మూడు దశాబ్దాలపాటు
మూడొందల చిత్రాలకు పైగా
అద్భుతంగా నటించి
తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాలలో
చిరస్థాయిగా నిలిచిపోయిన
వెండితెర వెన్నెల…!!
ఆంగిక ,వాచిక ,ఆహార్య
స్వాతికాభినయాలు
కలబోసిన సహజనటుడు…!!
తెలుగు చలన చిత్ర చరిత్రకు
ఆయన ముఖ చిత్రం
వైవిద్యం ,హుందాతనం
తెంపరితనం ,కరుణరసం
హాస్యరసం, భీభత్సం
ఆవేశం ,శాంతి…..
ఎందులో అయినా సరే
ఆయనకు మించిన వారు
కానీ ……
కనీసం ఆయన దరిదాపుల్లోకి
వచ్చిన వారు కానీ ….
తెలుగునేలపై
ఇప్పటిదాకా పుట్టలేదు
అనడంలో అతిశయోక్తి లేదు….!!
మీసం మెలేసి
కనుబొమ్మలని ముడేస్తే
యస్వీఆర్ ముందు
అంతా బలాదూర్ …!!
భోజరాజు, రాజరాజు
ఏ వేషం కట్టినా
యశస్వియార్
అనే కితాబు షూర్ ….!!
చేసే పాత్రలో
పరకాయ ప్రవేశం చేయటంలో
నూరు శాతం ఒప్పించి
మెప్పించిన విశ్వనటచక్రవర్తి….!!
రావణుడు, హిరణ్యకశిపుడు ఘటోత్కచుడు, కంసుడు,
కీచకుడు ,నరకాసురుడు
మాంత్రికుడు,
ప్రతినాయక పాత్రలలో,
సహాయక పాత్రలో
తనదైన ముద్రతో
రంజింపచేసిన నట సార్వభౌమ….!!
పాత్రలో జీవించి
తను మాత్రమే ఎలివేట్ అయ్యే….
నట నరసింహ…!!
రచ్చ గెలిచి
ఇంట గెలవక పోయినా
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో
స్వార్ధం లేని సహృదయుడు,
చమత్కారుడు,దాన కర్ణుడు
వేదాంతోత్తముడుగా
శాశ్వతంగా నిలిచి
చిత్రసీమను వీడి
స్వర్గసీమను చేరిన నటశేఖరుడు
“విశ్వ యశస్వి “రంగా రావు గారు….!!
నలిగల రాధికా రత్న.