Suryaa.co.in

Entertainment

సినిమా వ్యాసుడు..!

వ్యాసుడు రాసిన
మహాభారతం..
కవిత్రయం అందించిన
మహాగ్రంధం..
చదివామేమో,విన్నామేమో..
కనులారా కనలేని లోటు
తీర్చిన వాడు
కమలాకర కామేశ్వరరావు..
ద్వాపరంలోని మహాకావ్యం
కలియుగంలో దృశ్యకావ్యాలై!

ఐచ్చికమో..యాదృచ్చికమో
కామేశ్వరుడి సినీమాలు
మహాభారత దృశ్యమాలికలు
అన్నీ చూసేస్తే
భారతం అవగతం..
కుంతీపుత్రుల ఇతిహాసం..
పాండవవనవాసం..
అజ్ఞాతవాస హేల..నర్తనశాల
కిట్టయ్య అవతార విహారం
శ్రీకృష్ణావతారం..
సత్యభామా గర్వాపహారం
శ్రీకృష్ణతులాభారం..
అన్నీ కళ్ళకు కట్టినట్టు..
మన ఎదురుగానే జరిగినట్టు!

మాయాజూద సన్నివేశం..
ధర్మరాజు గుమ్మడి
వ్యసనమోహం…
అర్జునుడు బాలయ్య నిస్సహాయత..
శకుని లింగమూర్తి అఘాయిత్యం..
రారాజు ఎస్వీఆర్ ఆభిజాత్యం..
కర్ణుడు ప్రభాకరరెడ్డి పరుషం
భీముడు ఎన్టీఆర్ పౌరుషం..
దుశ్శాసనుడి మిక్కిలి వేషం..
పాంచాలి సావిత్రి
కష్టం చూసిన
శ్రీకృష్ణుడు కాంతారావు
లీలా మానుషం..
నాటి కురుసభ
వ్యాసుని ఘంటం మహిమ
నిన్నటి కమలాకరుని
దర్శకత్వ పటిమ!

వీరాంజనేయ ప్రభుభక్తి రసభరితం…
మహాకవి కాళిదాసు
అపురూప చరితం..
కృష్ణదేవరాయుని పొరపాటుతో
మహామంత్రి తిమ్మరుసు
కథ వ్యధాభరితం..
నాటి పురాణాలు..
కామేశుని దర్శకత్వ ప్రమాణాలు..!

పురాణ కథల చిత్రీకరణలో
అందెవేసిన చేయి..
సాంఘికాల్లోనూ ఓ చెయ్యి..
గుండమ్మకథ..ఎన్నిమార్లు
చూసినా తనివి తీరని
హాస్య కథ..ఇంటింటి గాధ..
ఎప్పుడు ఎవరొస్తే వారితోనే
తీసేసిన సన్నివేశాలు..
దర్శకత్వ నిష్ట..
కమలాకర కామేశ్వరరావు
ప్రతిభకు పరాకాష్ట!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE