Home » యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టండి

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టండి

-క్షేత్రస్థాయిలోకి అధికారులను పంపించండి
-పంట పొలాల వద్దకు అధికారులను పంపించి నష్టపరిహారం అంచనా వేయించాలి
-నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

అకాల వర్షాలతో రాష్ట్రంలో జన జీవనం అస్థవ్యస్థమైనందున యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మరో రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, క్షేత్రస్థాయికి పంపించి, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే గోదావరి నది జలాల మీద ఉన్న ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేసిన నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గోదావరి తీరంలోని ఆయా గ్రామాల్లో రాకపోకలు బంద్ కావడం వల్ల ప్రజలు అత్యవసర సేవలు అందక పడుతున్న ఇబ్బందులను గుర్తించి, ప్రభుత్వం వెంటనే వారికి అన్ని సహాయక చర్యలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకపోతే పెను విపత్తు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వరదల కారణంగా ఇళ్ల నుండి ప్రజలు బయటకు రాలేని ప్రాంతాలను తక్షణం గుర్తించి అక్కడ ఆహారం, తాగునీరు, ఇతర నిత్యావసరాలు అందించేలా కార్యచరణ ఉండాలని ప్రభుత్వానికి సూచించారు.

అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. వర్షాలు తగ్గిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను పంట పొలాల దగ్గరకు పంపించి పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి నష్టపోయిన ప్రకారంగా రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

సహాయక చర్యలు చేపట్టండి
వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన సహాయ చర్యలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply