తెలంగాణలో విద్యా సంస్థలకు మరో 3 రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ కేసీఆర్ సర్కారు బుధవారం మధ్యాహ్నం నిర్ణయం తీసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగానే ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వర్షాల కారణంగా ఇప్పటికే తెలంగాణలో విద్యా సంస్థలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సెలవులను మరో 3 రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తాజా ప్రకటనతో ఈ నెల 18న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. మొత్తంగా వర్షాల కారణంగా ఈ వారం మొత్తం పాఠశాలలు తెరచుకోలేదు. గత శనివారం పని చేసిన పాఠశాలలు ఆదివారం సెలవుతో తిరిగి సోమవారం ప్రారంభం కావాల్సి ఉండగా… వర్షాల కారణంగా 3 రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సెలవులు ముగియనున్న బుధవారం మరో 3 రోజుల పాటు సెలవులను పొడిగించారు. వెరసి తెలంగాణలో వరుసగా 8 రోజుల పాటు విద్యాలయాలు మూతపడినట్టయింది.