– దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా.. ఆంధ్రప్రదేశ్ లో 382 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు
– బహిరంగ మార్కెట్ లో కమీషన్లకు కక్కూర్తిపడిఅత్యధిక ధరలకు విద్యుత్ కొనుగోలుతో గత మూడు నెలల్లో రూ.1037 కోట్లు అదనపు భారం
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
-రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పాదన సంస్థ ఏపీ జెన్కోని ప్రైవేటుపరం చేసి అదానీ జెన్కోగా మార్చే కుట్రకు శ్రీకారం చుట్టింది జగన్ సర్కార్. రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్వీర్యం చేసి నష్టాల ఊబిలోకి నెడుతోంది ప్రభుత్వం. కేంద్ర విద్యుత్ శాఖ నివేదిక ఆధారంగా ఒక్క ఏప్రిల్ మాసంలోనే 382 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయలేక చేతులెత్తేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విద్యుత్ కొరత దక్షిణాది రాష్ట్రాలు అన్నింటిలో అత్యధికం.
తెలంగాణ 18, కర్నాటక 18, కేరళ 12, తమిళనాడు 67 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత మాత్రమే ఉంటే.. మన రాష్ట్రంలో అది 382 మిలియన్ యూనిట్లకు చేరింది. బహిరంగ మార్కెట్ ల నుండి గత మూడు నెలల కాలంలో అత్యధిక ధరలకు విద్యుత్ ను కొనుగోలు చేయడంవలన రూ.1037 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతోంది. ఈ భారం చార్జీల రూపంలో నేడు డిపాజిట్ల రూపంలో ప్రజలపైన మోపుతూ వారి నడ్డి విరుస్తోంది. మార్చి నెలలో అత్యధికంగా యూనిట్ కు రూ.18.48, ఏప్రిల్ నెలలో రూ.12.89, మే నెలలో రూ.11.72 వెచ్చించి కమిషన్ల కోసం కక్కూర్తిపడి బహిరంగ మార్కెట్ నుండి కొనుగోలు చేసింది.
– దామోదరం సంజీవయ్య కృష్ణపట్నం పవర్ ప్లాంట్ లో యాష్ హాపర్స్ నిర్వహణ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి బినామీలకు కట్టబెట్టి కోట్లు దిగమింగారు. కానీ నేడు ఆ బినామీల నిర్వహణాలోపం వల్ల యాష్ హాపర్స్ బద్దలై 800 mw ల విద్యుత్ ఉత్పాదన కృష్ణపట్నం పవర్ ప్లాంట్ లో నిలిచిపోయిన పరిస్థితి
గతంలో చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ, కృష్ణపట్నం పవర్ ప్లాంట్లలో నిర్మాణం ప్రారంభించినా 1600 mw ల విద్యుత్ ప్లాంట్లు 90 శాతం పనులు పూర్తయినా నేటికీ ప్రారంభించకపోవడంవల్ల తీవ్ర విద్యుత్ కొరత నెలకొంది.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొద్దిరోజుల క్రితం తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ‘‘తమ పరిపాలన అద్భుతంగా ఉందని, ప్రజలు అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో 175 కు 175 సీట్లలో విజయం సాధిస్తా’’ మని ధీమా వ్యక్తం చేసిన సందర్భంలో కొంతమంది ఎమ్మెల్యేలు వివిధ రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఆయన దృష్టికి తెచ్చారు. కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ కోతలపై ప్రజలలో తీవ్ర అసహనం ఉందని, దానపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రిని కోరగా.. అసలు విద్యుత్ కోతలే రాష్ట్రంలో లేవని గత తెలుగుదేశం పార్టీ పరిపాలనలోకంటే ఎంతో మెరుగ్గా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రతిరోజు దాదాపు రూ.40 కోట్లు వెచ్చించి బొగ్గు కొనుగోలు చేస్తూ విద్యుత్ కోతలు లేకుండా చూస్తున్నామని తనని తాను సమర్థించుకున్నారు. కానీ నేడు వాస్తవాలు దానికి భిన్నంగా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…
కేంద్ర విద్యుత్ శాఖ, సెంట్రల్ ఎలక్ట్రిసిటి అథారిటీవారు ప్రతినెల విద్యుత్ రంగంపై విడుదల చేసే నివేదిక మనం పరిశీలించినట్లయితే రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. వారు విడుదల చేసిన లేటెస్ట్ రిపోర్ట్ (ఏప్రిల్ 2022) మనం గమనించినట్లయితే… దక్షిణాది రాష్ట్రాల్లో అన్నింటికంటే అత్యధికంగా మన రాష్ట్రం డిమాండ్ ఉన్న విద్యుత్ లో 382 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయలేకపోయినట్లు స్పష్టమౌతోంది. ఇతర దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణలో కేవలం 18 MU, కర్నాటకలో 18 MU, కేరళలో 12 MU, తమిళనాడులో 67 MU, పాండిచ్చేరిలో 1 MU మాత్రమే విద్యుత్ కొరత ఉన్నట్లు స్పష్టమౌతోంది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏస్థాయిలో ఉందో ముఖ్యమంత్రిగారు విద్యుత్ రంగంపై చేసిన వ్యాఖ్యలలో ఎంత నిజముందో అర్థమౌతోంది.
రాష్ట్రంలో ఏపీ జెన్కో ఆధ్వర్యంలోని విద్యుత్ ప్లాంట్లను కుట్రపూరితంగా నిర్వీర్యం చేస్తూ వాటిని ప్రైవేటుపరం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఏపీ జెన్కోను పూర్తిగా అదాని జెన్కోగా మార్చి రాష్ట్రంలోని విద్యుత్ వ్యవస్థ మొత్తాన్ని అదానీలకు కట్టబెట్టాలని చూస్తోంది జగన్ సర్కార్. నిన్నటి వరకు పోర్టులను ధారాదత్తం చేసి నేడు విద్యుత్ ప్లాంట్లను కూడా కట్టబెట్టాలని చూస్తోంది. ఈ ప్రక్రియలో ముందుగా కృష్ణపట్నంలోని దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ ను ఎంచుకుంది జగన్ సర్కార్. నేటి ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి వల్ల దామోదరం సంజీవయ్య పవర్ ప్లాంట్ లోని 16వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయే పరిస్థితికి చేరింది.
పవర్ ప్లాంట్ లోని అత్యంత కీలకమైన యాష్ హాపర్స్ నిర్వహణను స్థానిక మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి బినామీలైన రామ్మోహన్ రెడ్డి మరియు నాగార్జునరెడ్డిలకు కట్టబెట్టి ప్రతినెల కోట్ల రూపాయలు దిగమింగుతున్నారు. నేడు ఆ బినామీల నిర్వాకం వల్ల యాష్ హాపర్స్ నిర్వహణ లోపభూయిష్టంగా మారి అవి బద్దలై విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. మే 28వ తేదిన యాష్ హాపర్స్ మొరాయించినప్పటికి నేటికీ ఇంకా 800 మెగావాట్ల ప్లాంట్ లో వాటిని చక్కదిద్ది విద్యుత్ ఉత్పాదన ప్రారంభించలేదు. ఒక్కొక్క 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ కనీసంగా ప్రతిరోజు 15 మిలియన్ యూనిట్ల విద్యుత్ ని ఉత్పత్తి చేయగలదు.
ఆరకంగా దామోదరం సంజీవయ్య విద్యుత్ ప్లాంట్ నుండి ప్రతిరోజు కనీసంగా 30 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి అవకాశం ఉంటుంది అంటే నెలకు 900 మిలియన్ యూనిట్లు. కానీ నేడు వైసీపీ నాయకుల అవినీతి దాహానికి జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్షానికి గురై దామోదరం సంజీవయ్య విద్యుత్ ప్లాంట్ పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకొని నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ విద్యుత్ ప్లాంట్ లో వాడే బొగ్గుకూడా నాసిరకంగా బొగ్గు వాడడంవల్ల ప్లాంట్ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
దామోదరం సంజీవయ్య విద్యుత్ ప్లాంట్ లో 75శాతం హై క్వాలిటీ వాష్డ్ కోల్ మరియు కేవలం 25 శాతమే రా కోల్ వాడాల్సివుండగా నేడు జగన్ సర్కార్ బొగ్గు కొనుగోలులో కూడా పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతూ నాసిరకం బొగ్గు కొనుగోలు చేసి దామోదరం సంజీవయ్య విద్యుత్ ప్లాంట్ లో హై క్వాలిటీ వాష్డ్ కోల్ వినియోగించకుండా నాసిరకం కోల్ వినియోగిస్తోంది. దానివల్ల కూడా నేడు ఆ ప్లాంట్ పూర్తిగా దెబ్బతిని విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా సంజీవయ్య పవర్ ప్లాంట్ ను పూర్తిగా దెబ్బతీసి నేడు అదానీలకు కట్టబెట్టే కుట్రకు తెరలేపింది జగన్ సర్కార్.
గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విజయవాడలోని నార్ల తాతారావు విద్యుత్ ప్లాంట్ లో 800 మెగావాట్లు మరియు కృష్ణపట్నంలోని దామోదరం సంజీవయ్య విద్యుత్ ప్లాంట్ లో 800 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణానికి 2016లో శ్రీకారం చుట్టింది. ఈ రెండు ప్లాంట్ల నిర్మాణానికి దాదాపు రూ.10,000 కోట్లు వెచ్చించాలని నిశ్చయించి 2019 తమ ప్రభుత్వ హయాం చివరికి 90% నిధులను కూడా ఖర్చుచేసి ఈ రెండు ప్లాంట్ల నిర్మాణాన్ని దాదాపుగా పూర్తిచేసింది. ఒక్కక్క 800 మెగావాట్ల ప్లాంట్ ప్రతిరోజు కనీసంగా 15 మిలియన్ యూనిట్లు ఉత్పాదన చేయగలదు.
అంటే చంద్రబాబు శ్రీకారం చుట్టిన ఈ 1600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ రోజుకు 30 మిలియన్ యూనిట్లు, నెలకి 900 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పాదన చేయగల సామర్థ్యం కలవి. కానీ నేటి ఈ జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల ఈ రెండు ప్లాంట్లు నేటికి విద్యుత్ ఉత్పాదనలోకి రాలేదు. డిసెంబర్ 2021లో విజయవాడలోని నార్ల తాతారావు పవర్ ప్లాంట్ లో నూతనంగా నిర్మిస్తున్న 800 మెగావాట్ల ప్లాంట్ ఆయిల్ సింకర్నైజేషన్ పూర్తయి కేవలం ఇంకొక రూ.100 కోట్ల వ్యయంతో కమర్షియల్ ఆపరేషన్స్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నా నేటికీ ఆ పనిఎందుకుచేయలేదో జగన్ సర్కార్ సమాధానం చెప్పాలి.
మార్చి 2022లో కృష్ణపట్నంలోని దామోదరం సంజీవయ్య పవర్ ప్లాంట్ లోని టర్బైన్ల ట్రైల్ రన్ నిర్వహించిన సందర్భంలో ఏర్పడిన చిన్న సాంకేతిక లోపం సరిదిద్దడానికి బీహెచ్ఈఎల్ వారు అడిగిన రూ.5 కోట్లు నిధులను కూడా నేటికీ ఎందుకు విడుదల చేయలేదో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆరకంగా ఉత్పాదనకు సిద్ధంగా ఉన్న ఈ రెండు ప్లాంట్లను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసి నేడు ఆ ప్లాంట్ల నిర్మాణం కోసం తీసుకున్న రుణంపైన ఒక్కో ప్లాంట్ పై నెలకు రూ.60 కోట్ల వడ్డీని కూడా చెల్లించడం ఎంతవరకు సబబు?
ఆ విధంగా అదనపు విద్యుత్ ఉత్పాదన చేసే అవకాశాన్ని వినియోగించుకోకుండా నేడు జగన్ సర్కార్ అత్యధిక ధరలకు విద్యుత్ ను బహిరంగ మార్కెట్ లో కొనుగోలు చేస్తోంది. గడచిన మూడు నెలలకాలంలో బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనుగోలుకు దాదాపు రూ.1690 కోట్లు వెచ్చించింది. మార్చి నెలలో 999 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను యావరేజ్ న యూనిట్ 9రూపాయల 50 పైసలకు కొనుగోలు చేసింది. ఆ నెలలో అత్యధికంగా మార్చి 25వ తేదిన యూనిట్ 18రూపాయల 48 పైసలకు కొనుగోలు చేసింది. ఒక్క మార్చి నెలలోనే బహిరంగ మార్కట్ లో విద్యుత్ కొనుగోలుకు 950 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
ఏప్రిల్ మాసంలో బహిరంగ మార్కెట్ నుండి 503 మిలియన్ యూనిట్లు యావరేజ్ న యూనిట్ 9రూపాయల 56పైసలకు కొనుగోలు చేయడం జరిగింది. ఏప్రిల్ నెలలో 28వ తేదీన అత్యధికంగా యూనిట్ 12రూపాయల 89 పైసలకు కొనుగోలు చేసి ఆ నెలలో మొత్తంగా బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనుగోలుకు 480 కోట్లు వెచ్చించడం జరిగింది. మే మాసంలో బహిరంగ మార్కెట్ నుండి 338 మిలియన్ యూనిట్లు యావరేజ్ న 7రూపాయల 64 పైసలకు కొనుగోలు చేయడం జరిగింది. మేనెలలో అత్యధికంగా 4వ తేదిన యూనిట్ కు 11రూపాయల 72 పైసలు వెచ్చించడం జరిగింది. మే నెల మొత్తంగా బహిరంగ మార్కెట్ విద్యుత్ కొనుగోలుకు రూ.260 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఆరకంగా గత మూడు నెలల కాలంలో కమీషన్లకు కక్కూర్తిపడి అత్యధికంగా యూనిట్ 18రూపాయల 48 పైసలు, 12 రూపాయల 89 పైసలు, 11.72 పైసలకు బహిరంగ మార్కెట్ నుండి జగన్ సర్కార్ కొనుగోలు చేసింది.
సాధారణంగా ఏపీఈఆర్సీ నిర్ణయించిన ధరల మేరకు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే థర్మల్ విద్యుత్ 3 రూపాయల 15 పైసల నుండి 3 రూపాయల 35 పైసల మధ్య లభ్యమౌతుంది. కానీ నేడు జగన్ సర్కార్ కమీషన్ల కోసం కక్కూర్తిపడి సాధారణంగా అందుబాటులో ఉండే ధరల కంటే అత్యధిక ధరలు వెచ్చించి బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనుగోలు చేయడంవలన ఖర్చు చేసిన రూ.1,690 కోట్లలో రూ.1,037 కోట్ల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. ఈ అదనపు భారాన్ని భవిష్యత్తులో వినియోగదారులపై మోపనుంది జగన్ సర్కార్. ఇప్పటికే ట్రూఅప్ చార్జీలు, అదనపు డిపాజిట్ల పేరుతో ప్రతినెల వేల రూపాయల భారాన్ని వినియోగదారులపై మోపుతున్న విషయం విదితమే.
ఆరకంగా భవిష్యత్తులో కూడా జగన్ రెడ్డి తన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా అదనపు విద్యుత్ ఛార్జీల రూపంలో కొనసాగించడానికి నిశ్చయించుకున్నాడు. జగన్ రెడ్డి యొక్క అవినీతి, కమీషన్ల కక్కూర్తి, నిర్లక్ష్యానికి రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.
ప్రతి రోజు కోట్లు వెచ్చించి బొగ్గు కొనుగోలు చేస్తున్న మాట కూడా పచ్చి అవాస్తవం. నేషనల్ పవర్ పోర్టల్ లో పొందుపరచిన సమాచారాన్ని పరిశీలిస్తే ప్రతిరోజు ఏ ఏ థర్మల్ పవర్ ప్లాంట్ లలో ఎంతెంత బొగ్గు నిల్వలున్నాయో సమాచారం పూర్తిగా ఉంటుంది. జూన్ 10వ తేది సమాచారం కనుక మనం పరిశీలించినట్లయితే మన రాష్ట్రంలోని రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ లో మినిమమ్ స్టాక్ గా ఉండాల్సిన బొగ్గు నిల్వ 6లక్షల 56 వేల మెట్రిక్ టన్నులలో కేవలం 4 శాతం మాత్రమే అందుబాటులో ఉంది.
విజయవాడ డాక్టర్ నార్ల తాతారావు విద్యుత్ ప్లాంట్ లో కనీసంగా ఉండాల్సిన బొగ్గు నిల్వ 7లక్షల 42 వేల మెట్రిక్ టన్నులలో కేవలం 20% మాత్రమే నిల్వ ఉంది. దీనిని బట్టి జగన్ రెడ్డి బొగ్గు కొనుగోలు మాటలలో ఎంత నిజముందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఆ రకంగా రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్ల నిర్వహణలో బొగ్గు కొనుగోళ్లలో బహిరంగ మార్కెట్ విద్యుత్ కొనుగోళ్లలో అన్నింటా భారీ అవినీతికి పాల్పడుతూ, ప్లాంట్ల నిర్వహణ విషయంలో పూర్తిగా అశ్రద్ధ వహిస్తూ ఏపీ జెన్కోని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ భవిష్యత్తులో దానిని అదానీ జెన్కోగా మార్చే ప్రక్రియకు మార్గం సుగమం చేశాడు జగన్ రెడ్డి. గత ప్రభుత్వం ముందుచూపుతో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినా వాటిని కూడా నిర్లక్ష్యం చేసి రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరతకు కారకుడయ్యాడు జగన్ రెడ్డి.