Suryaa.co.in

Andhra Pradesh

రేపటి ఉద్ధవ్ ఠాక్రే జగన్ రెడ్డే

-జగన్ కంటే ఉద్ధవ్ మంచోడే…
-కానీ ఆయన అహంకారాన్ని భరించలేం
-ఏపీ ప్రజల్లో చైతన్యం వచ్చింది…
-వైకాపా ఎమ్మెల్యేలలో ఇప్పుడిప్పుడే వస్తుంది
-జగన్ రెడ్డి చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు
-చలి జ్వరంతో వనికి పోతుంది .. కక్షతో రగిలిపోతుంది ఆ ప్యారిసొడే
-టైం వచ్చినప్పుడు అందరి చరిత్రలు బయటపెడతా
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

రేపటి ఉద్ధవ్ ఠాక్రే ఎవరు రా?… అంటే అందరూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే అని అంటున్నారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే మనిషి మంచోడని, తెలివైన వాడన్నారు. కానీ ఎదుటి వారి అహంకారాన్ని ఇతరులు ఎవ్వరు తట్టుకోలేరని చెప్పారు. తెలివి తక్కువ వాడిని క్షమించవచ్చని, మతి లేని తనాన్ని పాపం పిచ్చోడని సరిపెట్టుకోవచ్చన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్లీనరీలలోనూ ఎమ్మెల్యేలు ఎదురు తిరుగుతున్నారని, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చైతన్యం వచ్చిందని… ఇప్పుడిప్పుడే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో చైతన్యం వస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి అహంకారానికి ప్రజలు చెల్లు చీటీ రాసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నెగ్గుతానని జగన్మోహన్ రెడ్డి భావిస్తే, తక్షణమే ఎన్నికలను నిర్వహించాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డికి ఒక్కరు కూడా ఓటు వేయరని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ప్లీనరీలకు కూడా డ్వాక్రా మహిళలను తెచ్చుకునే దుస్థితికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దిగజారిందన్నారు. ఇంకా కూడా తనను పార్టీలో కొనసాగించడానికి సిగ్గు ఉండాలన్న ఆయన, తనపై అనర్హత వేటు పడుతుందని ప్రచారం చేశారని, తనపై ఎందుకు అనర్హత వేటు పడుతుందో చెప్పాలని ప్రశ్నించారు.

మాటలు… చేతలకు పొంతన లేదు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది మరొకటని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. బాదుడే …బాదుడు అంటూ ప్రతిపక్షనేతగా విమర్శలు గుప్పించిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు తాను చేస్తున్నది ఏమిటి అని ప్రశ్నించారు. లీటరు డీజిల్ ధర పది రూపాయలు తగ్గితే, రాష్ట్ర ప్రభుత్వం సెస్సును పెంచి ఆర్టీసీ బస్సు చార్జీలను అమాంతం 45 శాతం పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ చార్జీలు, విద్యుత్ చార్జీలను పెంచుతూ తానేదో సమాజసేవ చేస్తున్నట్లుగా ఫోజులు కొడుతున్నారని మండిపడ్డారు. నువ్వు ప్రత్యేక విమానాలలో విదేశాలకు వెళుతున్నప్పుడు ఎన్ని సూట్ కేసులను తీసుకువెళ్తున్నావో ప్రజలు గమనించడం లేదని అనుకుంటున్నావా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్లు లేవు… బస్సులు లేవు, టాక్సులను తగ్గించింది లేదు… వీలైనంత చార్జీలను పెంచుతాం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతుందని ఆయన ఎద్దేవా చేశారు.

నీ మనసులో అనుకుంది రాస్తావా … యాక్ చీ (సాక్షి)
రఘురామపై సుప్రీంకోర్టు అసహనం అన్న సాక్షి దినపత్రిక కథనంపై నర్సాపురం ఎంపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు జెడ్ కేటగిరి భద్రత కల్పించిన విషయాన్ని తానే కోర్టుకు నివేదిస్తే, తనపై కోర్టు ఎందుకు అసహనం వ్యక్తం చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. కోర్టులో జరిగినది ఒకటైతే… సాక్షి దినపత్రిక తన మనసులో ఊహించుకొని రాసిందని ఎద్దేవా చేశారు.. నీ మనసులో నువ్వు ఊహించుకొని రాసేది వ్యూస్ అవుతుంది కానీ… న్యూస్ ఎలా అవుతుంది రా చండాలుడా అని మండిపడ్డారు. సాక్షి దినపత్రిక అవినీతిలో పుట్టి, అవినీతిలో పెరిగి, చెత్త వార్తలను రాస్తుందని నిప్పులు చెరిగారు.

సిఐడి కోటింగ్… ప్రభావతి కవరింగ్
సిఐడి అధికారులు బాధితులను చితకబాదితే, వైద్య నివేదికలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ప్రభావతి తారుమారు చేస్తుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. తనని సిఐడి అధికారులు చిత్రహింసలకు గురి చేసినప్పుడు కూడా తన వైద్య నివేదికను తారు మారు చేయగా, మిలిటరీ ఆసుపత్రి ఆమె బండారాన్ని బయటపెట్టిందన్నారు.. ప్రభావతి భర్త గుంటూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నట్లు తెలిసిందని చెప్పారు. భార్య కోసం భర్తకు ఆ పోస్టు ఇచ్చారో, లేకపోతే భర్త కోసం భార్యను తెచ్చి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ గా నియమించారో తెలియదన్నారు. ఒకటి మాత్రం నిజమని, వైద్య నివేదికలను తారుమారు చేయడానికి ఆమెకు ఆ పోస్టు ఇచ్చినట్లుగా కనిపిస్తుందన్నారు. తన వైద్య నివేదిక తారుమారు చేశాక, కొంతమంది వైద్యులు తనతో మాట్లాడి అసలు విషయాన్ని చెప్పారన్నారు.. ఇప్పటివరకు సుప్రీంకోర్టులో కేసు వాదనలకు రాకుండా అడ్డుకోగలిగారని, కానీ త్వరలోనే కేసు ఈయరింగ్ వస్తుందని చెప్పారు.. అప్పుడు సాక్షులుగా ఎవరిని ప్రవేశపెట్టాలో తనకు తెలుసునని, ఆ వైద్యులు అసలు విషయాన్ని చెబుతారని, అప్పుడు ప్రభావతి బండారం బయటపడుతుందని వెల్లడించారు.

హ్యాట్సాఫ్ టు సలావుద్దీన్
సిఐడి ప్రత్యేక కోడ్ న్యాయమూర్తి సలావుద్దీన్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నానని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఏపీ సి ఐ డి వరస్ట్ అని న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఆ శాఖ నిర్వహిస్తున్న వారిని ఉద్దేశించినవేనని భావించాల్సి ఉంటుందన్నారు. ఏపీ గవర్నమెంట్ వరస్ట్ అంటే ఆ వ్యాఖ్యలు ముఖ్య మంత్రిని ఉద్దేశించినవేనని అనుకుంటామన్నారు. ఇక అర్ధరాత్రి సిఐడి పోలీసులు నోటీసు ఇవ్వడానికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇంట్లోకి వెళ్లకుండానే కంప్యూటర్లు బద్దలు కొడుతున్నారని సిఐడి అధికారికి ఎలా తెలిసిందని నిలదీశారు. అర్ధరాత్రి ఇళ్లల్లోకి ప్రవేశించే సిఐడి అధికారులపై ప్రైవేటు కేసులను పెట్టాలని రఘురామరాజు సూచించారు. తెలుగుదేశం తమ ప్రత్యర్థి పార్టీ అయినా, పోలీసులపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని వారు కేసు తీసుకోకపోయినా, ఫిర్యాదు చేసి న్యాయస్థానాలను ఆశ్రయించాలని కోరారు. త్వరలోనే రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందని, అప్పుడు తప్పు చేసిన అధికారులకు ఏడేళ్లు జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాలను ఉల్లంఘించిన పోలీసులను ప్రభుత్వం మారాక చట్టబద్ధంగా శిక్షిద్దామని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు పై అసత్య కథనాలను రాసిన సాక్షి దినపత్రిక పై ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వాలని రఘురామకృష్ణంరాజు , ఆయన కుసూచించారు. ప్రభుత్వం మారాక సాక్షి పబ్లిషర్ ను బొక్కలో పెట్టాలన్నారు. త్వరలో మీ ప్రభుత్వం వస్తుందని, మిమ్మల్ని ఎన్నుకోవడం మినహా ప్రజలకు మరొక ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. సిఐడి పోలీసుల బాధితులకు తాను అండగా ఉంటానని పేర్కొన్నారు.

భీమవరం రాకుండా అడ్డుకునేందుకు ఏ 1, ఏ.2 కుట్రలు
భీమవరంలో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తాను పాల్గొనకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలు అనేక కుట్రలు చేస్తున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఫారిన్ వెళ్ళిన ఏ 1, ఇక్కడున్న ఏ 2 లు ఈ రెండు రోజులపాటు తనని అడ్డుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యం లో తనకు నోటీసులు ఇచ్చినట్లుగా వచ్చి, విధి నిర్వహణను అడ్డుకున్నానని కేసులు పెట్టే అవకాశాలు లేకపోలేదన్నారు. భయంతో వనికిపోతున్నది ఎవరో అందరికీ తెలుసు నన్న ఆయన, తప్పులు చేయడం… కాళ్లు పట్టుకోవడం మీకు అలవాటే కదా అంటూ సాయి రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పారిస్ లో చలి జ్వరంతో వనికి పోతున్నది ఎవరో, కక్షతో రగిలిపోతున్నది ఎవరో ప్రజలకు తెలుసునని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. విజయసాయి చేసిన ట్వీట్ కు తగిన రీతిలో సమాధానం చెప్పానన్న ఆయన, తన హెలికాప్టర్ అనుమతించకుండా జిల్లా కలెక్టర్ పై ముఖ్యమంత్రి ఒత్తిడి తెచ్చారని చెప్పారు. ప్రధాని దిగుతున్నచోటి కి 1.2 కిమీ దూరంలో ట్రాన్స్మిషన్ లైన్లు లేవా?, తాను దిగుతున్న చోటికి 1.2 కి మీ దూరంలో ట్రాన్స్మిషన్ లైన్లు ఉన్నాయని అనుమతించరా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హెలిక్యాప్టర్ దిగడానికి అనుమతించిన స్కూలు యాజమాన్యాన్ని వేధిస్తున్న ప్రభుత్వ పెద్దల తీరుపై రఘురామ కృష్ణంరాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.. ఇక సమయం వచ్చినప్పుడు అందరి చరిత్రలను బయటపెడతానన్న ఆయన, ముందు ఏ 2, కుటుంబ చరిత్ర మొత్తం చెబుతానని అన్నారు.

LEAVE A RESPONSE