Suryaa.co.in

Telangana

ఆగస్టు 2 నుండి బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర షురూ

– ఈనెల 21 నుండి నియోజకవర్గాల్లో ‘పల్లె గోస – బీజేపీ భరోసా’ పేరిట బైక్ ర్యాలీలు
– రేపు కరీంనగర్ లో ‘మౌన దీక్ష’
– బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వెల్లడి
– తరుణ్ చుగ్, సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన నర్సంపేట నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టనున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర తేదీ ఖరారైంది. ఆగస్టు 2 నుండి 20 రోజులపాటు పాదయాత్ర చేయనున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, పన్నాల శ్రీరాములు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, రాష్ట్ర నాయకులు రాజ్ వర్ధన్ రెడ్డిలతో కలిసి తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 2 నుండి ప్రారంభమయ్యే మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. అట్లాగే పోడు భూములు, ధరణి సమస్యలపై రేపు కరీంనగర్ లో బండి సంజయ్ ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ‘మౌన దీక్ష’ చేపడతారని పేర్కొన్నారు.

అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటంలో భాగంగా ఈనెల 21 నుండి ‘పల్లె గోస – బీజేపీ భరోసా’ పేరిట అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో దాదాపు 30 మంది సీనియర్ నేతలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బైక్ ర్యాలీలు నిర్వహిస్తారని, రాత్రి పూట పల్లెల్లోనే బస చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలనలో గోస పడుతున్న ప్రజలకు న్యాయం జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆజాదీ కా అమ్రుతోత్సవ్ నేపథ్యంలో ఆగస్టు 9 నుండి 15 వరకు రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త నివాసాలపై జాతీయ జెండాను ఎగరేయాలని పిలపునిచ్చారు.

మరోవైపు నర్సంపేట నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. మాజీ ఎంపీపీ గటిక అజయ్ కుమార్, మాజీ ఎంపీటీసీ గోపాల్, సర్పంచ్ వడ్డే రజిత సర్పంచ్ సహా వందలాది మంది టీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. వారికి తరుణ్ చుగ్, బండి సంజయ్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

LEAVE A RESPONSE