దిగ్గజ నటుడు, నడిగర్ తిలకం శివాజీ గణేశన్ కుటుంబంలో ఆస్తి చిచ్చు రేగింది. ఆయన మరణించిన రెండు దశాబ్దాల తర్వాత కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. తన తండ్రి ఆస్తిలో తనకు వాటా ఇవ్వలేదంటూ నటుడు ప్రభు, నటుడు, నిర్మాత రామ్‌కుమార్ లపై తోబుట్టువులు శాంతి, రాజ్వీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
తండ్రి మరణం తర్వాత రూ. 271 కోట్ల ఆస్తిని సరిగా పంచలేదని, తమకు వాటాలు ఇవ్వకుండా మోసం చేశారని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో వారు పేర్కొన్నారు. తమకు తెలియకుండానే ఆస్తులను విక్రయించేశారని, అది చెల్లదని ప్రకటించాలని కోర్టును అభ్యర్థించారు. వెయ్యి సవర్ల బంగారు నగలు, 500 కిలోల వెండి వస్తువులను సోదరులు ప్రభు, రామ్‌కుమార్ అపహరించారని ఆరోపించారు.
శాంతి థియేటర్లో ఉన్న రూ. 82 కోట్ల విలువైన వాటాలను వారు తమ పేరున మార్చుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ తండ్రి రాసినట్టు చెబుతున్న వీలునామా నకిలీదని పేర్కొన్నారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీపై సంతకం తీసుకుని తమను మోసం చేశారని ఆరోపించారు. ఈ కేసులో ప్రభు, రామ్కుమార్ల కుమారులు విక్రమ్ ప్రభు, దుష్యంత్‌లను కూడా ప్రతివాదులుగా చేర్చడం గమనార్హం.