైక అజెండాతో విడిగా నడుస్తున్న టీడీపీ, జనసేన పార్టీలు..పొత్తును పక్కనపెట్టి, ఇకపై ఎవరి బలం వారు పెంచుకునే ప్రణాళికలకు ఊపిరిపోశాయి. అందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన దళపతి పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రవ్యాప్త పర్యటన చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆరోపణ-ప్రత్యారోపణ, తూటాల్లాంటి మాటలతో దాడి- ఎదురుదాడి చేసుకుంటున్న వైసీపీ, టీడీపీ-జనసేన వ్యవహారశైలితో ఏపీలో రాజకీయం ముందస్తుగా వేడెక్కింది. ఈ పరిస్థితిలో చంద్రబాబు-పవన్‌ రోడ్డెక్కితే రాష్ట్ర రాజకీయాలు మరింత రసకందాయంలో పడటం ఖాయం.

ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఈనెల 15 నుంచి ఏడాది పొడవునా జనం మధ్యలోనే ఉండాలని నిర్ణయించారు. గతంలో మీకోసం పేరుతో ఇంటికి సైతం వెళ్లకుండా పూర్తిస్థాయిలో యాత్ర చేసిన ఆయన, మరోసారి జనంలోకి వెళ్లనున్నారు. నెలకు రెండు జిల్లాల్లో మూడురోజుల చొప్పున పర్యటించనున్నారు. ఆ సందర్భంలో రోడ్‌షో, బహిరంగసభలు నిర్వహించనున్నారు. దానితోపాటు ఎన్టీఆర్‌ శతజయంత్యుత్సవాల్లో భాగంగా, ప్రతి జిల్లాలో మినీమహానాడు ఏర్పాటుచేయడం ద్వారా, కార్యకర్తలను నేరుగా కలిసే ప్రణాళిక రూపొందించారు. ఏడాదిలో 80కి పైగా నియోజకవర్గాల్లో పర్యటించేలా షెడ్యూల్‌ రూపొందించారు. ఒకవైపు జిల్లాల్లో పర్యటిస్తూనే, మరోవైపు మంగళగిరి పార్టీ ఆఫీసు నుంచి సమాంతర కార్యకలాపాల వ్యవస్థను కొనసాగించేలా చూస్తున్నారు. కాగా.. 15న చోడవరంలో మహానాడు, 16న అనకాపల్లిలో నియోజకవర్గాలవారీగా సమీక్ష, 17న చీపురుపల్లిలో బాదుడేబాదుడు నిరసన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు.

అటు ఇటీవలి కాలంలో సమరోత్సాహంతో ఉన్న జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌ కూడా, వరసగా ఆరు నెలల పాటు జనక్షేత్రంలో ఉండేలా ప్రణాళిక ఖరారు చేసుకున్నారు. బీజేపీతో కలసి నడిచే పరిస్థితి లేదని, తన పార్టీ అభ్యర్ధినే సీఎంగా ప్రకటిస్తారని ఆ పార్టీ స్పష్టం చేసిన నేపథ్యంలో.. పవన్‌ తన రాజకీయ భవిష్యత్తును తానే రూపొందించుకునే క్రమంలో, రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుడుతున్నట్లు కనిపిస్తోంది.

అక్టోబర్‌ 5 నుంచి పవన్‌ పర్యటన తిరుపతి నుంచి ప్రారంభం కానుంది. ఆరోజు దసరా పర్వదినం కూడా కావడం, తిరుపతి అందరికీ సెంటిమెంట్‌ కావడంతో పవన్‌ అక్కడి నుంచే జగన్‌ సర్కారుపై సమరశంఖం పూరించనున్నారు. ఆరునెలల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పర్యటించేలా షెడ్యూల్‌ రూపొందిస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక బహిరంగసభ ఉండేలా చూస్తున్నారు.

పొత్తు పొడిచేది కూడా అప్పుడే..
ఏపీలో విపక్షాల మధ్య పొత్తు వ్యవహారం కూడా టీడీపీ-జనసేన అధినేతల పర్యటన తర్వాత ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. తమ పర్యటనల్లో జనం నాడి, ప్రభుత్వంపై ప్రజల స్పందన, తమ పార్టీ బలాబలాలు బేరీజు వేసుకున్న తర్వాతనే రెండు ప్రధాన పార్టీలూ పొత్తులపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అధినేతల బహిరంగసభలకు వచ్చే ప్రజల స్పందన, ఆయా పార్టీ నేతల బలనిరూపణ వంటి అంశాలు పరిశీలించిన తర్వాత పొత్తులపై పూర్తి స్పష్టత రానుంది.

Leave a Reply