– పార్లమెంట్ లో సంబంధిత మంత్రిత్వ శాఖను ప్రశ్నించిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి
దేశవ్యాప్తంగా స్కిల్ హబ్‌లని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదా… అలా అయితే దాని వివరాలు, రాష్ట్రాల వారీగా స్కిల్ హబ్‌ల అభివృద్ధికి కేటాయించిన నిధుల వివరాలు ఇవ్వగలరు. ఆంధ్రప్రదేశ్‌లో ఏదైనా కొత్తగా స్కిల్ హబ్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుందా? అలా అయితే, దాని వివరాలు ఇవ్వగలరు అని తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత శాఖామాత్యులు ధర్మేంద్ర ప్రధాన్ బదులిస్తూ.. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 (పి.ఎం.కె.వి.వై 3.0) లో భాగంగా 01.01.2022 తేదీన స్కిల్ హబ్స్ ఇనిషియేటివ్ (SHI)ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖతో పాటు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ప్రారంభించిందని స్కిల్ హబ్స్ ఇనిషియేటివ్ (ఎస్.హెచ్.ఐ) అనేది జాతీయ విద్యా విధానం, 2020 (NEP, 2020) కింద విధంగా సాధారణ విద్యతో పాటు వృత్తి విద్యని కూడా కలిపి నేర్పించడం అని చెప్పారు.
స్కిల్ హబ్‌లు అనేవి నైపుణ్యాభివృద్ధి మరియు విద్య మానేసిన వారికీ మరియు విద్యలేని అభ్యర్థులకు వృత్తి శిక్షణ అవకాశాలను అందించడానికి గుర్తించబడిన నోడల్ నైపుణ్య కేంద్రాలు అని చెప్పారు. అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడానికి మరియు సర్టిఫై చేయడానికి పైలట్ ఎస్.హెచ్.ఐ మొత్తం అంచనా వ్యయం రూ. 700 కోట్లు. ఎస్.హెచ్.ఐ – పి.ఎం.కె.వి.వై 3.0 కింద అభ్యర్థుల నమోదుకు చివరి తేదీ 31.03.2022 అని తెలిపుతూ ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశవ్యాప్తంగా ఎస్.హెచ్.ఐ పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించబడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 48 స్కిల్ హబ్‌లు ఉన్నాయని బదులిచ్చారు.