Suryaa.co.in

Andhra Pradesh

పేదల చదువులకు బాబు మోకాలడ్డు

– రాష్ట్ర విద్యా వ్యవస్థలో బైజూస్ ఒప్పందం గేమ్ ఛేంజర్
– పేదరికం విద్యార్థుల చదువులకు అడ్డుకాకూడదనే సర్కారు బడులు బలోపేతం
– పేద పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తుంటే జ్యూస్ అంటూ బాబు వెటకారమా..?
– బైజూస్ పై చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
– బాబు హయాంలో ప్రభుత్వ స్కూళ్ళను నిర్వీర్యం చేసి, విద్యను ప్రైవేటీకరణ చేశాడు
– పేద, బడుగు, బలహీనవర్గాలకు ఇంగ్లీషు మీడియం చదువులు అక్కర్లేదని బాబు ప్రచారం
– నారాయణ, చైతన్య తదితర కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముకాస్తున్న బాబు
-రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి అధ్యక్షతన ఇవాళ రహదారులు భవనాలు, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి, పురపాలక పట్టణాభివృద్ధి, గిరిజన సంక్షేమశాఖలపై జరిగిన సమీక్షలో… అనేక విషయాలను చర్చించడం జరిగింది. పనులు ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్ల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రిగారు ఆదేశాలు ఇచ్చారు. పురపాలక శాఖ పరిధిలోని రోడ్ల మరమ్మతులు అన్నింటినీ జూలై 15లో పూర్తి చేయాలని సూచించారు.
గుంటూరులోని శంకర్‌ విలాస్‌ ఫ్లైఓవర్‌, నిడదవోలు ఫ్లైఓవర్‌ లు పూర్తి చేయాలన్నారు. కార్పొరేషన్లు, మున్పిపాల్టీల్లో జులై 15 కల్లా గుంతలు పూడ్చటంతో పాటు జూలై 20న నాడు-నేడు కార్యక్రమంలో ఫొటో గ్యాలరీలు పెట్టాలని, పంచాయతీ రాజ్‌ రోడ్లకు సంబంధించి ఇప్పుడు చేపడుతున్న పనులే కాకుండా, క్రమం తప్పకుండా నిర్వహణ, మరమ్మతులపై కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రిగారు ఆదేశాలు ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న రోడ్లను అన్నింటినీ కనెక్ట్‌ చేసేలా ప్రణాళికలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

పేదరికం విద్యకు అడ్డు కాకూడదనే..
రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేదరికం విద్యకు అడ్డు కాకూడదనే లక్ష్యంతో పేద విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం చదువులు అందించాలని, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని గ్రామీణ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే క్రమంలో చేస్తున్న సంస్కరణలు, ఎడ్యు టెక్‌ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించడానికి బైజూస్ తో ఒప్పందం చేసుకున్నాం. పేద విద్యార్థులకు మంచి చేస్తుంటే.. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ మోకాలడ్డుతోంది. పేద, బడుగు, బలహీన,దళిత వర్గాల పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం చదువులు వద్దని చంద్రబాబు నాయుడే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాడు.

పేద పిల్లల చదువులపై బాబు వైఖరి ఏంటో మరోసారి తేటతెల్లమైంది
నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడంలో ప్రపంచ వ్యాప్తంగా బైజూస్ పేరొందింది. నాణ్యమైన విద్యను ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లోని పేద పిల్లలకు అందించేందుకు బైజూస్ ముందుకు వచ్చింది. బైజూస్ ను జ్యూస్ అంటూ చంద్రబాబు వెటకారంగా, హేళనగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎడ్యు టెక్‌లో భాగంగా బైజూస్‌ సంస్థ… దేశవ్యాప్తంగా అన్ని కార్పోరేట్‌, పట్టణ ప్రాంత స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం ఎడ్యూకేషన్‌లో షేర్‌, ప్రాముఖ్యత తెలియనది కాదు. అలాంటి సంస్థ ముందుకు వచ్చి ఆ సంస్థ అధినేత రవీంద్రన్‌ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.

నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఉచితంగా బైజూస్‌ సంస్థ విద్యార్థులకు ఉచితంగా కంటెంట్‌ అందించనుంది. అలాంటి నాణ్యమైన మెటీరియల్‌ను ఉచితంగా అందించేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకు ఒక్కో విద్యార్థి బయట మార్కెట్ లో కొనాలంటే రూ.20వేలు నుంచి రూ.25వేలు ఖర్చు అవుతుంది. అంటే సుమారు రాష్ట్రంలో 32 లక్షల మంది పైచిలుకు ఉన్న విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌ను అందించాలంటే రూ. 500 – 600 కోట్లు అవుతుంది. అలాంటి మెటీరియల్‌ను ఉచితంగా అందించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలను వెటకారం చేస్తూ బైజూస్‌ కాదు జగన్‌ జూస్‌ అంటూ చంద్రబాబు మాట్లాడటం పద్ధతి కాదు. చంద్రబాబు వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు మాటలను బట్టి, బడుగు, బలహీన, దళిత వర్గాల పిల్లలు గొప్ప చదువులకు ప్రభుత్వం చొరవ చూపిస్తుంటే.. చంద్రబాబు వైఖరి ఏంటో మరోసారి తేటతెల్లమైంది. రాబోయే రోజుల్లో సాంకేతికంగా ముందుకు వెళ్లేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకించడం ద్వారా చంద్రబాబు తన వైఖరిని బయటపెట్టుకున్నాడు. ఈ వర్గాలంటే బాబుకు ఎప్పుడూ చిన్నచూపే.

పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువులు ప్రవేశపెడితే.. దానిని అడ్డుకుంటూ చంద్రబాబు నానా యాగీ చేశాడు. ఇప్పుడు బైజూస్ సహకారంతో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే దానిపైనా జూస్ అంటూ హేళన చేస్తూ చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోకూడదా.. అని ప్రశ్నిస్తున్నాం. పేద పిల్లలను మంచి చదువులు చదివిస్తుంటే.. చంద్రబాబుకు ఎందుకంత కడుపు మంట..?

కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముకాస్తున్న బాబు
రాబోయే రోజుల్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నాం. ఎన్నో తరాలుగా విద్యకు నోచుకోని దళిత, గిరిజన వర్గాల పిల్లలకు వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మూడేళ్లలో విద్యకు సంబంధించి తీసుకుంటున్న సంస్కరణలు, నిర్ణయాలు వల్ల, ఆ వర్గాల్లో గొప్ప మార్పును చూస్తున్నాం. ఒక తరం ముందుకు వస్తోంది. దీన్ని చూసి ఓర్పలేక చంద్రబాబు నాయుడు అవాకులు చెవాకులు పేలుతున్నాడు. టీడీపీ పాలనలో విద్యను పూర్తిగా ప్రయివేటీకరణ చేసి, చదువును అంగడిలో వస్తువు మాదిరిగా కొనుక్కునేలా చేశారు.
కేవలం ప్రైవేట్‌ రంగంలోనే నాణ్యమైన ఉన్నత విద్య అందుతుందనే ఆలోచనను టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రజలకు కల్పించారు. విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రైవేట్‌ పరం చేశారు. చంద్రబాబు విధానాల వల్ల నారాయణ, చైతన్య సంస్థలు ఏవిధంగా పాతుకుపోయాయో చూశాం. వాటినుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు అడ్డు తగులుతూ కార్పొరేట్‌ విద్యాసంస్థలకు చంద్రబాబు కొమ్ము కాస్తున్నారు. ఈ విషయాలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన ఆలోచనను మార్చుకుంటే బాగుంటుంది.

కార్పొరేట్ స్కూళ్ళకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ళు
ఎన్ని విమర్శలు వచ్చినా, చంద్రబాబు ఎగతాళిగా మాట్లాడినా.. విద్యకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని అమలు చేస్తాం. మార్చికల్లా రాష్ట్రంలోని విద్యార్థులు సీబీఎస్‌ఈ పరీక్షలు ఇంగ్లీష్‌ మీడియంలో రాసేలా దృడ సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. దీనిపై ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేదే లేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికి అందించేలా కార్పొరేట్‌ స్కూళ్లతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాం.
వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక నాణ్యమైన, గుణాత్మకమైన విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. బైజూస్‌తో చేసుకున్న ఒప్పందం శుభపరిణామం. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రాబోయే రోజుల్లో స్కిల్స్‌ను డెవలప్‌ చేసుకోవడానికి ముఖ్యమంత్రి అవకాశం కల్పిస్తున్నారు. బైజూస్‌ విద్యాశాఖలో ఒక గేమ్‌ ఛేంజర్‌. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇది గొప్ప అవకాశం.

LEAVE A RESPONSE