– 1981లో మానవుల్లో కనిపించిన ఎయిడ్స్
నివారణే తప్ప మందులు లేని అత్యంత భయంకరమైన ఎయిడ్స్ వ్యాధిపై ఇజ్రాయెల్ పరిశోధకులు విజయం సాధించారు. హెచ్ఐవీకి వ్యాక్సిన్ అభివృద్ధి చేసి రికార్డులకెక్కారు. జన్యు సవరణ ద్వారా హెచ్ఐవి-ఎయిడ్స్‌ను సమర్థంగా ఎదుర్కోగలిగే టీకాను అభివృద్ధి చేసినట్టు టెల్ అవీవ్ వర్సిటీ పరిశోధకుల బృందం ప్రకటించింది. వైద్య రంగంలోనే ఇది పెద్ద పురోగతి అని నిపుణులు చెబుతున్నారు. సెంట్రల్ ఆఫ్రికాలోని ఒక రకమైన చింపాజీలో కనుగొన్న ఎయిడ్స్ వ్యాధి 1981లో తొలిసారిగా మానవుల్లో కనిపించింది. ఎయిడ్స్‌పై ఎన్నోరకాల పరిశోధలు జరిగినప్పటికీ దీనికి శాశ్వతంగా చెక్‌చెప్పే ఔషధం ఇప్పటి వరకు రాలేదు.
హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV) శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. దీనికి సరైన చికిత్స కనుక తీసుకోకపోతే అది అక్వైర్డ్ ఇమ్యునో డిఫిషియెన్సీ సిండ్రోమ్ (AIDS)కి దారి తీస్తుంది. టెల్ అవీవ్ యూనివర్సిటీలోని ది జార్జ్ ఎస్ వైజ్ ఫ్యాకల్టీ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లోని స్కూల్ ఆఫ్ న్యూరోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్ పరిశోధకుల బృందం దీనిపై పరిశోధన నిర్వహించింది. టైప్- బి తెల్ల రక్త కణాల ద్వారా అభివృద్ధి చేసిన ఒకే టీకాతో వైరస్‌ను న్యూట్రలైజ్ చేయడంలో పరిశోధకులు విజయం సాధించారు. హెఐవీని న్యూట్రలైజ్ చేసే ప్రతిరోధకాలను ఈ టీకా ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థను తిరిగి యాక్టివ్‌గా మారుస్తుంది.
పరిశోధనలో భాగంగా చికిత్స తీసుకున్న కొందరి రక్తంలో కావాల్సినన్ని యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి. ఈ పరిశోధన విజయవంతం కావడంతో భవిష్యత్తులో ఎయిడ్స్‌కు మందులు కూడా ఉత్పత్తి చేస్తామని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు. తాము చికిత్స అందించిన అన్ని ల్యాబ్ మోడళ్లు బాగా ప్రతిస్పందించాయని, వారి రక్తంలో కావాల్సిన యాంటీబాడీని అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయగలిగామని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ బార్జెల్ వివరించారు.