Suryaa.co.in

Andhra Pradesh

పెన్నా నది వరద ప్రభావిత ప్రాంతానికి పరిష్కారం

-రూ.95 కోట్లతో రక్షణ గోడ నిర్మాణం
-ప్రజా సంక్షేమానికి పెద్దపీట
-నెల్లూరు జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు

నెల్లూరు: పెన్నా నదికి భవిష్యత్తులో ఎలాంటి వరద ముప్పు వాటిల్లినా నెల్లూరు నగర శివారు ప్రాంతాలైన వెంకటేశ్వరపురం, భగత్ సింగ్ కాలనీ ప్రజల ఇళ్లల్లోకి ఒక్క బొట్టు కూడా వరద నీరు రాకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు సుమారు రూ. 95 కోట్ల తో పెన్నానదికి కాంక్రీట్ రక్షణ గోడను పటిష్టంగా నిర్మించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
బుధవారం ఉదయం నెల్లూరు భగత్ సింగ్ కాలనీ లో పెన్నా నది రక్షణ గోడ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో కలిసి మంత్రి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ 2021 నవంబర్లో ఊహించని వరద ప్రవాహంతో భగత్ సింగ్ కాలనీ, వెంకటేశ్వరపురం ప్రాంతాలు నీట మునిగాయని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కాంక్రీట్ రక్షణ గోడ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరు చేశారని, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి మరో ఏడాదిలోగా కాంక్రీట్ రక్షణ గోడను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ రక్షణ గోడ నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాత మీ వద్దకు వచ్చి ఓట్లు అడుగుతామని, ఏదైనా పని చేసిన తర్వాత ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగితే మనసుకు ఎంతో తృప్తిగా ఉంటుందన్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, ఇప్పటివరకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఎటువంటి అవినీతికి తావు లేకుండా, దళారుల ప్రమేయం లేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో సుమారు ఒక లక్షా అరవై వేల కోట్ల రూపాయలు జమ చేశారని స్పష్టం చేశారు.

మాజీ మంత్రి అనిల్ కుమార్ హయాంలో సంగం, పెన్నా బ్యారేజ్ నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయని, మరో నెల రోజుల్లో పనులన్నీ పూర్తవుతాయని, త్వరలోనే ఈ రెండూ బ్యారేజీలను ముఖ్యమంత్రి చేతుల మీదగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నగర ఎమ్మెల్యే శ్రీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ 53, 54 డివిజన్ల ప్రజలకు పెన్నా నది వరద ముప్పు నుంచి శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో తొలుత మట్టితో రక్షణ గోడలు నిర్మించాలని తలపెట్టగా, దీనికి ఎక్కువ విస్తీర్ణం కావాల్సి రావడం తో సుమారు 1200 ఇళ్లు తొలగించాల్సి ఉందని, అదే కాంక్రీట్ తో గోడ నిర్మిస్తే ఈ సమస్య ఉండదని భావించి సుమారు 100 కోట్లతో కాంక్రీట్ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశామన్నారు. ఈ కాంక్రీట్ గోడ నిర్మాణం చేపట్టే మార్గంలో సుమారు 30 ఇళ్లు మాత్రమే తొలగించాల్సి ఉంటుందని, వీరందరికీ కూడా ప్రభుత్వం ద్వారా స్థలం చూపించి ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పారు.

అలాగే పెన్నా నది పై మరో వంతెన నిర్మాణానికి త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వంలో ఎవరికీ అన్యాయం చేయకూడదనే లక్ష్యంతోనే తామంతా పనిచేస్తున్నామన్నారు. వెంకటేశ్వరపురం, భగత్ సింగ్ కాలనీల్లో నీటి సమస్య పరిష్కారానికి ఎనిమిది కోట్లతో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ను నెలకొల్పేందుకు చర్యలు చేపట్టామని, మరో 20 రోజుల్లోనే ఈ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ పనులన్నీ పూర్తి చేసిన తర్వాతనే మీ వద్దకు వచ్చి ఓట్లు అడుగుతానన్నారు. త్వరలోనే గడపగడపకు కార్యక్రమం మొదలు పెట్టి ప్రతి ఇంటికి వచ్చి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించి, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.

జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ వ్యవసాయానికి మన జిల్లా ఎంతో ప్రసిద్ధి చెందిందని, జలాశయాల్లో 150 టీఎంసీల నీరు రైతులకు అందుబాటులో ఉండడంతో పాటు విస్తీర్ణం, జనాభాలో రాష్ట్రంలోనే మన జిల్లా ఒక ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పెన్నా, సంగం బ్యారేజి నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తోందని చెప్పారు. సుమారు 150 ఏళ్ల తర్వాత ఎవరూ ఊహించని విధంగా పెన్నా నదికి వరద పోటెత్తిందని, దీంతో ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులయ్యారన్నారు. సుమారు 6 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలినట్లు చెప్పారు. ఈ విపత్తు సమయంలో ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి భోజన వసతి కల్పించామని, అలాగే వరదల్లో చిక్కుకున్న సుమారు 30 వేల మందిని కాపాడమని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పెన్నానదికి రక్షణ గోడల నిర్మాణానికి ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేయడం శుభపరిణామమన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు గంగ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ హరినారాయణ, ఆర్డిఓ కొండయ్య, నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE