-స్కూళ్ల విలీన ప్రక్రియ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
-ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పెను ప్రమాదమే
-175 కాదు కదా… మన ఉనికినే ప్రజలు మాయం చేస్తారు
-ప్రభుత్వ పాఠశాలలను మానేసిన 11 లక్షల మంది విద్యార్థులు
-విద్యార్థులు లేరని స్కూలు స్థలాలను అమ్మేసిన అమ్మేస్తారు
-విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తూ 140 మంది ఎమ్మెల్యేలు మంత్రి సత్తి బాబుకు లేఖ రాసే ఛాన్స్
-ఈ ప్రభుత్వం మళ్లీ వచ్చే అవకాశం లేదు కాబట్టి… ప్రజలకు రేపటి పాలకులు ఒక భరోసాను ఇవ్వాలి
-బీసీ అభ్యర్థి కాబట్టే మద్దతు ఇస్తున్నాము అన్నది ప్రజలను మభ్యపెట్టడానికే
-ప్రతిపక్ష నేతగా ప్రశ్నించమని చెప్పి… ఇప్పుడు ప్రశ్నిస్తే అక్రమ కేసులు, హత్యలు… ఆత్మహత్యలు… చితకబాదు తారా?
-సాక్షి నీలి ఛానల్ కు అనుమతులు సున్నా… రేపో మాపో మూత ఖాయం
-ఋషికొండ విధ్వంసంపై నిజ నిర్ధారణ కమిటీని కోరుతాం
-నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
ఇప్పటికైనా పాఠశాలల విలీన ప్రక్రియను ఆపకపోతే పులివెందులలో బటన్ మోహన్ రెడ్డి కూడా ఓడిపోయే ప్రమాదం ఉంటుందని , రాష్ట్రంలో ప్రాథమిక స్కూళ్ల ను, హైస్కూల్లో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే, పెను ప్రమాదం పొంచి ఉన్నదని హెచ్చరించారు. ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్న పిల్లలు లేని తల్లిదండ్రులు కూడా, తోటి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని చూసి సహించరని పేర్కొన్నారు.
సర్వేల ఆధారంగా, లేకపోతే మరే ఇతర కారణంగా విద్యాశాఖ మంత్రి సత్తి బాబు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారో, ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. ప్రాథమిక పాఠశాలలను మాయం చేస్తే రానున్న ఎన్నికలలో 175 కాదు కదా… ప్రజలు మన ఉనికినే మాయం చేస్తారని రఘురామకృష్ణం రాజు తీవ్ర హెచ్చరికలను చేశారు.
ప్రాథమిక పాఠశాలలను, హై స్కూల్లో విలీనం చేసే ప్రక్రియను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ… తక్షణమే విలీన ప్రక్రియను ఆపివేయాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో, అంతకుముందు ప్రతి గ్రామములో ప్రాథమిక పాఠశాలలను దాతల సహకారంతో ఏర్పాటుచేసి, అభివృద్ధికి కృషి చేశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ప్రాథమిక పాఠశాలలను, హైస్కూల్లో విలీనం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, తల్లిదండ్రులు ఆందోళన లను నిర్వహిస్తున్నారని చెప్పారు. త్వరలోనే ఇది పెను ఉద్యమంగా మారే అవకాశాలు లేకపోలేదన్నారు. ఇప్పటికే 11 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు, స్కూళ్ల ను మానివేసినట్లుగా ప్రముఖ దినపత్రికల అయినా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో గణాంకాలను ప్రచురించాయని పేర్కొన్నారు.
గ్రామాలలో ప్రాథమిక పాఠశాలలను ఎత్తి వేయడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలలో చేర్పించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో ఎలాగో విద్యార్థులు లేరు కదా అని చెప్పి, స్కూల్లో స్థలాలను అమ్మి వేసే అవకాశాలు లేకపోలేదన్నారు. విద్యా వ్యవస్థను చిన్న భిన్నం చేస్తూ, సర్వనాశనం చేసే నిర్ణయాలతో విద్యాశాఖ మంత్రి సత్తిబాబు తనకు అధికారం ఉందనుకొని విలీన ప్రక్రియ పై ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కోరగా, ఇప్పటికీ 40 మంది వ్యతిరేకించినట్లు తెలిసిందన్నారు.
ఇక 151 మంది ఎమ్మెల్యేలలో జగన్మోహన్ రెడ్డి మినహాయించి, మిగతావారు మూడు నాలుగు రోజుల వ్యవధిలో విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తూ లేఖలు రాసే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఈ నిర్ణయాలు ఇలాగే ఉంటే, రాష్ట్రంలో మళ్లీ ఈ ప్రభుత్వం వచ్చే అవకాశాలు లేవన్న రఘురామకృష్ణంరాజు, రేపటి పాలకులు విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసానిచ్చే విధంగా హామీ ఇవ్వాలని కోరారు.. వ్యవస్థలను పాడు చేసుకుంటే, వ్యవస్థలను తిరిగి బాగు చేసుకోవాలంటే అవస్థలు పడాల్సి ఉంటుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. ప్రాథమిక పాఠశాలలను హైస్కూల్లో విలీనం చేసే ప్రక్రియను తక్షణమే ఆపి, తమ పాఠశాలలను తమకు అప్పగించాలని ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలన్నారు.
బాత్రూంలో బాబాయిని వేసేసిన వారిని ఎందుకు పట్టుకోలేదు?
లక్ష్మీబాయి పొలంలో ఇసుక కప్పెట్టిన నాలుగు మద్యం సీసాలను పట్టుకున్న పోలీసులు, బాత్రూంలో బాబాయిని వేసేసిన వారిని ఎందుకు పట్టుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు తమ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అలాగే కోడి కత్తి కేసులో ఎన్ఐఏ కూడా శ్రీనివాస్ ను అక్కడ పెట్టారని, ఆయన ప్రాణాలకు ఏ ప్రమాదం దాగి ఉన్నదని అనుమానం వ్యక్తం చేశారు.
జగన్మోహన్ రెడ్డి పై చంద్రబాబు నాయుడే కోడి కత్తి ద్వారా హత్య ప్రయత్నం చేశారని గతంలో తమ పార్టీ నేతలు ఆరోపించారని గుర్తు చేశారు. నిజంగానే కోడి కత్తి కేసులో చంద్రబాబు ప్రమేయం ఉంటే, కేంద్రంతో సఖ్యతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ కేసును ఎందుకని పురోగతి చేయించడం లేదని ప్రశ్నించారు. లక్ష్మీ బాయ్ లిక్కర్ కేసులను ఛేదించిన పోలీసులకు బాబాయి బాత్రూం హత్య కేసు, కోడి కత్తి కేసులను అప్పగించే ప్రతిపాదన ఏమైనా ఉంటే పరిశీలించాలని ఎద్దేవా చేశారు.
జగదీప్ బీసీ కాదు..జాట్ కులస్తుడు
ఎన్ డి ఏ ప్రతిపాదించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ దనుకర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, ఆంధ్రప్రదేశ్ లో చౌదరి, రెడ్డి మాదిరిగా, నార్త్ ఇండియాలో బలమైన జాట్ కులానికి చెందిన వ్యక్తి అని రఘురామకృష్ణం రాజు తెలిపారు. జగదీప్ దునకర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లే, తాము స్వచ్ఛందంగా మద్దతునిస్తున్నామని తమ పార్టీ పెద్దలు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నట్లుగా ప్రజలను భ్రమలలో పెట్టడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమేనని ఆయన విమర్శించారు. రాజ్యసభలో పదవులన్నీ విజయ సాయి రెడ్డికి, లోక్ సభలో పదవులన్నీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కట్టబెడుతూ, సామాజిక న్యాయం గురించి మాట్లాడడం విస్మయంగా ఉందన్నారు.
ప్రతిపక్ష నేతగా చెప్పిందేమిటి… ఇప్పుడు చేస్తున్నది ఏమిటి??
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పింది ఏమిటి… ఇప్పుడు చేస్తున్నది ఏమిటి అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… అబద్ధాలు చెబితే, మోసాలు చేస్తే ఆ తరువాత చెప్పులు, చీపుర్లు చూపిస్తామని ఏ రోజైతే ప్రజలు నిలదీస్తారో… ఆ రోజే ఈ రాజకీయ వ్యవస్థ మారుతుందని అన్నారు. అయితే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ప్రశ్నిస్తే, వారిపై లిక్కర్ కేసులు, ప్రశ్నించినవారు ఆత్మహత్యలు చేసుకోవడం… హత్యలకు గురి కావడం, లేదంటే కాళ్లు కట్టి చితకబాదడం చేస్తున్నారన్నారు.
మాస్కులు లేవని ప్రశ్నించిన పాపానికి దళితుడైన ఒక వైద్యం నడిరోడ్డుపై బట్టలిప్పించి అవమానానికి గురి చేశారని, దానితో ఆ అవమానం భరించలేక ఆయన చనిపోయారన్నారు. నోటితో మాట్లాడినందుకు ఎంపీ అని కూడా చూడకుండా కాళ్లు కట్టేసి చితకబాదారని గుర్తు చేశారు. ఇక ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై లిక్కర్ కేసులు, గంజాయి కేసులు సర్వసాధారణమైనాయని చెప్పారు. ఇప్పటికైనా బటన్ మోహన్ రెడ్డి, ఆయన వందిమాగాదులు ప్రజలు ప్రశ్నించాలో … లేదో ? చెప్పాలన్నారు.
ముంపు ప్రాంతంలో మహానగరమా?
రాజమండ్రిలోని ముంపు ప్రాంతంలో మహానగరం నిర్మించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం విస్మయాన్ని కలిగిస్తుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. మహానగర నిర్మాణం కోసం సేకరించిన 600 ఎకరాల భూమి, పూర్తిగా జలమయమయిందని చెప్పారు. దానికి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. దాదాపు మనిషి మునిగి పోయేంత ఎత్తున జలమయమైన భూములు ఇళ్లను నిర్మించాలంటే, గుట్టలు తెచ్చి కప్పెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు. ఈ భూముల్లో 120 కోట్ల రూపాయల కొట్టేసిన వారి గురించి చెట్టును పుట్టను గుట్టలను అడిగినా చెబుతారని అన్నారు.
సాక్షి ఛానల్ కు అనుమతులు లేవు
సాక్షి ఛానల్ అప్ లింక్, డిస్ లింకింగ్ కు అనుమతులు లేవని, ఈ విషయాన్ని ఐబి మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖలు నోటీసులు జారీ చేయడం జరిగిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అనుమతులు లేని సాక్షి ఛానల్ ఎందుకు మూసి వేయకూడదో చెప్పాలని, యాజమాన్యానికి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగిందని, దానికి యాజమాన్యం జవాబు ఇచ్చిందన్నారు.
అయినా కూడా, సాక్షి ఛానల్ యాజమాన్యం జవాబుతో సంతృప్తి చెందని హోం మంత్రిత్వ శాఖ మూసివేతకు ఉత్తర్వులు జారీ చేస్తే, ఆ చానల్లో పని చేసే 20 మంది ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారని తెలిపారు. కోర్టు ఈనెల ఏడవ తేదీ వరకు స్టేటస్కో ఉత్తర్వులను జారీ చేయగా, ఆ కేసు ఈనెల 27వ తేదీన లిస్ట్ అయిందని తెలిపారు. అయినప్పటికీ, ప్రస్తుతం స్టెటస్కో అమలులో లేనందున, తాను ఐబి, హోం మంత్రిత్వ శాఖలో ప్రతినిధులను కలిసి సాక్షి ఛానల్ మూసివేతకు తనవంతు ప్రయత్నాన్ని నిర్భయంగా చేస్తానని చెప్పారు. తాను ధర్మ పోరాటం చేస్తానని, ఇతరుల మాదిరిగా నకిలీ పోలీసులను పెట్టి హత్యలు చేయించడం తనకు చేతకాదు అన్నారు. ప్రతిపక్ష నేతగా, పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి చెప్పింది తాను చేయమని కోరుతున్నానని తెలిపారు.
న్యాయస్థానం కృష్ణుడి మాదిరిగా కాపాడుతుందా?
ఋషికొండను ద్రౌపది వస్త్రపహరణ మాదిరిగా తొలిచి వేస్తున్నారని, ద్రౌపదిని శ్రీకృష్ణుడు కాపాడినట్లుగా… ఋషికొండను న్యాయస్థానం కాపాడాలని రఘురామకృష్ణం రాజు కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ఋషికొండ విధ్వంసం పై దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిటిషన్లు తమను ఇంప్లిడ్ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఋషికొండ ప్రకృతి విధ్వంసం పై నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరనున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా లెక్క చేయని విశ్రాంత ఉద్యోగుల తో కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతామని చెప్పారు. ఋషికొండ ప్రకృతి విధ్వంసం గురించి, విశాఖ వాసులు తమకు అదనపు సమాచారాన్ని అందజేస్తే, పిటిషన్ మరింత సమర్థవంతంగా సిద్ధం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు.
విచారణకు ఢిల్లీ పోలీసులు సిద్ధం
ముఖ్యమంత్రి కార్యాలయం తో పాటు కొంతమంది పోలీస్ అధికారులు, తెలంగాణ పోలీసు అధికారి తో కుమ్మక్కై తన ప్రాణాలను కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరిని సస్పెండ్ చేయడం పట్ల రఘురామకృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రక్షణ గురించి ఇప్పటికే ఢిల్లీ పోలీసులను ఆశ్రయించానని, అలాగే తాను ఇచ్చిన ఫిర్యాదు పై కేసు కూడా నమోదు చేయాలని కోరానని తెలిపారు. దానికి ఢిల్లీ పోలీస్ కమిషనర్ స్పందిస్తూ, త్వరలోనే విచారణ చేపడతామని లేఖ రాయడం జరిగిందన్నారు.
రాజేష్ కు అభినందనలు
కొత్తపేటలో దళితులకు జరిగిన అన్యాయం పై పోరాడుతున్న మహాసేన రాజేష్ కు రఘురామ కృష్ణంరాజు అభినందనలు తెలియజేశారు. రాజేష్ కు ఏదైనా ఇబ్బంది ఎదురైతే తన వంతు సహకారాన్ని అందజేస్తానని తెలియజేసిన ఆయన, తనకు ఏదైనా కష్టం ఎదురైనప్పుడు అండగా నిలవాలని కోరారు.