-అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో 75 ప్రాంతాలలో యోగా క్యాంప్ లు
– యోగా మన వారసత్వ సంపద
– పోస్టల్ శాఖ చే 5 రూపాయల పోస్టల్ స్టాంప్, ఎన్విలోప్ కవర్ విడుదల..
– మంత్రి విడదల రజిని
జీవితంలో ప్రతి ఒక్కరికీ మానసిక ఒత్తిడులు, ఆందోళనలు (టెన్షన్స్) ఉంటాయని.. ప్రతిఒక్కరూ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ అటిడ్యూడ్ అలవర్చుకోవడానికి యోగానే సరైన మార్గమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని అన్నారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయవాడ ఏ-కన్వెన్షన్ సెంటర్ లో ఆంధ్రప్రదేశ్ ఆయుష్ శాఖ నిర్వహించిన యోగా క్యాంప్‌కు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వందలాది విద్యార్థులతో కలిసి ఆమె యోగాసనాలు వేశారు. కార్యక్రమ అనంతరం అధికారులు విద్యార్థులతో కలిసి ‘నన్ను నేను ఒక ఆరోగ్యవంతమైన, ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడానికి యోగ సరైన జీవన మార్గం అని నమ్ముతున్నాను….’ అని సంకల్పం చేయించారు. ఈ ఏడాది నినాదమైన ‘యోగా ఫర్ హ్యూమానిటీ’ పోస్టర్ ను మంత్రి రజిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి విడదల రజని మాట్లాడుతూ… యోగా అంటే ఒక ఫిలాసఫీ అని, క్రమ శిక్షణతో పాటు పాజిటివ్ థింకింగ్‌ని అలవరుస్తుందన్నారు. యోగా మనందరి వారసత్వ సంపద అని.. తెలుగు వారికి, భారతదేశానికి అత్యంత ప్రాధాన్యత అంశమన్నారు. చాలా మంది విదేశీయులు భారత దేశానికి యోగా నేర్చుకోవడం కోసం వస్తుంటారని… ప్రాశ్చాత్య దేశాల్లో కూడా మన సంప్రదాయాలు పాటిస్తున్నారని తెలిపారు. భారత దేశం గొప్పతనం, మన జీవన శైలిని విదేశీయులు కీర్తిస్తూ ఉంటారని తెలిపారు. యోగాలో డ్రెస్ కోడ్, భారతీయుల వస్త్రదారణ, ఓంకార నాదం ఇలా అనేక విషయాల్లో అమెరికన్స్ కూడా మన దేశాన్ని పొగుడుతున్న సందర్భాలు అనేకం ప్రత్యక్షంగా చూశానన్నారు. ఆరోగ్యమే మహా భాగ్యమని.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ఆరోగ్యం విషయంలో ప్రస్తుతం యువత మనకు ఏం వస్తుంది అనుకోవడం కంటే.. ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచించారు. భక్తిలో కూడా మెరుగైన వ్యక్తులుగా యోగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఒక్కరూ యోగా చెయాలని మంత్రి విడదల రజని తెలిపారు. యోగా ప్రతి వ్యక్తికీ, ప్రతి కుటుంబానికి అవసరమని ప్రస్తుత పరిస్థితిలో కుటుంబంలో అందరూ ఆచరించవలసిన అవసరం ఉందన్నారు. యోగా మానసిక ప్రశాంతతను చేకూర్చడంతో పాటు అన్ని అవయవాలు సక్రమంగా పని చేయడానికి దోహద పడుతుందని మంత్రి శ్రీమతి రజిని అన్నారు. అనంతరం పోస్ట్ మాస్టర్ జనరల్, ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ వారు 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముద్రించిన 5 రూపాయల పోస్టల్ స్టాంప్ ను, ఎన్విలోప్ కవర్ ను మంత్రి రజని విడుదల చేశారు.తదనంతరం జరిగిన అడ్వాన్స్ యోగా ప్రదర్శనలో జల, నీటి, తదితర క్రియలు ప్రదర్శించారు. నూజివీడు ట్రిపుల్ ఐటి విద్యార్థులు యోగాసనాలు ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో బుద్ద యోగా ఫౌండేషన్, బాపట్ల న్యాత్యురోపతి, సెయింట్ ఆన్స్ కాలేజ్ ఎన్ సి సి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కృష్ణా జిల్లా జెడ్పీ వైస్ ఛైర్ పర్సన్ గరికపాటి శ్రీదేవి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శులు ఎం.టి. కృష్ణబాబు, ఎం. రవిచంద్ర, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. పి. శ్యామ ప్రసాద్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె. నివాస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడాసాధికార సంస్థ ఉపాధ్యక్షులు ఎన్. ప్రభాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ వి. వినోద్ కుమార్, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నూపుర్ అజయ్ కుమార్, సబ్ కలెక్టర్ కె. మోహన్ కుమార్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, స్థానిక నాయకులు దేవినేని అవినాష్, తదితరులు పాల్గొన్నారు.